స్వచ్చోద్యమ చల్లపల్లి – 2086* వ నాటి శ్రమదానం
మంచు, చలి ముందుకు వచ్చిన ఈ శనివారం (19.12.2020) నాటి బ్రహ్మ ముహూర్తంలో – 4.29 సమయంలో 16 మంది, మరి కొద్ది నిముషాల వ్యవధిలో మిగిలిన కార్యకర్తలు ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలోని చిల్లల వాగు గట్టు మీద గల శ్మశాన వాటిక దగ్గరకు చేరుకొని, ఆరితేరిన పారిశుద్ధ్య కార్మికుల్లాగా – కత్తులు, గొర్రులు, పారలు, పలుగులు, చీపుళ్ళ వంటి ఆయుధధారులై 6.12 దాక చేసిన ‘స్వచ్చంద శ్రమదానంతో స్వచ్చ – సుందర – సమగ్ర చల్లపల్లి’ సార్ధకమయింది.
డిసెంబరు మాసపు చలిని ధిక్కరించి, మంచు నధిగమించి, డాక్టర్లు, ఆటో మెకానిక్ లు, గృహిణులు, ప్రవాసాంధ్రులు, వృద్ధులు – వెరసి 43 మంది 100 నిమిషాలు చేసిన గ్రామ బాధ్యతా నిర్వహణంతో అసలే స్వచ్చ – శుభ్ర – హరిత సుందరంగా ఉన్న తరిగోపుల ప్రాంగణం, పాత కర్మల భవనం, పేరుకు చెత్త కేంద్రమైనా మళ్ళీ చూడాలనిపించే డంపింగ్ కేంద్రం, బహుశా రాష్ట్రంలో మరెక్కడా లేనంత ఆకర్షణీయంగా ఉన్న ‘చెత్త నుండి సంపద తయారీ నిలయం’, ఏడేళ్ళ నాడు చూసి, మళ్ళీ ఇప్పుడే చూసే వాళ్ళు నమ్మలేని శ్మశానం వంటివి మరింత స్వచ్చ శుభ్రతలను సంతరించుకొన్నవి. వీటికి అనుబంధంగా పెరుగుతున్న పూలతోటల్లోనే పాతికమందికి పైగా స్వచ్చ కర్మవీరులు ఎంతో ఇష్టంగా చేసిన కృషితో ప్రధాన సిమెంటు మార్గానికి ఇరు ప్రక్కల కొలువు తీరిన బంతి, చేమంతి, బిళ్ళ గన్నేరు వంటి పూలమొక్కలన్నీ విరగబూసిన పుష్పాలతో హర్షం ప్రకటించాయి.
“దృష్టిని బట్టే వికసిస్తుంది సృష్టి...” అని వేదంలో ఉందష! మరి నావంటి వాళ్ళ దృష్టిని బట్టి ఈ చల్లపల్లి స్వచ్చ సైనికులది సకాల – సానుకూల – సముచిత – ప్రజా శ్రేయస్కర ఉద్యమం! అన్ని గ్రామాల వారు నిస్సంకోచంగా అనుష్టించదగిన ఉషోదయ మంత్రం! ఎవరైనా నేటి కాలంలో పాటించదగిన సముచిత - ప్రజా శ్రేయస్కర ఉద్యమం ప్రభుత్వాలో, నాయకులో ప్రబోధించకుండానే – స్వయం ప్రేరిత సంకల్పంతో 2086* రోజులుగా నడుస్తున్న వినూత్న చరిత్రం!
6.20 సమయంలో డాక్టరు రామకృష్ణ ప్రసాదు గారి సహర్షాత్మక సమీక్షతోనూ, కాఫీ సేవనంతోనూ ముగిసిన నేటి మన శ్రమదానానికి రేపటి కొనసాగింపు కూడ శ్మశాన – డంపింగ్ కేంద్రాల దగ్గరే. కనుక మన పునర్దర్శనం రేపు – ఆదివారం – మరింతమంది సేవాతత్పరులతో వేకువ 4.30 సమయంలోనే!
అది సర్వ శిరోధార్యం.
శ్రమ బంధుర సుమసుందర సత్కార్యాచరణమిచట
సమభావం, త్యాగ గుణం స్పందించే లక్షణ మట
ఏకీకృత గ్రామ సేవ కిదె గొప్ప ఉదాహరణం
స్వచ్చోన్నత చల్లపల్లి సర్వ శిరో ధార్యంబట!
నల్లూరి రామారావు
సభ్యులు- మనకోసం మనం ట్రస్టు
19.12.2020.