స్వచ్చోద్యమ చల్లపల్లి పధంలో 2087* వ నాటి ప్రయాణం
నేటి (20.12.2020) వేకువ 4.28 కే ఉత్సాహభరితంగా మొదలైన శ్మశాన పరిశుభ్ర – సుందరీకరణకు ఉపక్రమించిన చల్లపల్లి స్వచ్చోద్యమకారులు (కొద్ది మంది ట్రస్టు కార్మికులతో సహా) 49 మంది. మరి వీరి ఉల్లాస పూరిత స్వచ్చతా వ్యవసాయంతో పునీతమైన జాగాలు నిన్నటి తరువాయిగా మిగిలిన దారులు, చిల్లలవాగు గట్టు, చెత్త కేంద్ర పరిసరాలు, దహన వాటికల చుట్టు ప్రక్కలు, మరికొంత ఖాళీ ప్రదేశము.
30 వేల మంది చల్లపల్లి గ్రామస్తుల సౌకర్యం కోసం రూపుదిద్దుకొన్న ఈ రుద్రభూమి చిన్నదేమీ కాదు డంపింగ్ యార్డుతో కలిపి 4 ½ ఎకరాలు. సాహసికులైన ఈ కార్యశూరులేమో 49 మంది. ఐతే - ఈ దినం ఆదివారం కావడం, మంచు, చలి కొంచెం తగ్గడంతో వాళ్ళ ప్రయత్నం క్రమ పద్ధతిలో చురుకుగా సాగింది. ఈ విషయం వాళ్ళ ముఖాల్లోనూ, మాటల్లోనూ తెలిసిపోతూనే ఉన్నది! దూరస్తులైన క్రొత్తవాళ్ళకు చీకటిలో – శ్మశానంలో ఈ మహిళలు, పిల్లలు, కొందరు వృద్ధులు నిర్భయంగా – నిస్సంకోచంగా చితుల ప్రక్కన పనిచేయడం ప్రశ్నార్ధకం కావచ్చు గాని, వందలాది రోజులు - వేలాది పనిగంటలు శ్రమించి ఒక అనార్దృత – కళంకిత – సకల కల్మషభూయిష్ఠ – భీభత్స ప్రాంతాన్ని తమ కష్టంతోనూ, కష్టార్జితంతోనూ ఇలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఈ స్వచ్చ సైనికులకు మాత్రం 7 సంవత్సరాల నుండి అది షరా మామూలే! ఇంతటి శ్మశాన సౌందర్య సాధనకు ఎందరు దాతలు సహకరించారో – అవగాహనారహితులైన కొందరు గ్రామ సహోదరుల నుండి కార్యకర్తలెన్ని అడ్డంకులధిగమించారో నాకు బాగా గుర్తున్నది. ఆ వదాన్యులకు, ఈ స్వచ్చ కర్మిష్టులకు నా అభివందనాలు! చరిత్రను గమనిస్తే – ఎప్పుడైనా త్యాగాలు కొందరే చేస్తారు. ఫలితాలను అందరూ పంచుకొంటారు!
కార్యకర్తల నేటి స్వచ్చ కృషి విశేషాలు మరికొన్ని :
- సరిగ్గా ఏడేళ్ళ నాడు ఇదే డిసెంబర్ 20 వ తేదీన ఈ 2087* దినాల సుదీర్ఘ చల్లపల్లి స్వచ్చోద్యమ ప్రయాణం తొలి అడుగు పడింది.
84 ఏళ్ల పైబడిన సీనియర్ డాక్టర్ శ్రీ దుగ్గిరాల శివప్రసాదరావు గారు చాలా కాలం నుండి “మనకోసం మనం” ట్రస్టుకు నెలవారిగా ఇస్తున్న చందా తాలూకు రాబోవు 12 నెలల చెక్కులనూ (500 రూపాయల చొప్పున) మేనేజింగ్ ట్రస్టీ – DRK ప్రసాదు గారికి ఇచ్చారు. (ఈ సీనియర్ సర్జన్ గారు చల్లపల్లి గ్రామాభివృద్ధి కోసం ఇప్పటి వరకు ఖర్చు చేసినది దాదాపు పదిలక్షలు రూపాయలు)
- తన పేరు ప్రకటించనిష్టపడని ఒక అజ్ఞాత దాత ప్రతి సంవత్సరం ఇస్తున్నట్లే ఈ సంవత్సరం కూడా 5000/- సమర్పించారు.
- కోమలానగర్ నివాస ప్రాంతానికి చెందిన యార్లగడ్డ విజయసారధి గారు తన భార్య సంస్మరణార్ధం ఈ స్వచ్చోద్యమానికి Rs. 10,000/- చెక్కును చల్లపల్లి రోటరీ అధ్యక్షులైన నూతక్కి శివబాబు గారి ద్వారా డాక్టరు గారికి అందజేశారు.
వీరందరి సహృదయతకు ఉద్యమ కారుల కృతజ్ఞతాభివందనాలు.
- మాలెంపాటి అంజయ్య గారి స్వగ్రామ స్వచ్చ – శుభ్ర – సుందర సంకల్ప నినాదాలు, అందుకు మిగిలిన కార్యకర్తల సమాధానాలు రుద్ర భూమిలో మారుమ్రోగినవి.
మొత్తం మీద, ఈ పురాతన చల్లపల్లి లో ఈ కార్యకర్తలది నడిచిన, నడుస్తున్న, నడవబోతున్న కొత్త చరిత్ర! దానికి నా స్వాగతాంజలి!
ఇక, మన తదుపరి గ్రామ బాధ్యతల కోసం మరొకమారు మరింత ఎక్కువ మందిమి చేరవలసిన స్థలం కూడ శ్మశాన పరిసరమే. సమయం కూడ రానున్న బుధవారం (23.12.2020) వేకువ 4.30.
రెండు వేరు దారులు ఇవి.
సగటు జనులు ఆద మరచి సుఖ నిద్రలొ మునుగు వేళ
సుఖమయ తమ బ్రతుకు నావ చుక్కానిని పట్టు వేళ
ఎవరి సౌఖ్యములు వారే ఇంత వెతుక్కొనే చోట –
స్వచ్చ సైనికులు మాత్రం బ్రహ్మ ముహూర్తాన లేచి
గ్రామ సుఖం కోసమింత కష్టించుట గమనించితి!
నల్లూరి రామారావు
సభ్యులు- మనకోసం మనం ట్రస్టు
20.12.2020.