స్వచ్చోద్యమ - సుందర చల్లపల్లిలో 2088* వ నాడు.
నేటి (23.12.2020) వేకువ 4.26 సమయంలో – చలపులి మంచు మీద ఎక్కి స్వారీ చేస్తున్న వేళలో – ఊరి చెత్తనూ, దుర్గంధాన్ని సొంతం చేసుకొంటున్న డంపింగ్ యార్డు దగ్గర గుమి గూడిన 28 మంది స్వచ్చోద్యమ వీరులు 6.10 వరకు కొనసాగించిన సమరంతో అక్కడి 3 ప్రధాన ప్రదేశాలు, సిమెంటు బాటలు కశ్మల రహితంగానూ, స్వచ్చ సుందరం గానూ కనిపిస్తున్నవి.
దీన్నే మరికొంత వివరించాలంటే –
ఒక ప్రక్క నుండి చెత్త కేంద్రపు పొగ, దుర్వాసన తగులుతుండగా, చలినీ మంచునూ, దుర్గంధాన్నీ పట్టించుకోని స్వచ్చ సైనికులు 3 ముఠాలుగా చీలిపోయి,
- ఒక ముఠా చిల్లల వాగు గట్టు మీద గత వర్షాలకు పిచ్చి, ముళ్ళ మొక్కలు తీగలు పెన వేసుకున్న చోటులో చీకట్లోనే – ఎగుడుదిగుడు నేల మీదే గంటన్నర పాటు శ్రమించి, ఆ చోటుకు క్రొత్త అందాన్నీ, విశాలతనూ తెచ్చారు.
- మహిళలతో గూడిన సుందరీకరణ బృందం సిమెంటు మార్గాన్ని ఊడ్చి, ఇరు ప్రక్కల పనికిరాని మొక్కల్ని, తుక్కును తొలగించి, బాట ప్రక్క గుంటలను రాళ్ళు రప్పలతో నింపి, కొంత ఖాళీ జగాను పారలతో తమకు నచ్చిననంతగా సుందరీకరించారు.
- మూడవ ముఠా మిగిలిన రోడ్లను, ప్రధాన దారి దక్షిణ దిక్కును చీపుళ్ళతోనూ, కత్తులతోను, గొర్రులతోను శుభ్రపరిచారు.
- చివరి పావుగంట సమయంలో కొందరు వ్యర్ధాలన్నిటిని ట్రాక్టర్ లో నింపి, దగ్గరలోని చెత్త కేంద్రానికి తరలించారు.
- 82 ఏళ్ల పశువైద్యుడొకరు ప్రత్యక్షంగానూ, 81 ఏళ్ల విశ్రాంత ఉపాధ్యాయుడు దూరవాణి ద్వారా పరోక్షంగాను నేటి కృషిలో సహకరించారు.
ఇక నా విషయానికొస్తే – ఈ స్వచ్చోద్యమంలో ఆది నుండీ పాల్గొంటూ, చాతనైనంత శ్రమించడంతో బాటు – ఈ దైనందిన స్వచ్చోద్యమాన్ని నిత్యం దగ్గరగా కళ్ళారా చూస్తూ, మనసార అనుభవిస్తూ, తనివితీర వర్ణిస్తూ రాయడం – నాకొక అదనపు అదృష్టం!
మిగిలిన మన గ్రామ సోదరులు సైతం వీలు చిక్కినప్పుడు – ఈ పవిత్ర స్వచ్చ కర్మలో పాల్గొని, స్వచ్చ సైనికులు పొందే ఆనందాన్ని పంచుకోవాలని కోరుకోవడం అత్యాశకానేకాదు!
6.15 కు కాఫీ కషాయ సేవన వేళ కార్యకర్తలంతా ఒక వంక తమ నేటి గ్రామ బాధ్యతా నిర్వహణను, తత్ఫలితాన్నీ చూసుకొంటూ – డాక్టర్ గారి సమీక్షను ఆలకిస్తూ, విజయా జూనియర్ కళాశాలలో ఉపన్యాసకుడు శ్రీను గారి గర్జా సదృశ స్వచ్చ – సుందర సంకల్ప నినాదాలకు బదులిస్తూ ఆ తరువాత గృహోన్ముఖులయ్యారు.
మన తదుపరి స్వచ్చ – స్వస్త ప్రయత్నం కూడ ఈ చెత్త సంపద తయారు కేంద్రం దగ్గరే. శని – ఆది వారాలు వేకువ ముహూర్తంలో ఇక్కడే కలుసుకొందాం.
తరగని ఒక స్వచ్చ దీప్తి
“ఎవరి ఇల్లు? ఏ వీధి? ఏకులాల వార్డులు ఇవి?
ఏం లాభం? ఏం నష్టం? ఇక్కడ శ్రమదానంతో?..”
వంటి దురాలోచనలకు – వ్యర్ధ శుష్క చర్చలకూ
తావులేని - స్వచ్చ దీప్తి తరగని స్వచ్చోద్యమమిది!
నల్లూరి రామారావు
సభ్యులు- మనకోసం మనం ట్రస్టు
23.12.2020.