2091* వ రోజు....           30-Dec-2020

స్వచ్చోద్యమ చల్లపల్లి - 2091* వ పనిదినంలో ఊరి బాధ్యతలు.

 

నేటి (బుధవారం – 30.12.2020) వేకువ 4.16 కే మొదలైన స్వచ్చోద్యమ సందడి 6.10 దాక కొనసాగింది. సొంత ఊరి మెరుగుదల ప్రయత్నంలో కలిసి వచ్చిన శ్రమదాతలు 32 మంది. ద్విగుణీకృత స్వచ్చ – శుభ్ర – సుందర ప్రదేశాలు రెండు – ఒకటి వడ్లమరకు, 6 వ నంబరు పంట కాల్వకు నడిమి చోటు, రెండోది పంట కాలువ వంతెన – ఆస్పత్రుల – జూనియర్ కళాశాల – స్టేట్ బ్యాంకుల మధ్య ప్రాంతం.

          ఈ నాటి స్వచ్చంద శ్రమదానంలో దుబాయి నుండి ఒకరు, బెంగళూరు నుండి ఒకరు, రామానగరం – చల్లపల్లి నుండి తక్కినవారు పాల్గొన్నారు.

 

- పంట కాలువ పడమటి గట్టు మీద చిన్న డంపింగ్ యార్డో, చిట్టడివోగాని కార్యకర్తల కళ్ళు గప్పి గత నిరంతర వర్షాకాలంలో తయారయింది. త్రాగి పడవేసిన కొబ్బరి బొండాలు, వందల్లోనూ, వేలల్లోనో పోగుబడ్డాయి. రకరకాల పిచ్చి – ముళ్ల మొక్కలూ, ప్లాస్టిక్ సంచులూ, ఖాళీ (మద్యం) సీసాలూ నిండిపోయిన – చీకటి గా ఉన్న ఆ చోటు ఈ 100 నిముషాల భగీరధ ప్రయత్నంతోను, డజను మంది కార్యకర్తల ప్రమేయంతోను తెల్లవారి చూస్తే మనసులు కుదుట పడే విధంగా మారిపోయింది. “శ్రమయేవ జయతే” అనే సూక్తి మరొక మారు నిరూపితమయింది. ఐతే – ఆచోటునలావదిలేయరాదనీ, పచ్చని –పూల మొక్కలు నాటి, పెంచి, చిన్న పాటి ఉద్యానం సృష్టించాలనీ కార్యకర్తల నేటి నిర్ణయం.

          - చీపుళ్ళ శ్రమదాతలు సువిశాలమైన బందరు జాతీయ రహదారి మీది దుమ్మును, టీ కప్పుల్ని, ఇసుకను, ఇతర వ్యర్ధాలను ఊడ్చి,  ట్రాక్టర్ లోకి ఎత్తి, డంపింగ్ యార్డుకు చేర్చి తమా ఊరి పేరును సార్ధకం చేశారు. ఆస్పత్రుల ముందు భాగం, బ్యాంకు ఎదుట రంగు రాళ్ళ ప్రదేశం, టీ షాపుల, బడ్డీ కొట్ల వ్యర్ధాలు, జూనియర్ కళాశాల, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల, పండ్ల దుకాణాల జాగాలన్నీ కార్యకర్తల స్వచ్చ దీక్షతో శుభ్ర – సుందరంగా మారిపోయినవి.

30 వేల మంది గ్రామస్తులలో కొందరి స్వచ్చతా నిర్లిప్తతకు, నిశ్శబ్దతకు, నిర్లక్ష్యతకు ఈ 30 మంది స్వచ్చోద్యమ కారుల నేటి సముచిత సమాధానమిది! అనివార్యమైన గాంధేయమార్గమిదే!

 

6.20 సమయంలో కాఫీ, టీ ఆస్వాదనల వేళ ఉడత్తు రామారావు, ఉడత్తు బాబు గార్ల బిస్కెట్ పొట్లాల పంపిణీ, స్వచ్చోద్యమ వ్యయాల నిమిత్తం చెరొక 5 వేల రూపాయల విరాళసమర్పణలు జరిగిపోయినవి. ప్రతి యేటా మన స్వచ్చోద్యమానికి సహృదయంతో రూ. 5,000/- క్రమం తప్పక చుండూరి మెహర్ ప్రభాకరరావు గారు - తమ తండ్రి కీ.శే. చుండూరి మెహర్ వెంకట రామకృష్ణ సత్య వరప్రసాద్ గారి పేర ఇస్తున్న విరాళం కూడా అందినది. డాక్టర్ DRK గారి దైనందిన సహర్షాసమీక్షతో బాటు - బెంగళూరు నుండి వచ్చిన స్వచ్చ - సుందర హితాభిలాషి ఉడత్తు విజయ్ కుమార్ గారి ఆనందానుభూతి వ్యక్తీకరణ నేటి విశేషాలు.

 

కార్యకర్తల రేపటి గ్రామ కర్తవ్య నిర్వహణం కూడా బందరు రహదారి మీదనే – చిన్నారి పిల్లల వైద్యశాల వద్ద. రేపటి (గురువారం – 31.12.2020) వేకువ 4.30 నిముషాలకు హాజరౌదాం.

 

         ఎందరిదో ఈ బాధ్యత

స్వచ్చోద్యమ చల్లపల్లి కధాక్రమం బెట్టి దనగ –

సామాజిక ఋణ విముక్తి సాధన ఒక పునాదిగా

వ్యాపారులు, ఈ గృహిణులు, ఈ గురువులు, విద్యార్ధులు

స్వయం విధిత బాధ్యతతో సంచలించు ఒక వేడుక!

నల్లూరి రామారావు,

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త

30.12.2020.