స్వచ్ఛ సంచిత సుందర చల్లపల్లి లో 2094* వ నాటి శ్రమదానం
ఈ శనివారపు (02.01.2021) వేకువ 4.24 – 6.10 సమయాల నడుమ 100 నిముషాలకు పైగా – 27 మంది గ్రామాభ్యుదయకారుల ఆదర్శవంతమైన శ్రమదానంతో చిల్లలవాగు దక్షిణాన – డంపింగ్, చెత్త సంపద కేంద్రాల దగ్గర మూడు – నాలుగు చోటులు మరిన్ని మెరుగులు దిద్దుకొన్నవి, మరి కాస్త సుందరీకృతమైనవి.
నేటి కర్యకర్తల కృషి ప్రధానంగా 3 చోట్ల, మూడు విధాలుగా:
- మొదటిది - ఘాటు వాసనల, పొగల ఉత్తరాన చిల్లలవాగు గట్టు. అక్కడ కత్తులతో, దంతెలతో సిద్ధమైన 8 మంది శ్రమదాన వీర విహారం చూసి తీరాల్సిందే! గ్రామం మేలు పట్ల వీళ్ళ కెందుకింత పట్టుదలో, ప్లాస్టిక్ ల మీద – కాలుష్యాల మీద వీళ్ళ కసి ఏమిటో అందరూ ఆలోచించాల్సిందే! ముళ్ళ కంపలను, తీగలను, అడ్డదిడ్డంగా చిక్కుపడి పెరిగిన అన్నిటినీ చకచకా నరికి, లాగి గుట్టలు పేరుస్తున్న (ఇదంతా స్వార్ధం కోసం కానే కాదు -) ఈ అష్ట స్వచ్ఛ సైనికుల అభినివేశాన్ని అభినందించక తప్పదు. (ఇందులో ఒకాయన – అదేమి ఆనందాతిశయమోగాని – పావుగంట కొక మారు పని ఆపి, తాను శుభ్రపరచినంత మేర చూసుకొంటూ నృత్యం చేస్తున్నాడు – అది బహుశా ‘నిస్వార్ధ శ్రమైక జీవన సౌరభం’ కావచ్చు!)
- రెండవది – డంపింగ్ కేంద్ర పడమటి దిశగా, సిమెంటు మార్గానికి ఉత్తర, దక్షిణ భాగాల సుమారు అరెకరాన్ని ట్రాక్టర్ తో దున్నడం, బైట పడ్డ ప్లాస్టిక్ ల ఏరివేత. భవిష్యత్ లో బహుశా ఇక్కడ కూరల – పండ్ల మొక్కల పెంపకం ఉండవచ్చు!
- చెత్త సంపద కర్మాగారం దగ్గరి 2 భాగాలలో సుందరీకరణ బృందం చేసిన శ్రమదానం మూడోది. ఈ స్థలాలన్నీ మున్ముందు రసాయన – పురుగు మందులు లేని ఆరోగ్యవంతమగు ఉత్పత్తి భూములు కావచ్చు.
తమ కోసం కాక – పరుల కోసం – ప్రతి ఫలాపేక్ష రహితంగా ఇందరి సుదీర్ఘ నిరంతర కృషి వెనుక ఉన్న ఆశయం ఎంత ఉదాత్తమో కదా!
6.20 సమయంలో కాఫీలనాస్వాదిస్తూ – సరదా కబుర్లు (అందులో ఎక్కువ భాగం గ్రామ స్వచ్ఛ ప్రణాళికలే!) సాగిస్తూ డాక్టర్ గారి నేటి స్వచ్చంద శ్రమదాన సమీక్షను హర్షిస్తూ – జాస్తి జ్ఞాన ప్రసాదు గారి త్రిగుణాత్మక గ్రామ స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య సంకల్ప నినాదాలను పునరుచ్ఛరిస్తూ కార్యకర్తలు 6.30 కి గృహోన్ముఖులయ్యారు.
రేపటి (ఆదివారం) మన సామాజిక బాధ్యతల కోసం వేకువ 4.30 కు మరింత ఎక్కువ మందిమి ఈ చెత్త సంపద నిర్మాణం దగ్గరే కలుసుకొని, శక్తి మేరకు పాటుబడదాం.
కాల విపరిణామం.
ఆది మానవుల కాలం – అదొక ఆట విక ధర్మం
పురాణాల యుగం కాస్త పురోగతికి ఒక చిహ్నం
చారిత్రక కాలమెల్ల ఆధిపత్య పోరాటం
ప్రజాస్వామ్యయుగం నేడు స్వస్తతలకు ఆరాటం!
నల్లూరి రామారావు,
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
02.01.2021.