స్వచ్చ సుందర చల్లపల్లి ఉద్యమంలో 2095* వ నాటి విక్రమాలు.
ఈ ఆదివారం (03.01.2021) నాటి గ్రామ స్వచ్చోద్యోగంలో పాల్గొన్నది అష్టమహిళలతో సహా 35 మంది. ఎక్కడి చల్లపల్లి – గంగులవారిపాలెం దారి, ఎక్కడి డంపింగ్ కేంద్ర ఆగ్రభాగం? 2 ½ కిలోమీటర్ల పైగా దూరమూ, చలీ – మంచూ – చీకటీ! వేకువ 4.25 సమయంలో అక్కడ హాజరైన ఈ బాధ్యతా ప్రేరితులు 6.10 దాక శ్రమించడం – అది బ్రహ్మ వారి నుదుట వ్రాసిన “ఖర్మ” కాదు – తమ గ్రామ సమాజం పట్ల బాధ్యతతో స్వయంగా పూనుకొన్న “సత్ కర్మ!”
ఇందరు విబ్భిన్న శ్రామికుల గట్టి పూనికతో – ఆరేడు రోజుల ప్రణాళికాబద్ధమైన కష్టంతో – చెత్త కేంద్ర క్రమబద్ధీకరణ, చెత్త సంపద కేంద్ర పరిసర సుందరీకరణ, అక్కడి ఖాళీ ప్రదేశాల శుభ్ర – స్వచ్చీకరణ సంతృప్తికరంగానూ, సంపూర్ణంగానూ ఇప్పటికి ముగిసినట్లే. ఈ దినం జరిగిన సుమారు 100 పనిగంటల పారిశుధ్య కృషితో :
- ట్రాక్టర్లు. ఇతర చెత్త బళ్ళన్నీ డంపింగ్ దగ్గర వ్యర్ధాలను దించి, వెనుదిరగకుండ చిల్లలవాగు గట్టు మీదుగా వృత్తాకారంలో విజయవాడ రోడ్డుకు చేరుకోగలవు. కాస్త వెలుతురు వచ్చిన 6.10 సమయానికి వాగు దక్షిణ – గట్టు మీద ఏ పిచ్చి – ముళ్ళ మొక్కయినా కనిపించలేదు!
- ఈ ఐదారు రోజుల శ్రమదానంతో డంపింగ్ యార్డు మరికొంత కుంచించుకు పోయి, దాని హద్దుల్లో అది ఉన్నది!
- చెత్త సంపద భవన పరిసరం కాస్తా ఒక ఖాళీ వ్యవసాయ సుక్షేత్రంగా మారింది – దీనికి బాధ్యులు ప్రధానంగా సుందరీకరణ విభాగం వాళ్లే. అక్కడ ఏ అంగుళంలో ఏ లోపమున్నా వాళ్ళ మనసులు చివుక్కుమంటాయి మరి!
- చిల్లలవాగు గట్టు మీద ఈ ఆదివారం 20 మంది కార్యకర్తలు కత్తులతో, గొర్రులతో కాలుష్యం మీద సాగించిన సమరం మాత్రం తక్కువదా? ఎప్పటిలాగే అందులో ఈ నాటి విజేతలు కూడ స్వచ్చ సైనికులే!
అందుకే వీళ్ళంతా 6.20 సమయంలో కాఫీలు సేవిస్తూ – తమ చిరకాల కష్టార్జితమైన – సుందరీకృతమైన ఈ ప్రాంతమంతటిని సంతృప్తిగా సింహావలోకనం చేసి, సమావేశపు సమీక్షలు విని, ఆమోదించి గృహోన్ముఖులయ్యారు.
గత మూడు వారాల స్వచ్చంద శ్రమదాతలు, స్వచ్చోద్యమానికి 5 లక్షల (మొత్తం 16 లక్షల) అర్ధ దాతలు ఐన, దుబాయి ప్రవాసులైన స్నేహ – నాగేంద్ర కుమార్ లు అక్కడి తమ ఉద్యోగవిధుల కోసం బయలుదేరుతూ, ఇచ్చిన వీడ్కోలు సందేశాన్ని వాట్సాప్ – ఫేస్ బుక్ వీడియోలలో చిత్తగించగలరు.
వచ్చే బుధవారం - 06.01.2021 నాటి మన బాధ్యతా నిర్వహణ కోసం చిల్లల వాగు వంతెన సమీపంలో ఆగి, విజయవాడ రహదారి శుభ్రతకై వేకువ 4.30 సమయంలో కలుసుకొందాం!
నిర్నిబంధ – నిర్విరామ...
స్వచ్చోద్యమ చల్లపల్లి కధాక్రమంబెట్టి దనిన..
సామాజిక ఋణ విముక్తి తాత్త్వికతే పునాదిగా...
బాధ్యత గల కొంతమంది – వందవేల పనిగంటల
నిర్విరామ – నిర్నిబంధ – నిస్వార్ధ శ్రమదానం!
నల్లూరి రామారావు,
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
03.01.2021.