2096* వ రోజు....           06-Jan-2021

 2096* వ నాటి స్వచ్చ - సుందర చల్లపల్లి విశేషాలు.

 

ఈ బుధవారం (06.01.2021) నాటి వేకువ 4. 26 కే తరిగోపుల ప్రాంగణం దగ్గర ప్రారంభమైన 33 మంది స్వచ్చోద్యమ కారుల రహదారి శుభ్ర – సుందరీకరణలు 6.10 దాక కొనసాగినవి. చిల్లలవాగు వంతెన పరిసరాలు, విజయవాడ దారిలో చల్లపల్లి దిశగా – వాహన కాటాల మీదుగా 200 గజాల పర్యంతం - గంటన్నర సమయం పైగా కృషితో మెరుగుపడినవి.

 

వేకువ 5.00 కన్న ముందే సిద్ధమైన వాహనాల రద్దీ నడుమ చీకటి మూలంగా వీధి శుభ్రతలు కొంత నెమ్మదిగానే జరిగినవి. రోడ్డు తూర్పు దరి డ్రైనులో సైతం పిచ్చి – ముళ్ళ మొక్కలు కొట్టి, ఎండు తుక్కును దంతెలతో లాగి, పైకి చేర్చడానికి, గతంలో నాటిన పూల మొక్కలకు పాదులు సవరించడానికి, ట్రీ గార్డులను సరిచేయడానికి ఎక్కువ సమయమే పట్టింది. ముంపు వానలతో పడిన గుంటల ఎగుడు దిగుడులు సమం చేస్తూ, ఎండు వరి గడ్డిని, ప్లాస్టిక్ సంచుల్ని, ఖాళీ మద్యం సీసాలను ప్రోగులు పెడుతూ – ఇదంతా తమ సొంత ఇంటి బాగుచేతగానే భావిస్తూ, సొంత ఊరి మేలు కోసం ఒక సుదీర్ఘ లక్ష్యం దిశగా ఒక్కో అడుగు వేసుకుంటూ, సంయమనంతో ముందుకు సాగే ఈ కర్మ వీరులకు మనసా – వాచా – కర్మణా మన అభివందనాలు!

 

ఈ బెజవాడ బాట 1 ½ కిలోమీటర్ల నిడివిని శుభ్రపరచడానికే నాలుగైదు దినాలు పట్టవచ్చు. అందుకే  రానున్న రోజుల్లో నిరవధికంగా – ప్రతి వేకువ ఈ బాటలోనే శ్రమించాలని నిర్ణయించుకొన్నారు.

 

6.20 సమయంలో తమ స్వచ్చ – సుందర సంకల్ప నినాదాలను ప్రకటించి, గ్రామ మెరుగుదల పనిలో పాల్గొన్న తమ సంతృప్తిని ప్రకటించిన వారు దాసరి ఆర్య – ఆరవ్ సోదరులు. స్వచ్చోద్యమానికి బాసటగా మనకోసం మనం మేనేజింగ్ ట్రస్టీకి 2000/-, 510 విరాళమిచ్చినవారు మాలెంపాటి గోపాలకృష్ణ, కోడూరు వేంకటేశ్వరరావు గారలు.

 

ఈ సాయంత్రం రాణి భవానీదేవి వివాహ మండపంలో తమ చిన్న కుమారుడు ప్రసాద్ కళ్యాణ వేడుకలకు స్వచ్చ కార్యకర్తలను ఆహ్వానించినవారు ముత్యాల చంటి (హనుమంతరావు) – లక్ష్మీ గారలు!

 

రేపటి మన ఊరి బాధ్యతల నిర్వహణ కోసం మనం కలుసుకోవలసిన సమయం వేకువ 4.30, చోటు విజయవాడ రోడ్డులోని కాటా దగ్గర.

 

          అండ దండ అసలెవ్వరు?

ఎవరైనా వచ్చితిరా ఈ గ్రామం స్వచ్చతకై?

ఎవరు తీర్చి దిద్దినారు ఈ ఊరును ఏడేళ్లుగ?

ఏ ఊరు కధైనా ఇదె – ఎవరి కాళ్ళ మీదట

వాళ్ళే నిలబడి నడచుట స్వచ్చోద్యమ బాసట!

 

నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

06.01.2021.