2098* వ రోజు ....           08-Jan-2021

 చల్లపల్లి స్వచ్చోద్యమంలో 2098* వ నాటి బాధ్యతా నిర్వహణ.

 

08.01.21 (శుక్రవారం) నాటి శుభోదయాన 20 మంది స్వచ్చ సైనికుల బాధ్యతల ఆరంభం 4.28, పరిపూర్తి 6.15. విజయవాడ మార్గంలోని వాహన కాటా కేంద్రంగా – అటు చిల్లలవాగు వారధి నుండి ఇటు కార్ల షెడ్డు దాక వీరి ప్రయత్నాలు విస్తరించినవి.

వాటిలో :

- గోకుడు పార, చీపురు, కత్తి ఉపయోగించి ఒకే ఒక సుందరీకర్త చేసిన వంతెన దగ్గరి విన్యాసాలు.

 

- బెజవాడ దారి పడమర డ్రైనులో కత్తి, దంతెలు చేతబూని, చీకటిలోనే అక్కడి తుక్కును, ముళ్ళ – పిచ్చి మొక్కల్ని, ప్లాస్టిక్ సంచుల్ని, ఖాళీ సారా సీసాలను బైటకు లాగిన ఇద్దరు విశ్రాంత ఉద్యోగుల సాహసాలు, వారికి సహకరిస్తున్న ఆస్పత్రి నర్సుల పరిశుభ్రతా చర్యలు.  

 

- మరికొంత దూరంలో – బాటకు తూర్పు దిక్కు మురుగు కాల్వలోని వివిధ కాలుష్యాలతో చెలగాటమాడుతున్న నలుగురి పట్టుదలలు.

 

- 6 వ నంబరు పంట కాలువ దగ్గరి ఎండిన డ్రైను మట్టిని ట్రాక్టరులో నింపి, దానితో చిల్లలవాగు గట్టును మరామత్తు చేస్తున్న ఐదారుగురి అర్ధవంతమైన చర్యలు –

వెరసి, మొత్తం మీద తామనుకొన్న దారి శుభ్ర – సుందరీకరణలు పూర్తి చేసిన కార్యకర్తలు –  

          అసలీ చల్లపల్లి గ్రామం ఎవరిది? ఆరేడేళ్ళ స్వచ్చోద్యమాన్ని విసుగు, విరామం లేక నిర్వహిస్తున్న – మనకోసం మనమేఅనుకొని ముందుకు సాగుతున్న స్వచ్చ కార్యకర్తలదా? లేక దేశానికే ఆదర్శమనదగిన సుదీర్ఘ స్వచ్చ బాధ్యతల సమయం తరువాత కూడ నిర్లక్ష్యంగా – బాధ్యతారహితంగా వీధుల్ని, డ్రైనుల్ని కాలుష్యమయం చేస్తున్న కొందరు బద్ధకస్తులదా? తమ అనాలోచిత అనుచిత చర్యల్ని పునఃసమీక్షించుకొనని – మారని మనుషులతో ఏ గ్రామానికి ప్రయోజనం?

 

          చల్లపల్లి గ్రామ స్వచ్చ – శుభ్ర – సుందర సంకల్ప నినాదాలను ఈరోజు వినిపించినది – 66 ఏళ్ల కార్యకర్త శ్రీ కోడూరు వేంకటేశ్వరరావు గారు.

 

          2100 రోజుల గ్రామ సేవల మైలు రాయిని సమీపిస్తున్న చల్లపల్లి స్వచ్చోద్యమ కారులకు నా ముందస్తు శుభాభినందనలు!

 

          రేపటి మన ఊరి కర్తవ్య నిర్వహణ కోసం మరొక మారు వేకువ 4.30 కే తరిగోపుల ప్రాంగణంలో ఆగి, మన సేవలను విస్తరిద్దాం.

 

          చాటి చెప్ప జూస్తున్నా.

ఒక్కసారె వాడేసే ప్లాస్టిక్ సరుకులు వలదని...

చేతి సంచి అనాగరిక చిహ్నం కానే కాదని...

ప్లాస్టిక్ గ్లాసు – విస్తర్లూ పరమ ప్రామాదికమని...

 స్వచ్చోద్యమ చల్లపల్లి చాటి చాటి చెప్పినదని...

 

నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

08.01.2021.