స్వచ్చోద్యమ చల్లపల్లి లో 2099* వ నాటి కర్తవ్య దీప్తి.
శనివారం(9.01.2021) నాటి గ్రామ మెరుగుదల దీక్షా పరుల స్వచ్చంద శ్రమదానం వేకువ 4.25-6.20 సమయాల నడుమ ప్రవర్ధిల్లింది.
కార్య రంగం - విజయవాడ బాటలోని చిల్లలవాగు వంతెన ప్రాంతం. స్వార్థం కాక, పరార్థం లక్షించిన కార్యకర్తల సంఖ్య 26- నలుగురు మహిళలతో సహా.
ఈనాటి స్వచ్చ-శుభ్ర- సుందరీకృత ప్రాంతం ప్రధానంగా చిల్లలవాగు వంతెన- కాటాల మధ్య భాగమే. ఇప్పుడు గనుక ఎవరైనా పరిశీలనగా చూస్తే రోడ్డు మార్జిన్లు ఎంతగా శుభ్రంగా ఉండాలో, డ్రైను సైతం ఎంత స్వచ్చ సుందరంగా ఉంచుకోవాలో-ప్లాస్టిక్ దయ్యాన్ని, కాలుష్య భూతాన్ని ఎంత దూరంగా తరిమి కొట్టాలో- సొంత ఇంటి పరిసరం లాగా శ్మశానాన్ని, రహదారిని కూడా క్రమం తప్పని దినచర్యగా మార్చుకొనే మనుషులు ఈ కాలంలో కూడ ఉన్నారని నమ్మకం కలుగుతుంది!
తాము నివసించే చల్లపల్లి సంతోష – సంక్షేమాల కోసం జన విజ్ఞాన వేదిక తరపున- అవసరమైతే సంవత్సరం పాటు శాయశక్తులా పాటు బడాలని ఈ కార్యకర్తలు సంకల్పించాక- ఏడాది కాదు, సుమారు ఏడేళ్లు- 2099* దినాలు గడిచిపోయినవి! కాలక్రమాన తమ గమ్యం దిశగా వారి ప్రయత్నం ఒక ఉద్యమంగా మారినది. లక్ష్యాలు కూడ విస్తరించాయి. ఐనా సరే – ‘మనకోసం మనం’ పర్యవేక్షణలో – కోట్లాది ధన వ్యయంతో – లక్షలాది గంటల శ్రమదానంతో ఈ స్వచ్చ సైనికులు కదం తొక్కుతూ సాగిపోతునే ఉన్నారు! ఇప్పటికే లక్ష్య సాధనలో 60% పైగా మార్కులతో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు కూడ! ఏదో ప్రస్తావించాలి కనుక, కాస్త వర్ణనతో నేనిలా వ్రాస్తున్నాను గాని- అంతులేని ఈ స్వచ్చ బాటసారులు మాత్రం యదాలాపంగా- అలవోకగా తమకు తామే నిర్దేశించుకొన్న ఊరి బాధ్యతలకు అంకితులై స్థిరంగా ముందుకు సాగిపోతునే ఉన్నారు!
దారి గుంటల్ని మట్టితో పూడ్చడం కాక, డ్రైన్లలోని గడ్డిని వంతెన దాపుల పల్లాలలో సర్దడం కాక, కొసరుగా 6.00 సమయం తరువాత ఆరేడుగురు కార్యకర్తలు వాగు దక్షిణ- పడమర గట్టు మీద చెట్లు, తీగలు, ప్లాస్టిక్ సంచులు, ఖాళీ మద్యం సీసాల వంటివి తొలగించి, రాకపోకల సౌకర్యం కల్పించారు.
ఉత్సాహంతో సంతృప్తి తో గడిపిన కాఫీ సేవన కాలంలో డాక్టరు గారు నేటి సమీక్షతో బాటు నిన్నటి మండలి బుద్ధ ప్రసాదు గారి గంగులవారిపాలెం దారి ఉద్యాన సౌందర్య సందర్శన, అభినందనలను ప్రస్తావించారు.
మన విలక్షణ స్వచ్చ కార్యకర్త వాసన కృష్ణారావు ముమ్మారు ఎలుగెత్తి చాటిన గ్రామ స్వచ్చ-శుభ్ర- సౌందర్య సంకల్ప నినాదాలతో నేటి బాధ్యతల పరిపూర్తి!
ప్రాతూరి శంకర శాస్త్రి గారి చాక్లెట్లు, కాలపట్టికల పంపకం కూడ నేటి విశేషమే!(ఏ చిన్న అవకాశం దొరికినా, ఆయన వితరణా వ్యసనం షరా మామూలే!)
2100 వ దినం రేపటి ప్రత్యేకత. ఇదే తరిగోపుల ప్రాంగణం వద్ద మరింత పూనికతో- మరింత మందిమి రేపటి వేకువ 4.30 కు కలుసుకొందాం.
తలదాల్చుము- సదాశయాన్ని
నీతులెన్నొ చెప్పి చెప్పి గోతులు త్రవ్వేందుకో
కీర్తి – పదవి-ధనాలనే నెత్తికెత్తుకుందుకో
స్వచ్చోద్యమ చల్లపల్లి ప్రస్థానం లేనేలేదని
అనుసరించి తల దాల్చుడు ఆ ఉద్యమ ఆశయాన్ని!
నల్లూరి రామారావు,
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
09.01.20 21.