ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడం.
2113* వ నాటి స్వచ్చోద్యమ చల్లపల్లిలో ఉత్సాహ - ఉద్విగ్నతలు.
ఈ బుధవారం (27.1.2021) నాటి వేకువ 4.22 కే ప్రారంభమైన రహదారి స్వచ్ఛతా కృషి కొనసాగినది - - 2 గంటల సమయం. పాల్గొన్న దీక్షాదక్షులు 24 మంది. వందమంది కార్యకర్తలకైనా పని చూపించగల – విజయవాడ దారిలోని చిన్న – తుక్కు – కార్ల, 6 వ నంబరు కాలువల నడిమి భాగమే పరిశుభ్ర – సుందరీకృత ప్రదేశం.
ఈ రహదారి 2 ½ కిలోమేటర్ల నిడివిని గత ఐదారేళ్లలో వీరు ఏ 20 మారులో శుభ్ర పరిచారు. కరోనా వల్ల ఇటీవల ఎక్కువ ఎడబాటు రావడంతోను, బాగా రద్దీ బాట కావడంతోను, అన్ని రకాల కశ్మలాలు అలుముకొని, అందుకు తోడుగా డ్రైన్ల పూడిక తీసిన బురదలు బాగా గడ్డ కట్టుకు పోయి, స్వచ్ఛతా ప్రయత్నం కొంత నెమ్మదిస్తున్నది. అదీ గాక, ఎడతెగని వాహనాల రాకపోకల నడుమ చీకటిలోనే ఈ పనంతా!
ఈ వేకువ హాజరైన రెండు డజన్ల మందిలో సగానికి సగం మంది మురుగు కాలువ మట్టిని త్రవ్వి, డిప్పలతో ఎత్తి, ట్రాక్టరు ట్రక్కులో నింపి, శ్మశానంలోని దహన వాటిక వద్ద పల్లాలను సమం చేయడంతోనే సరిపోయింది. ఐనా రెండు పెద్ద ట్రక్కుల మట్టి చేరికతో రుద్ర భూమిలో కొంత భాగం చదునైపోయింది! రెండు గంటల పాటు వంచిన నడుములు ఎత్తక, ఇంత చలిలోను చెమటలు కార్చుతూ, నీళ్ళు త్రాగుతూ, పట్టు వదలక తమ ఊరి మంచి కోసం పాటుబడిన శ్రమదాతల ఋణం ఈ చల్లపల్లి ఎప్పటికి తీర్చేను?
మిగిలిన కార్యకర్తలు 6 వ నంబరు పంట కాలువ దిశగా డ్రైనులో దిగి కత్తులతో పిచ్చి – ముళ్ళ మొక్కల్నీ, పనికిరాని ప్లాస్టిక్ సంచుల, ఖాళీ సారా సీసాల, ఇతరేతర వ్యర్ధాలను గొర్రులతోను చీపుళ్ళతోను నరికి, లాగి, ఊడ్చి, కాలుష్యాలను ఒక కొలిక్కి తెచ్చారు. ఇందులో 65 ఏళ్ల పించనుదారు డొకాయన్ని “నడుము నొప్పి ఎక్కువగా ఉంటే – బైటకు వచ్చేయ్ – రేపు చూసుకొందాం” అంటే – “నొప్పి ఉంటే ఉందిలే గురువు గారు, ఇంటి కెళ్ళాక సాయంత్రానికదే సర్దుకొంటుంది. దానికోసం – ఈ నాటి బాధ్యతను సగంలో వదిలేస్తామా?” అన్నాడు.
సుందరీకర్తల సంఖ్య ఈ వేళ కాస్త తగ్గి, రోడ్లు మార్జిన్ల గడ్డి చెక్కడం, పూల మొక్కల పాదుల్ని సవరించడం, కొమ్మల్ని అందంగా కత్తిరించడం వంటి కార్యక్రమం కొంచెం నెమ్మదించింది.
నిన్నా – మొన్నటి ఒక స్వచ్చోద్యమ విశేషం ప్రస్తావించాలి. ఈ టీ. వీ. కి చెందిన “భారత్ టి.వి” పెట్టిన – గంగులవారిపాలెం దారి ఉద్యానవనంలోని రకరకాల దట్టమైన పూదోటల సోయగాల దృశ్యాలను , వ్యాఖ్యాన కధనాలను వాట్సాప్ మాధ్యమంలో చూసిన చాల మంది – అమెరికా ప్రవాసులు – చాపలమడుగు నాగేశ్వరరావు, సురేష్ వంటి వారు – ఏడెనిమిదేళ్ళ నాటి అత్యంత దుర్భరమైన, పూతిగంధ హేయమైన ఆస్పత్రి బాట ఇదేనా? నిజం గానా?....” అని ఫోను చేసి, సందేహ నివృత్తి చేసుకొన్నారట! ఇదంతా స్వచ్చోద్యమకర్తల శ్రమైక జీవన ఫలితం కాకమరేమిటి? వందలాది కార్యకర్తల దృఢ సంకల్ప మహిమే ఇది! డబ్బు కోసమో, కీర్తి కోసమో ప్రాకులాడితే వచ్చే ఫలితాలు వేఋ!
నేటి కాఫీ సమయంలో 6.35 కు చాల రోజుల పిదప కన్నడ దేశం నుండి వచ్చిన మన వృద్ద (83) కార్యకర్త – వేమూరి అర్జునరావు మాస్టారు ఉద్యమ ఖర్చుల నిమిత్తం 1600/- విరాళ మిచ్చి, ముమ్మారు తనివేతీరా గ్రామ స్వచ్ఛ – సుందర సంకల్ప నినాదాలు పలికి, స్వచ్చోద్యమంతో – కార్యకర్తలతో తన ఇన్నాళ్ళ ఎడబాటును తలచుకొని ఉద్వేగంతో కన్నీటి పర్యంతం కావడం అందర్నీ కదిలించింది! వరదా రామారావు గారి స్మృతిలో వారి శ్రీమతి నిన్న సమర్పించిన 5000/- ల విరాళానికీ మన ధన్యవాదాలు!
మన రేపటి, ఆరేపటి వేకువలందు పునర్దర్శన సమయాలు వేకువ 4.30. స్థలం ఈ 6 వ నంబరు కాలువ – పాత కార్ల సమీపమే!
కీర్తిస్తా - నీరాజనమర్పిస్తా
ఈర్ష్యా ద్వేషా లెరుగని – మదమాత్సర్యాలు లేని –
పరుల కొరకు గంటన్నర పాటుబడే స్వచ్చోద్యమ
కారులనే కీర్తిస్తా – ఘనతను విశ్లేషిస్తా!
రెండు వేల నాళ్ళ శ్రమకు నీరాజన మర్పిస్తా!
నల్లూరి రామారావు,
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త, చల్లపల్లి.
27.01.2021.