2163* వ రోజు ....           02-Apr-2021

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

పట్టు వదలని 31 మంది విక్రమార్కుల 2163* వ నాటి ప్రయత్నం.

 

శుక్రవారం – 2.4.21 వ నాటి నేటి వేకువ 4.18 కే 1 వ వార్డులోని బాలికల వసతి గృహం దగ్గర 14 మందికి తెల్లవారిపోయింది. మరి కొద్ది నిముషాలకే మిగిలిన గ్రామ బాధ్యులు వారికి తోడై, ఈ 31 మంది – 6.12 దాక నిర్వహించిన వీధి పారిశుద్ధ్య కృషికి నిన్నటి వలెనే నేడు సైతం ప్రకృతి ప్రతికూలంగానే ఉన్నది. ఆకు సైతం కదలని ఉక్కపోతను లెక్క చేయక తమ లాభం కోసం కాక గ్రామ ప్రయోజనం కోసం శ్రమిస్తున్న ఈ స్వచ్చోద్యమకారులను ఫ్యానుల క్రిందనో, ఏ.సి. ల, అండలోనో విశ్రమిస్తున్న సోదర గ్రామస్తులు మెచ్చకుంటే మించిపాయెను;కాస్త గుర్తించి, ఆలోచించి, తమ వీధిలో ఆచరిస్తే ఈ స్వచ్ఛ కార్యకర్తల భారం తగ్గుతుంది.

 

ఈ శుభోదయం శ్రమదాన వేడుక ప్రధానంగా హిందూ శ్మశాన వీధి, దాని పరిసరాలు. జమ్మిలంకమ్మ గ్రామ వేలుపు గుడి మొదలు గతుకుల సిమెంటు రోడ్డు 150 గజాల మేర కాలుష్యాల మీద జరిగింది అక్షరాలా యుద్ధమే! పగిలి, నెర్రెలు పారిన ఇరుకు బాటలో లేని కశ్మలాలేమున్నవి? గతంలో స్వచ్ఛ సైనికులే నాటి, సంరక్షించి,పెంచిన చెట్ల కొమ్మలు, గత రెండు మూడు మాసాలుగా పడమర వైపున పెరిగిన ముళ్ళ పిచ్చి చెట్ల కొమ్మలు ఎంతగా అడ్డొకొస్తున్నా, వాహన ప్రయాణం కష్టతరమైపోతున్నా - ఈ వీధి వారు తొలగించుకునే ప్రయత్నమే చేయరే?

 

కదలని డ్రైనుల, శ్మశానాల, పంట కాలువల, రోడ్డు గుంటల .... అన్ని బాధ్యతలను స్వీకరించినట్లే ఈ స్వచ్ఛ కార్యకర్తలు నిన్న నేడు ఈ శ్మశాన వీధి బాగు చేతకు సైతం పూనుకొన్నారు:

 

- మురుగు కాల్వకు పడమర గట్టు మీద చిక్కుపడి పెరిగి, అల్లుకొన్న తీగల్ని, ఎండు - పచ్చి గడ్డిని, ప్లాస్టిక్ సంచుల, సీసాల, కప్పుల, పళ్లేల వంటి వ్యర్ధాలతో సహా కోసి, ఏరి, దంతెలతో లాగి, ఆ గుట్టలను ట్రాక్టర్ లో నింపుకొని, దూరంగా ఉన్న చెత్త కేంద్రానికి తరలిచడంలో గాని;

 

- ముందుకు నడవలేక కుంటుతున్న మురుగు కాల్వలోని రకరకాల వ్యర్ధ దరిద్రాలను తొలగించి, కాల్వ మురుగుకు నడక నేర్పడంలో గాని;

 

- కత్తి వీరుల పిచ్చి చెట్ల నరుకుడుతోను, వీధి సౌందర్యకారుల కొమ్మల కత్తిరింపులతోను, వీధి దుమ్ము ధూళి ఆకులలములతోను, కొందరు బాధ్యతారహితుల ఇంటి కశ్మలాల విసురుడుతోను నిండిన వీధిని ఐదారుగురు చీపుళ్లతో మరల మరల ఊడవడంలో గాని...

ఎక్కడా ఏలోపమూ జరగలేదు. ఇంత అస్తవ్యస్తంగా ధూళి దూసరితంగా మురికిగా డ్రైను కంపుగా .... ఉన్న ఈ వీధిలో తిరుగాడే నివాసితులు అసలేమీ జరగట్లే పట్టనట్లే చూడనట్లే ఎవరో వచ్చి బాగు చేస్తారు అన్నట్లే ఉండడం సమంజసమా?

 

జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యంవాట్సాప్ ఛాయాచిత్రాన్ని గమనించారా? వాటిలో మూడు ముఖ్య సంగతులున్నాయి!

 

అ) యార్లగడ్డ గ్రామోద్యోగి, ఆ ఊరి స్వచ్చ సుందరీకరణ బాధ్యుడూ తూము వేంకటేశ్వరరావు గారు ఈ చల్లపల్లి శుభ్రతకు సైతం పూచీపడడం,

 

ఆ) పైడిపాముల రాజేంద్ర గారు పని వేళ ముగిసినా, తన వార్డు వారు రాత్రి బాట ప్రక్కపోసిన వ్యర్ధాలను ఎత్తడం,

 

ఇ) 6.30 సమయానికి శ్మశానం రోడ్డులో సగం దూరం శుభ్రంగా, అందంగా మారిపోవడం.

 

6.30 కి మాలెంపాటి అంజయ్య గారు కసిగా ముమ్మారు పలికిన గ్రామ స్వచ్చ శుభ్ర సౌందర్య సంకల్ప నినాదాలు మూడు వీధులు దాక విన్పించే ఉంటాయి!

 

ఈ శ్మశాన బాటలో మిగిలిన సగాన్ని మెరుగుపరిచే పనికోసం రేపటి వేకువ మరొక మారు ఇక్కడే కలుద్దాం!

 

స్వయం నిర్మిత స్వచ్ఛ సైన్యం.

 

బ్రతుకు బాటకు అర్ధమున్నది - ప్రజల యెడ గురుబాధ్యతున్నది

ఎందుకెప్పుడు ఎలాచేయుటొ ఎవరికను ఒక స్పష్టతున్నది

స్వయం నిర్మిత కార్యకర్తకు ప్రగతి శీలక మార్గమున్నది!

విరివి వాళ్ళకు ఉదారతలో! వెలితి మాత్రం స్వార్ధమందున!

 

ఒకానొక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

 

02.04.2021.