ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!
2199* వ నాటి గ్రామ బాధ్యుల కృషి .
ఈ వేకువ (బుధవారం -04.08.2021) 4.21 వేళకే 12 మందితో మొదలైన చల్లపల్లి వీధి శుభ్రతా శ్రమదానం ఇంకొక 12 మంది చేరికతో(మొత్తం 24 మంది) 6.10 వరకూ సాఫీగా కొనసాగింది. మురుగు కాల్వ ఉత్తరపు గట్టుకు రెండు ప్రక్కలా ఇంచు మించు వంతెన దాక- ఇప్పుడెంత స్వచ్చ- పరి శుభ్రంగాను, హరిత –పుష్ప శోభితంగానూ ఉన్నదో గదా!
ఈ రెండు డజన్ల మంది అంకిత భావమే ఈ వీధిని ఇంతగా- గ్రామానికంతటికీ తలమానికంగా నిలుపుతున్నదంటే – వారికి తెలియకుండానే గ్రామాంతర, గ్రామస్తుల నడకలీ వీధి వైపు సాగుతున్నవంటే- స్వచ్చ కార్యకర్తల, ఉద్యమ మూల విరాట్టుల ప్రత్యయం ఊరి యెడల ఏ స్థాయిలో ఉన్నదో ఊహించుకొండి. ఒకనాటిదీ-ఒక ఏటిదీ కాదు, ఏడెనిమిదేళ్లుగా –వందకు పైగా ఈ గ్రామ స్వచ్చంద శ్రమ దాతల –లక్షల కొద్దీ పని గంటల ప్రయత్నం మరి!
నేటి వేకువ సైతం కార్యకర్తల ప్రయత్న లోపమేమీ లేదు. గంటన్నరకు పైగా వీళ్లు తామే నాటి, రక్షించి, పెంచిన చెట్ల , పూల మొక్కల సోయగాలకు మరిన్ని మెరుగులు దిద్దారు, పాదులు సవరించారు, కుదుళ్ల కలుపు తీశారు, బాటను పదే పదే ఊడ్చారు, మురుగు కాల్వ వైపు చెట్లు పల్లంలోనికి ఒరిగిపోకుండ మెరక వేసి కాపాడారు, పిచ్చి-ముళ్ల మొక్కలుంటే తొలగించారు, గంటన్నర కృషి మూలంగా పోగు పడిన వ్యర్ధాలను దంతెలతో గుట్టలు చేసి, ట్రాక్టరులో నింపుకొని, చెత్త కేంద్రానికి చేర్చారు... ఏతా –వాతా స్పందించగలవాళ్లకు ఒక సామాజిక సముచిత సందేశాన్నిచ్చారు!
6.30 వేళ, కాఫీల ఆస్వాదన పిదప, పైడిపాముల రాజేంద్ర జాగ్రత్తగా మూడు మార్లు వినిపించిన గ్రామ స్వచ్చ-పరిశుభ్ర-సౌందర్య సాధనా సంకల్ప నినాదాలకు ప్రతి స్పందించారు. తిరుగు ప్రయాణం లో నిన్న సాయంత్రం పరమపదం చేరిన శతాధిక వర్షీయసి (పసుపులేటి సత్యంగారి తల్లి) ని కడసారి చూసేందుకు తరలి వెళ్లి, నివాళులర్పించారు.
రేపటి మన స్వగ్రామ మెరుగుదల కృషి క్షేత్రం ఈ గంగులవారిపాలెం దారి రెండవ మలుపు వంతెన దగ్గరే!
కుల మతాల కుంపట్లకు....
స్వచ్చోద్యమ చల్లపల్లి కథాక్రమం బెట్టిదనిన...
సామాజిక ఋణ విముక్తి సాధన ఒక తాత్త్వికతగ...
కుల మతాల సామాజిక కుంపట్లను ఆర్పి వేసి
గ్రామాభ్యున్నతి కోసం కలిసి మెలిసి సాగడం!
ఒక ‘స్వచ్ఛ సుందర చల్లపల్లి’ కార్యకర్త
04.08.2021.