ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!
స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1884* వ నాటి విశేషాలు.
1 వ వార్డు పరిసరాలలో ప్రభుత్వ- బాలికల వసతి గృహం వీధులలోను, సామ్యవాద(కమ్యూనిస్టు) బజారు ప్రాంతంలోను జరిగిన నేటి గ్రామ స్వచ్చ-శుభ్ర సుందరీకరణలో 29 మంది కి భాగస్వామ్యం ఉన్నది. 4.05-6.20 నిముషాల నడుమ త్రిముఖంగా చోటు చేసుకున్న ఈ బాధ్యతా నిర్వహణ వివరాలు:
1) బాలికల వసతి గృహం ఎదురు, పడమర ప్రక్కల రోడ్లను, పార్శ్వాలను సుమారు 20 మంది స్వచ్చ కార్యకర్తలు కత్తులతో పిచ్చి-ముళ్ల-నిరర్ధక మొక్కల్ని నరికి, గడ్డిని చెక్కి, దారి ప్రక్క స్థలాల అడవి మేడి చెట్ల కొమ్మల్ని నరికి, తీగల్ని ఛేదించి, ఉభయ మార్గాల మెరుగు దలకై శ్రమించారు. ఈ గంటన్నర కాలంలో ఉత్పన్నమైన అన్ని రకాల వ్యర్ధాలను గొర్రులతో పోగు చేసి, చీపుళ్లతో ఊడ్చి ట్రస్టు ట్రాక్టర్ లో నింపి, కొందరు చెత్త కేంద్రానికి తరలించారు.
2) భారత లక్ష్మి వడ్ల మర వైపుగా దారి ప్రక్కన – చెట్ల మధ్య కాస్త సందు చూసుకొని 25 గద్ద గోరు(అడవి తంగేడు) పూల మొక్కల్ని నాటరు. నాటే సమయానికే ఆ మొక్కలు రంగు రంగుల పూలతో కన్పిస్తున్నవి.
3) శిథిలావస్థలో ఉన్న గోడల్ని, పాత రేకుల్ని గూడ సహించని సుందరీకరణ బృందం వారు ప్రైమర్లు రంగులు వేసి, స్వచ్చ సుందర నినాదాలను, తత్సబంధ చిత్రాలను లిఖించారు. సదరు రంగులు, వ్రాతలు, చిత్ర లేఖనాలు వృత్తి నిపుణులగు కళాకారుల పనులకు చాల దగ్గరగాను-కేవలం మూడో వంతు ఖర్చుతోను ఉండడం ఒక విశేషం!
భారత లక్ష్మి కర్మాగారం దారిలో నిన్న మొన్న శుభ్ర పరచినచోట-వాసిరెడ్డి మాస్టారి స్మారక వనంలో పంచాయతి వారి హెచ్చరిక ఫలకాన్ని గ్రామస్తులు పాటించడం సర్వత్రా శ్రేయోదాయకమని మనవి!
నేటి ఇతర వివరాలు:
- చల్లపల్లి, యార్లగడ్డ స్వచ్చ కార్యకర్త తూము వేంకటేశ్వర రావు గారు రేపు మధ్యాహ్నం 3.00 నుండి నిర్వహింపబడే “స్వచ్చ యార్లగడ్డ” – శతదినోత్సవానికి కార్యకర్తలను ఆహ్వానించడం.
- SRYSSP కళాశాలోపన్యాసకులుT. చొప్పున ఉభయ గ్రామాలకు విరాళం.
- ట్రస్టు కార్మికులు తెచ్చిన తేగల పంపిణి.
6.45 నిముషాలకు చిన్నారి స్వచ్చ కార్యకర్త- కళాకారిణి దేసు జాహ్నవి ముమ్మారు ప్రకటించిన గ్రామ స్వచ్చ- సుందరీకరణ సంకల్ప నినాదాలతో నేటి బాధ్యతలకు స్వస్తి!
రేపటి కర్తవ్య దీక్ష కూడ బాలికల వసతి గృహం దగ్గర నుండే ప్రారంభిద్దాం!
స్వచ్చోద్యమ కథాక్రమం.
స్వచ్చోద్యమ చల్లపల్లి కథాక్రమం బెట్టిదనిన-
సామాజిక ఋణ విముక్తి సాధన ఒక తాత్వికతగా-
సామాన్యులె మాన్యులగుచు-సమయ, అర్థదాతలగుచు
వేలాది దినాలు గ్రామ విధుల మునిగి తేలడం!
నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,
సభ్యులు- మనకోసం మనం ట్రస్టు,
బుధవారం – 08/01/2020
చల్లపల్లి.