1887* వ రోజు....           11-Jan-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1887* నాటి వేడుకల సందడి

 

    గంగులవారిపాలెం దారిలో – అస్మదీయ గృహంబు నుండి కొలిమి మేస్త్రి గారి ఇంటి దాక సాగిన స్వచ్చ – శుభ్రతల సందడి 3.58 – 6.15 నడుమ కాలంలో చోటు చేసుకున్నది. అమెరికా తెలుగు సంఘం మాజీ అధ్యక్షులు తోటకూర ప్రసాద్ గారితో సహా- పాల్గొన్న వారు 61 మంది.

 

          వీరిలో 80 ఏళ్ల నుండి 12 సంవత్సరాల వయసు వాళ్ళు ఉన్నారు. ఈ కార్యకర్తల విజయవంతమైన గ్రామ కర్తవ్య నిర్వహణలో కొన్ని ముఖ్య ఘట్టాలు...

 

          - మాజీ డి. ఎస్పీ గారి ఇంటి వెనుక ఖాళీ స్ధలంలో హద్దులు మీరి పెరిగి, రహదారి మీదికి, కరెంటు తీగల పైకి జడలు విరబోసుకుంటున్న పెద్ద అడవి (ఇంగ్లీష్) తుమ్మ చెట్టును ఆరేడుగురు గంట పాటు శ్రమించి చెట్టెక్కి కూడ కొమ్మలు నరికి, అందంగా సౌకర్యంగా రూపొందించడం.

 

          - ఇదే చోటికెదురుగా పడమటి దిశలోని ఆరడుగులలోతు మురుగు కాల్వలోని తుక్కును, చెత్తను, పాతుకొనిపోయిన పెద్ద ఎండు కొమ్మను ఐదారుగురు బలవంతంగా పైకి లాగడం.

 

          - శాయి నగర్ ముఖ ద్వారం రెండు ప్రక్కల గోడలను కడిగి, గీకి, తుడిచి, ప్రైమరు, రంగులు పులిమి, సుందరీకరణ ముఠావారు రంగు రంగుల బొమ్మలు వేసి, స్వచ్చ సుందర నినాదాలు వ్రాయడం.

 

          - స్థానికులు, ముఖ్యంగా మహిళలు 10 మంది పాల్గొని దారి ప్రక్కల పిచ్చి చెట్లను, తీగలను, గడ్డిని తొలగించి, దారినంతా శుభ్రంగా ఊడ్చి, వ్యర్ధాలన్నిటిని ట్రస్టు ట్రాక్టర్ లో నింపి, చెత్త కేంద్రానికి చేర్చడం.

         

          మొత్తానికి ఈ నాటి చలిని, మంచును కార్యకర్తల కర్తవ్య దీక్ష జయించింది! కాలుష్యం మీద, అనాకారితనం మీద స్వచ్చ శుభ్రత, సుందరీకరణ పై చేయి సాధించింది.

 

          కాఫీ, టీ లతో బాటు కార్యకర్తలకు మిఠాయులు, కేకులు, బిస్కట్లు, తిరుమల – శబరిమల ప్రసాదాలు అందాయి.

 

          నేటి శ్రమదాన సమీక్షా సమావేశానికి ముందు 20 మంది కార్యకర్తల కోలాటం అందరినీ ఆకట్టుకొన్నది. 6.40 సమయంలో అందుకు ఆధ్వర్యం వహించిన అంకంభొట్లు గురువు, ఆ తర్వాత డాక్టర్ పద్మావతులు పదే పదే స్వచ్చ సుందర గ్రామ సంకల్ప నినాదాలను ఎలుగెత్తి చాటారు. ఇద్దరు కార్యకర్తలు – 1. రాయపాటి రాధాకృష్ణ 1000 రూపాయలను, 2. కోడూరు వేంకటేశ్వరరావు గారు 520 రూపాయలను మనకోసం మనం ట్రస్టుకు విరాళమందించినందుకు శతధా అభినందనీయులు.   

 

          ఈ నాటి  శ్రమదాన సందడి కి కొస మెరుపుగా “అక్కినేని అంతర్జాతీయ సంస్థ” వ్యవస్థాపకాధ్యక్షులు తోటకూర ప్రసాదు గారి స్పందన, సందేశం, చల్లపల్లి సందర్శానంతర ఆనంద వ్యక్తీకరణం....చెప్పుకోవాలి. ఇది వ్రాస్తున్న (7.50 am) సమయానికింకా వారు స్వచ్చ చల్లపల్లి సుందర దృశ్యాలను ఊరంతా తిరిగి పరిశీలిస్తూనే ఉన్నారు.

 

          (పై విశేషాలన్నీ విని, చూసి, పాల్గొని, చదువుతున్న వారు ఈ విషయ శీర్షికగా “1887 వ నాటి వేడుక సందడి” అని వ్రాయడాన్ని అంగీకరించాలి. ఇన్ని రోజులు ఇది బాధ్యతగానే తప్ప – బరువు గా చేస్తున్న శ్రమదానం కాదని – ఇదొక స్వచ్చంద శ్రమైక జీవన సౌందర్య సన్నివేశమనీ ఒప్పుకోవాలి.)

 

          రేపటి మన స్వగ్రామ బాధ్యతలు కూడ గంగులవారిపాలెం దారిలోనే అని గమనించండి!

 

         స్వస్తత పెంపొందే పని

గ్రామనికి రోజూ గంట శ్రమచేస్తే తప్పేమిటి?

ఉదయానె సమిష్టి మేలు కుద్యమిస్తే ముప్పేమిటి?

స్వచ్చ భావనతో – శ్రమతో స్వస్తత పెంపొందదా?

స్వచ్చోద్యమ భవితవ్యం సవ్యంగా సాగదా?

 

   నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు- మనకోసం మనం ట్రస్టు,

శనివారం – 11/01/2020

చల్లపల్లి.