2288* వ రోజు....           01-Dec-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...

 

 గ్రామ కర్తవ్య దీక్షలో పాతిక మందిది అక్షరాలా 2288* వ అడుగు.

 

            ఒక్కరోజు ఎడం తర్వాత 12+13 మంది వేకువ 4.15 కే మళ్లీ అదే ఇస్లాంనగర్ దగ్గర పునరుత్సాహభరితులై కలుసుకొన్నారు; గతవారం తరువాయిగా కీర్తి ఆస్పత్రి రోడ్డులో నేటి తమ శుభ్ర -  సుందరీకరణ సంకల్పం మరి కొంత పూర్తిచేశారు; దాంతోబాటు - సుమారు పాతిక అడవి తంగేడు పూల మొక్కల్ని ప్రతిష్ఠించి, మొన్నటి దాక అసహ్యమైన - అప్రతిష్టాత్మకమైన ఎడమ వైపు పెద్ద మురుగు కాల్వగట్టుకు కొంత హంగులూ చేశారు!

 

            ఇందుకు గాను విడివిడి గాను, కలివిడిగాను కార్యకర్తలు పలుగుల్తో - పారల్తో, చీపుళ్లతో శుభం పలికిన శ్రమదాన యజ్ఞం సూక్ష్మాంశాలను నేనుకాక ఇతర గామస్తులు - ఆఖరుకు ఆ వీధి నివాసులైనా - ఎవరు పరిశీలించారు గనుక? తెల్లవారే వేళకు తమవీధి మురుగు కాల్వ ఎంతగా శుభ్రపడి, సవినయంగా మురుగు నీరెందుకు సాఫీగా నడుస్తున్నదో - వందగజాల సదరు కాల్వగట్టు చదునై పోయి, ప్లాస్టిక్ తుక్కు, ఖాళీ సీసాలు మాయమైపోయి, కరెంటు స్తంభాలు అడ్డదిడ్డంగా కాక, పద్దతిగా - పొందికగా ఎందుకు అమరినాయో, చల్లగాలికి గద్దగోరు మొక్కలు తలలూపుతున్నాయో.... గమనిస్తారా? ఆలోచిస్తారా? (అత్యాశ అనుకోకపోతే -) రేపటి నుండి కలిసి వచ్చి సహకరిస్తారా?

 

            ఈ వీధి విశాలమైనదే గాని, చిల్లర మల్లర ఆక్రమణలు కాక - ఒక రామాలయమూ, ఇంకొక పూరిల్లూ రోడ్డుకానుకొనే కొలువు తీరాయి. మూడవ నాటి ప్రయత్నంలో కూడ ట్రక్కు నిండా దిక్కుమాలిన వ్యర్ధాలు నిండిపోయాయంటే ఆ వీధి ఎంత మాత్రం స్వచ్ఛ -  శుభ్ర - సుందరంగా ఉండకూడదని ఎవరో కంకణం కట్టుకొన్నట్లే ఉంది! అదీగాక ఈ పనిమంతుల్లో కొందరు - చెడిపోయి, నీళ్లు వృధాగా కారిపోతున్న కుళాయిల్ని రిపేరు చేసే పని కూడ పెట్టుకొంటారాయె! అందుచేత - నేటి స్వచ్ఛ శుభ్ర సుందరీకృత ప్రాంతం తక్కువ గాను, పనిమాత్రం యధావిధిగా ఎక్కువ గాను జరిగింది!

 

            పరిశీలకులెవరైనా కార్యకర్తల పనితీరు చూడాలనుకొంటే - అది 5.50 – 6.15 నడుమ సమయం బాగుంటుంది. పని వేళ ముగియబోతుందనీ, ఈ ఉదయమే నాటవలసిన మొక్కలు, ఎత్తవలసిన వ్యర్ధాలూ రేపటికి మిగలరాదనే పట్టుదలతో ఏ కార్యకర్తలెంత చురుకుగా - తడబడకుండా  - జాగరూకతతో తమ తమ పనులనెలా ముగిస్తారో అప్పుడు బాగా తెలుస్తుంది!

 

            6.30 సమయాన ఇస్లాంనగర్ దరగా వారి ప్రసాదం కార్యకర్తల కందింది;

            కొన్నాళ్ళ వ్యవధి పిదప BDR ప్రసాద్ ప్రవచిత గ్రామహిత త్రివిధ నినాదాలు వినిపించాయి; నేటి శ్రమదాన సమీక్ష, రేపటి ప్రణాళిక ప్రస్తావన కొచ్చాయి; రేపటి కన్నడ దేశయాత్ర విధానం చర్చ కూడా జరిగింది.

 

            రేపటి మన శ్రమదానం ఆవశ్యకత కూడ ఇదే వీధి చివర్లో ఉన్నందున అందరం బండ్రేవు కోడు వంతెన (కీర్తి హాస్పిటల్ వద్ద) దగ్గరనే కలుసుకొందాం!

 

   సమర్పిస్తాం మా ప్రణామం - 51

 

సమస్య తత్త్వం తెలిసికొంటూ గ్రామ దుస్థితి మార్చుకొంటూ

అడ్డులను తొలగించుకొంటూ - అలసతలను జయించుకొంటూ

ఒకే వీక్షగ ఒకే దీక్షగ - ఉద్యమముగా ప్రయాణించిన

స్వచ్ఛ - సుందర సైనికులకే సమర్పిస్తాం మా ప్రణామం!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త &

మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

01.12.2021.