ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి?
2328* వ నాటి గ్రామాభ్యుదయ శ్రమదానం.
11-1-22 (మంగళవారం) వేకువ కూడ అదే స్వచ్చోద్యమ దృశ్యం! మళ్లీ బందరు రహదారే! గ్రామ వికాస కర్తలు 27 మందిలో సగం మందైతే - 4.15 కే తయారు! 2 గంటల పాటు శ్రమించింది ఇంచుమించు మళ్ళీ నిన్నటి సువిశాల జాతీయ రహదారినే స్వచ్ఛ స్పటికంగా మార్చటం చూస్తుంటే –
ఏ ఊరి – ఏ వార్డు ఆహ్లాదాల కోసం ఈ చలిలో - మంచులో ఇంత మురికి పనులు చేస్తున్నారో - అక్కడి స్థానికులు తొంగి చూడకపోవడం గమనిస్తే - కార్యకర్తల ఉధృతి, మొండి పట్టుదల, నిష్కామ కర్మం పరిశీలిస్తుంటే –
“మరో ప్రపంచం – మరో ప్రపంచం...” అన్న మహాకవి గేయం గుర్తొచ్చిం
ది. ఆ పాటను ఈ సందర్భానికి, కార్యకర్తలకు అన్వయిస్తే ఇలా ఉంటుంది :
“పదండి ముందుకు - గ్రామ శుభ్రతకు
వీధి అవసరం పిలిచింది!
ఎంగిలాకులూ - ప్లాస్టిక్ సంచులు - దుమ్మూ - ధూళీ ఊడ్చేద్దాం
జనం కొరకు శ్రమదానం చేస్తూ
స్వచ్ఛ - శుభ్రతలు సాధిద్దాం!......”
ఈ నాటి పని మధ్యలో మంచినీళ్లు త్రాగుతూ ఒక కార్యకర్త ఇలా అనడం వినిపించింది: “ఇంత చలిలో - మంచులో నాకు ఇలా చెమట పట్టడమేంటో...”
అయ్యా ! అది శరీరం తప్పుకాదు; ఆరోగ్య లోపం కాదు - ఏదో మ్రొక్కుబడిగా కాక, త్రికరణ శుద్ధిగా - బాధ్యతాయుతంగా చేస్తున్న శ్రమదాన ఫలితమే నీ స్వేదం! ఈ ఋతువులో – ఈ బ్రహ్మ ముహుర్తంలో - ఒక్క చెమట చుక్కే మనిషి ఆరోగ్యానికి శుభ సూచకం! ఆ చెమటలు సొంత పని కోసం కాక, గ్రామ సమాజ శ్రేయస్సు కోసం కనుక - ఈ కార్యకర్తల దైహిక, మానసిక ఆరోగ్యాలు రెట్టింపు కావడం ఖాయం!
10 రోజులకు పైగా బందరు రాదారిలోనే - కిలోమీటరు పరిధిలోనే వీధి శుభ్రత పరిమితమై పోయిందంటే –అలా కాక ఇంకెలా ఔతుంది? అంగుళం అంగుళం చొప్పున గడ్డి మొలకలు పీకి, రెండు ప్రక్కలా గజం చొప్పున ఇసుక - దుమ్ములు పేరుకుపోయిన రోడ్డును గోకుడు పారల్తో గోకి గోకి, వ్యర్థాలన్నిటినీ ట్రక్కుల్లో నింపి, అవసరమైన చోటుల్లో గుంటలు పూడ్చి - ట్రాన్స్ఫార్మర్ల దగ్గర సైతం సుందరీకరించి - ఆఖరికి రోడ్ల ప్రక్క ప్రహరీల్ని కూడ శుభ్రపరచి, ఎత్తైన గోడల మీది రావి మొక్కల్ని తొలగించి ఎక్కువ కాలం ఆ గోడల మన్నికను దీవించి... మరి అందుకే ఇంత కాల విలంబం!
“జాప్యం ఐతే కానివ్వండి - ఈ అందమైన, శుభ్రమైన రహదారి మరో రెండు మూడు నెలలపాటు విశాలంగా, ఆహ్లాదకరంగా, సౌకర్యవంతంగా ఉంటేచాల్లే..” అనేది స్వచ్చ కార్యకర్తల ఆశయం! ఈ పరిసర ప్రజల సహకారం - అంటే, కొందరు పుణ్యాత్ములు అడ్డమైన ఛండాలాల్నీ దీని మీద విసరకుంటే, వీలైతే అప్పుడప్పుడైనా ఎవరి ఇళ్లముందు ఆ గృహస్తులు శుభ్రం చేసుకొంటుంటే గాని ఈ శ్రమదాతల ఆశలు నెరవేరవు!
పెద్ద డాక్టరు గారి సమీక్షకు ముందు విస్పష్టంగా మూడు మార్లు చల్లపల్లి శుభ్ర – స్వచ్చ – సౌందర్య హామీ పూర్వక నినాదాలిచ్చింది చాలక - చాగంటి వాని లెవెల్లో కొన్ని జీవిత సత్యాలను ప్రవచించినది నాయుడు మోహనరావు!
రేపటి వేకువ కూడ మనం ఇదే చోట, బందరు మార్గంలోనే కలుసుకోవాలని సంకల్పించుకొన్నది పాతిక మంది కార్యకర్తలు!
ఆ స్వచ్ఛ స్ఫూర్తి విందు!
అడ్డంకులు పెరిగినపుడే అసలు సమర్థతలు వచ్చు
గడ్డుకాల మందె కార్యకర్త నివేశములు హెచ్చు!
ఆగినదా శ్రమదానం ఆ కరోన కాల మందు?
అనుసరింపు – మాచరింపు మా స్వచ్ఛ స్ఫూర్తి విందు!
- నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,
‘మనకోసం మనం’ ట్రస్టు బాధ్యుడు
11.01.2022.