ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి?
ఒక సందడిగా - బందరు వీధిలో 2329* వ నాటి సామూహిక శ్రమదానం!
12-1-22 (బుధవారం) - మార్గశిర మాస దశమి - విశేషించి వివేకానంద జయంతి నాడు - 4.13 కు మొదలై, 6.15 దాక వర్థిల్లినది వీధి శుభ్ర – సౌందర్య కృషి సందడి - వేడుక కాక మరేమౌతుంది? ఎవ్వరినీ నొప్పించక - ఏనాటికైనా నూరు శాతం మంది గ్రామస్తుల్ని ఒప్పించగల, మెప్పించగల, ఈ స్వచ్చోద్యమం అమెరికా నుండో ఢిల్లీ నుండో దిగుమతి ఐనది కాదు - సామాజిక బాధ్యతను గుర్తించిన కొందరు సాధారణ వ్యక్తులు ఐచ్ఛికంగా. సమైక్యంగా చేపట్టినది!
2329* దినాలుగా అలుపెరుగని శ్రమదానం ఇది! మరొక 2329 రోజులైనా సంతోషంగా కొనసాగనున్న ఒకానొక ఆదర్శం! స్వార్థమనేది లేని - ఇప్పటికే ఎన్నో బాలారిష్టాల్ని దాటుకొని - 30 వేల గ్రామస్తుల కోసం ఉమ్మడి స్వస్తతా ప్రయత్నానికి ఇకపై ఏఆటంకాలైనా ఎందుకు ఉండాలి?
ఈనాటి బ్రహ్మముహూర్త గ్రామ సేవకు పూనుకొన్న 33 మంది మహామహులేమీ కారు! ఆకాశం నుండి దిగిన దివ్యదూతలసలేకాదు! తాము బ్రతుకుతున్న సమాజం పట్ల ఆదాన ప్రదానాల్ని బేరీజు వేసుకొని, గ్రామ సామాజిక ఋణ శేషాన్ని గుర్తించి, తమ కర్తవ్యానికి పూనుకొన్న ఈ పేరున్న పెద్ద డాక్టర్లు, నర్సులు, ఉద్యోగులు, రైతులు, వృద్ధులు... తదితర కార్యకర్తలూ చల్లపల్లిలోని వేలాది మనుషుల్లాంటి వాళ్లే! కాకపోతే తమ కనీస బాధ్యతగా ఉన్న ఊరి మెరుగుదలకై రోజుకొక గంట సమయం వెచ్చిస్తున్నారంతే! ఈ ఊళ్ళోని ఏవ్యక్తైనా చేయగలిగిన - చేయదగిన కృషే ఇది!
మరి ఈ 30 కి పైగా వ్యక్తులు ఈ ప్రధాన మార్గంలో - 60 పనిగంటల వ్యవధిలో ఏం సాధించారు - అంటే:
1) అమరావతి జమీందార్ల భవనం ఎదుట – నిన్న కార్యకర్తలు శ్రమించిన చోటనే - సుందరీకర్తలు చెక్కిన 50 గజాల స్వచ్ఛ - సౌందర్య శిల్పం! (వీరిలో మరీ ఒకతన్ని చాల సేపు చూశాను - ఎంతసేపటికి నడుం ఎత్తుతాడో అని!)
2) రెస్క్యూ టీమ్ గా చాల మంది చెప్పుకొనే కరుడు గట్టిన కార్యకర్తల ముఠా పనేమంటే -గోకుడు పారల్తో, రైల్వే పారల్తో రోడ్డును గోకి, ఊడ్చి, పోగులు చేసిన ట్రక్కు మట్టిని – భారత లక్ష్మి వడ్లమర వీధి మార్జిన్లకు చేర్చి, ఎత్తుపల్లాలను సరిచేయడం! (ఆ వెడల్పాటి – సుమ సుందర హరిత శుభ్ర వీధిని ఒకమారు వాట్సప్ చిత్రంలో చూడండి!).
3) మిగిలిన కార్యకర్తలదేమో రోడ్డు మీద ఎవరో పోసుకొని - దాచుకొన్న ఇసుక గుట్టల్నీ ఇసుక సంచుల్ని సర్ది, బాటని మళ్ళీమళ్ళీ ఊడ్చి, తూర్పు రామాలయం దాక స్వచ్చ - శుభ్రతల సంపాదనం!
ఏదో సూక్ష్మంగా - క్లుప్తంగా నేనిలా చెప్పడం తప్ప - 2గంటల - 30 మంది శ్రామికుల గ్రామ బాధ్యతా నిర్వహణనీ - సందడినీ పూర్తిగా వ్రాయాలంటే పేజీలకు పేజీలు నిండిపోతాయి!
6.40 సమయంలో – తన వీధిలో – తన ఇంటి పరిసరంలో ఇందరు పాటుబడుతున్నందుకు కృతజ్ఞతానందాలు తెలిపి, ఊరి స్వచ్ఛ – శుభ్ర - సౌందర్యా కాంక్షను ముమ్మారు బలంగా నినదించినది రాయపాటి రాధాకృష్ణ!
ఈ శ్రమదానం అనన్య సాధ్యమనీ రేపటి మన వేకువ పునర్దర్శన స్తలం ఇదే బందరు మార్గం – ఇదే చోటనీ, ప్రకటించినది డాక్టరు డి.ఆర్.కె ప్రసాదు!
అనుసరింపవ? ఆచరింపవ?
యుగయుగాలుగ – తరతరాలుగ యుక్తమైనది స్వార్థ త్యాగం
దేశ చరితలు - జాతినేతలు తేల్చి చెప్పిన శ్రమ విరాళం
ఊరిలోనే – కనుల ముందే స్వచ్ఛ సైన్యం ప్రదర్శిస్తే
అనుసరింపవ - ఆదరింపవ స్వచ్ఛ సంస్కృతి సంప్రదాయం!
- నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,
‘మనకోసం మనం’ ట్రస్టు బాధ్యుడు
12.01.2022.