2330* వ రోజు.......           13-Jan-2022

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి?

గ్రామ స్వస్తతా పరిచర్యలో ఇది 2330* వ నాడు.

            నేటి (గురువారం - 13.01.2022) గ్రామ వీధుల స్వచ్ఛ - సౌందర్య కంకణబద్ధులు 34 మందైతే - వారి 2 గంటల 13 నిముషాల (4.15 నుండి 6.28) సపర్యలందుకొన్న ప్రాంతం సజీవ మత్స్య విక్రయ కేంద్రం (Live fish) నుండి పెద్ద మసీదు దాక! భారత లక్ష్మి మిల్లు బాటలో కొంత, గంగులవారిపాలెం దారిలో మరి కొన్ని పనులు దాని కదనం! ఈ స్వచోద్యమకారుల ఉత్సాహాలు, విన్యాసాలు అన్నీ నేను గుర్తుంచుకొనక ప్రస్తావించక పోతే - జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యంవారి చిత్రాలు చూడవచ్చు!

            ఈ క్రొత్త ఏడాది లో ఒక్కో రోజు గడిచే కొద్దీ శ్రమదాతల సంఖ్య ఎంతో కొంత పెరుగుతున్నట్లుంది! హుషారు కూడ బాగానే ఉన్నది.  మరి, ఇదేమన్నా పెద్ద పండుగ సమీపిస్తున్న ప్రభావమా అంటే - అదీ కాదు - అసలు వాళ్లకి ప్రతి వేకువా ఒక పండుగేనాయె! బహుశా ఈ ఉత్సాహ ఉద్వేగాలు - గ్రామంలోని అతి ప్రధానమైన - పెద్ద - సువిశాల రహదారిని ఎన్నడూ లేనంత శుభ్ర -సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్న సంతోషం కాబోలు!

            నేడు 34 మంది కష్టంతో 2 గంటల 13 నిముషాలు చక్కగా ముస్తాబయింది 125 గజాల మేర రహదారే కావచ్చు! కానీ అందులో ఎక్కడైనా దుమ్ము - ఇసుక - కాగితాలు-ప్లాస్టిక్ సంచులు... ఒక్కటైనా ఉన్నాయా? ఏ గ్రామంలో వీధులైనా ఇలా కదా ఉండవలసింది? ఏ గ్రామస్తులకైనా ఇంత స్వచ్ఛ శుభ్ర - సుందరమైన వీధిలో సంచరించినప్పుడు గదా మనసు కాస్త ప్రశాంతమై, ఎంతో కొంత సామాజిక స్పృహ కలగవలసింది?

            చిన్నా- చితకా-సందు గొందులు కాక గ్రామంలోని సుమారు 40 ప్రముఖ వీధుల గృహస్తులూ, వ్యాపారులూ, వార్డు మెంబర్లూ ఎక్కడికక్కడ స్వచ్ఛ కార్యకర్తల ప్రమేయం లేకుండ నేటి బందరు వీధంత మనోహరంగా చేసుకొంటే ఈ చల్లపల్లి ఇంకెంత ఆహ్లాదకరంగా ఉంటుంది? ఆరోగ్యం వర్ధిల్లుతుంది? పైగా ఇదేమంత కష్ట సాధ్యం కానే కాదని ఏ రోజు కారోజు స్వచ్చోద్యమ కారులు ఋజువు చేస్తూనే  ఉంటిరి!  కావలసిందల్లా సోదర గ్రామస్తుల్లో ఒక సంకల్పం ఒక చిన్న సామాజిక స్పృహ !

ఈ కార్యకర్తల సత్సంకల్పం ఎంత గట్టిది కాకపోతే- గ్రామ మెరుగుదల కోసం వాళ్లదెంత తీవ్ర నిర్ణయం  కాకపోతే

- అశుద్ధాల మురుగులో- మోకాలి లోతులో దిగి పని చేస్తారా?

- సజీవ మత్స్య విక్రయ దుకాణం దగ్గర అంతగా శ్రమించి బాగు చేసింది చాలక ఒక గృహిణి, ఒక డాక్టరమ్మ కల్లాపి

  చల్లుతారా?

- పెద్ద డాక్టర్లు, ధనిక రైతులు, విద్యాధికులు, తమ ఐడెంటిటీని వదులుకొని-హోదాలు మరచి చీపుళ్లు పట్టి, పార,

 పలుగులు ధరించి వీధి పారిశుద్ధ్యంలోకి దిగుతారా?

 అలా శరీర కష్టం చేయలేని 78 - 83 ఏళ్ల పెద్దలిద్దరు - 6.50 సమయంలో తమ కనీస బాధ్యతగా - స్వచ్చోద్యమ ఖర్చుల నిమిత్తం మనకోసం మనంమేనేజింగ్ ట్రస్టీకి 5000/-, 2000/- విరాళం ఇచ్చుకోవడంలోనూ అదే స్ఫూర్తి! (సదరు స్ఫూర్తి ప్రదర్శకులు - 1. ఉడత్తు రామారావు, 2. మాలెంపాటి గోపాల కృష్ణయ్య గార్లు!)

రేపటి భోగి పండుగ నాటి వేకువ కూడ మన శ్రమదాన పండుగ కోసం ఇదే బందరు రహదారిలో - రాయపాటి - శిర్విశెట్టి వార్ల గృహ సమీపంలోనే కలుద్దాం!

 

             అపభ్రంశమ ? అనాచారమ?

కళ్లెదుటె దిన దినం జరిగే కార్యకర్తల శ్రమ విరాళం-

ఆహో రాత్రుల స్వార్థ త్యాగం ఆదేమైనా అనైతికమా?

అనాచారమ-అపభ్రంశమ ఆటవికమా- దేశ ద్రోహమ?

అనుసరింపవు ఆదరింపవు స్వచ్చ సంస్కృతి సంప్రదాయం!

 

- నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

  ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

  13.01.2022.