ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి?
భోగి పండుగ నాటి గ్రామ స్వచ్ఛ మహోత్సవం @2331* వ దినం.
ఈ మార్గశిర మాస ద్వాదశీ శుక్రవారం (14-1-22) చల్లపల్లిలో డబుల్ ధమాకా - ఒకటి చిర సాంప్రదాయ పెను పండుగైన భోగి, రెండోది గ్రామ స్వచ్చోద్యమకారులు 51 మంది వర్షానంతర చిరు చినుకుల్లో, పెను చలిలో ఎప్పటిలాగే జరుపుకొన్న శ్రమదాన పండుగ! ఈ పండుగల వేదిక - ఒక మహోజ్జ్వల సినీ కళాకారుని - చిత్త శుద్ధి గల అరుదైన పరిపాలకుని పేర విజయవాడ రోడ్డులో నెలకొన్న NTR పార్కు!
ఈ ఊళ్లో కొందరికిది వేల రోజులుగా ‘పాడిందే పాటరా’ అన్నట్టు ఒక రొటీన్ శ్రమదానం కావచ్చు గాని – గ్రామ చరిత్ర మలుపుల ప్రత్యేకతని పసిగట్టే సామాజిక సూక్ష్మ పరిశీలకులుంటే గనుక.. ఈ పర్వదిన వేకువ సమయాన - ఇందరు కార్యకర్తలు గ్రామ సంక్షేమమే ఎజెండాగా 2.00 గంటల పాటు (50 మంది x 2 = 100 పనిగంటలు!) ప్రతిరోజూ వందలాది జనం నడిచే - ఆటలాడే ఈ పార్కును ఉత్సాహంగా మెరుగులు దిద్దడాన్నొక విశిష్ట సంఘటనగా గుర్తిస్తారు!
నేటి స్వచ్ఛంద శ్రమదాన విశేషాలెన్నెన్నో ఉన్నాయిగాని - మచ్చుకు కొన్ని:
1) ఒక ప్రక్క స్వచ్ఛ కార్యకర్తల ప్రజోపయుక్త పార్కు సుందరీకరణం జరుగుతుండగా - 25-30 మంది ఉషఃకాల పాదచారులు అందుకు క్రియాత్మకంగా పూనుకోకున్నా, సొంతానికి కాక - ఊరి కోసం శ్రమిస్తున్న కార్యకర్తల పనిని గౌరవభావంతో గమనించారు!
2) కారకర్తల్లో నడిమి తరగతి - నడిమి వయస్కురాలొకామె ఉంది – ‘అన్నపూర్ణ’ అనే సార్ధక నామ ధేయురాలు - ఎప్పుడూ ఎవరికేమి చేసి పెడదాం, ఎవరి ముఖాల్లో సంతోషం చూద్దాం అనేదే ఆమె తపన! ఈరోజామె తన ఇద్దరు ఇంజనీరు పుత్త్రుల్నీ శ్రమదానం చేయించి, వాళ్ల కష్టార్జితంలోంచి 2000/- ‘మనకోసం మనం’ ట్రస్టుకు ఇప్పించింది!
3) ఇంకో స్వచ్చోద్యమ ఘనాపాఠి ఉన్నాడు - గోళ్ల సాంబశివరావు - ఈ మధ్య కొన్నాళ్లుగా కాస్త వయోభారం ఇంకాస్త అనారోగ్య వాతావరణం వల్ల రావడం తగ్గించినా - అతని తమ్ముళ్లు, కొడుకులు, మనుమరాళ్లు.. ఒక విధంగా ఆ కుటుంబం స్వచ్ఛ వ్యసనపరులే. చాలవరకు వాళ్ల పుట్టిన రోజు వేడుకలన్నీ వీధుల్లో - కార్యకర్తల మధ్యనే!
ఈ ఉదయం కూడ గోళ్ల విజయకృష్ణ జన్మదినం 2000/- విరాళంతో – కార్యకర్తలందరికి అనల్పాహార విందుతో - చిన్న కండువాల పంపిణీతో - వెరైటీగా జరిగింది!
4) గ్రామ సర్పంచి ఇంత వేకువనే ఒడలు వంచి శ్రమదానం చేయడం, మన చల్లపల్లి మండలాధ్యక్షురాలు – కోట విజయ రాధిక ఈ చలిలో వచ్చి స్వచ్చోద్యమానికి సంఘీభావం తెలపడం మాత్రం విశేషం కాదా? ఈ భోగి – సంక్రాంతి - కనుమ పండుగ రోజుల్లో కార్యకర్తలందరికీ NTR పార్కులో జరిగే డప్పుకళా ప్రదర్శనకు ఆహ్వానం అందింది.
మా ఇంటి నుండి పార్కు దాక – 2 ½ కిలోమీటర్ల దూరంలో మొత్తం ఏడెనిమిది పెద్ద భోగి మంటల్ని చూశాను; మూడు నాల్గు పర్యావరణ భంగకరమైన ఫ్లెక్సీలనూ చూశాను. సాంప్రదాయాన్ని వదలకుండానే - పర్యావరణహితమైన భోగి మంటలుంటే ఎంత బాగుంటుందో కదా!
నేటి గ్రామ స్వచ్ఛ – శుభ్ర - సౌందర్యపరమైన నినాదాల వంతు పైడిపాముల కృష్ణకుమారి గారిది. పదే పదే శ్రమదానంతో పునః పునః సంతృప్తి 51 మంది కార్యకర్తలది!
గ్రామ స్వస్తతకే మద్దతు
కవులూ - గాయకులు - చిత్ర కళాకారులిందు కలరు
గృహిణులు – ఒజ్జలు – రైతులు - వృద్ధులు, వైద్యులును కలరు
స్వచ్చోద్యమ మంటే గ్రామ సమాజ ప్రతిబింబమనే
భావింపుము – ప్రకటింపుము – స్వచ్ఛతకే నీ మద్దతు!
- నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,
‘మనకోసం మనం’ ట్రస్టు బాధ్యుడు
14.01.2022.