ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!
ఈ ఆదివారం వేకువ 3.57 – 6.24 నిముషాల నడిమి కాలంలో నిన్నటి నిర్ణీత ప్రదేశమైన ప్రభుత్వ రవాణా సంస్థ ప్రాంగణంలో – రెండెకరాల ఖాళీ స్థలంలో జరిగిన శుభ్ర – సుందరీకరణ కృషిలో 40 మంది బాధ్యులు భాగస్వాములయ్యారు.
తాతినేని (మొక్కల) రమణ ఖాళీ చేసిన పసి మొక్కల స్థలాన్ని పదిమంది ఎంచుకుని, అక్కడి నానాజాతి కంగాళీని ఊడ్చి, ఖాళీ మద్యం సీసాలను ఏరి, పిచ్చి మొక్కల్ని పీకి, నరికి వ్యర్ధాలను ట్రస్టు వారి వాహనంలో నింపి చెత్త కేంద్రానికి తరలించారు. బస్సు కూతల – మ్రోతల మధ్యే అక్కడి దారిని కూడ ఊడ్చి, శుభ్రపరిచి, భీభత్స కషాయం ఉన్న చోటనే స్వచ్చ సౌందర్య రసాయనం సృష్టించారు.
మరో పది మంది పెదకదళీపుర రహదారి వైపున చిట్టడివిలా పెరుగుతున్న రకరకాల అనాకారి చెట్లను నరికి, డిప్పల కొద్దీ ప్లాస్టిక్, సారా సీసా అవశేషాలను సేకరించి, మూత్రశాల/పానశాల గా మారిన ఆవికృత ప్రదేశాన్ని స్వచ్చ – శుభ్ర – సుందరీకరించారు.
ఇంకా పదిమంది బండ్రేవుకోడు మురుగు కాల్వ వైపున్న ముళ్ళ పొదల్ని, తీగల్ని, తొలగించి స్వచ్చ సైనికులనే పేరును సార్ధకం చేశారు.
మహిళలు గొర్రులకు, చీపుళ్ళకు పనిచెప్పి ఎంత ఊడ్చినా – ఆ రెండెకరాల ఆవరణలోని వ్యర్ధాల తొలగింపు పూర్తి కాలేదు.
వర్తమాన భారతదేశానికి, ముఖ్యంగా ఆంధ్ర దేశానికీ ఈ బస్సు ప్రాంగణం ఉదాహరణ మనిపిస్తున్నది – స్వచ్చ – స్వస్త, సుందరీకరణ చర్యలూ ఇక్కడే! ఆక్రమణలూ, అందవికార చర్యలూ, కాలుష్య పెంపుదలా ఇక్కడే! ఒక వంక స్వచ్చోద్యమ కారులు నాటి, సాకి, పెంచిన పచ్చని చెట్లూ, పూల వనాలూ, మరో వంక (అందమైన మూత్రశాల అక్కడే ఉన్నా -) మూత్రవిసర్జనలూ, బాధ్యతారహిత మద్యపాన చర్యలూ కూడ ఇదే చోట!
RTC ఉద్యోగులు, పోర్టర్లు వారానికొక మారైనా ఈ ప్రజా రవాణా ప్రాంగణాన్ని శుభ్ర పరచుకోరాదా? ప్రయాణికులు మరికొంత స్వచ్చ స్పృహ తో ఉండవద్దా!
ధ్యాన మండలి ప్రతినిధి రాయపాటి రాధాకృష్ణ 7.00 కు గొంతెత్తి ముమ్మారు చాటిన స్వచ్చ – శుభ్ర – సుందర గ్రామ సంకల్ప నినాదాలాతో ఈ గణతంత్ర దినోత్సవ సందర్భ బాధ్యత ముగిసింది. సదరు సమీక్షా సమావేశంలోని కొన్ని గమనికలు :
- శంకర శాస్త్రి గారి మనుమడు – వివేకానందుని వైవాహిక ప్రస్తావన (1 వ తేదీ) 2 వ తేదీ – ఆదివారం విజయవాడ లో నూతన దంపతుల స్వీకరణ వేడుక.
- రామకృష్ణ ప్రసాదు గారు “స్టీవ్ జాబ్స్” అంతిమ దినాల స్వీయ జీవిత సమీక్షా సందేశాన్ని గుర్తుచేయడం.
- పసుపులేటి సత్యం గారి కుమారుడు – శ్రీనివాసరావు గారి నూతన గృహ ప్రవేశానికీ, తత్సంబంధ భోజన – భాజనావళికీ స్వచ్చ కార్యకర్తలకు ఆత్మీయ ఆహ్వానం.
మన రేపటి స్వచ్చంద శ్రమదానం కూడ RTC ప్రాంగణంలోనే నిర్వహిద్దాం.
సమర్పిస్తూ...సమర్చిస్తూ
రైతు బిడ్డలు – వృత్తి వైద్యులు – వృద్ధ మూర్తులు – వృత్తి నిపుణులు
గృహిణులిందరు గ్రామమునకై శ్రమను – ధనమును –బుద్ధినీ – పం
దొమ్మి దొందల నాళ్ళుగా – తమ బాధ్యతనుకొని సమర్పిస్తూ –
సమర్చిస్తూ నిజంగానే సాగి ముందుకు దూసుకెళ్ళారా!
నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,
సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,
ఆదివారం – 26/01/2020
చల్లపల్లి.