ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!
స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం –1906* వ నాటి విశేషాలు.
(మానవ జాతి ప్రస్థానంలో మరో కొత్త వెలుగు ప్రసరించిన జాతిపితను మనమే హత్య చేసుకొన్న విషాదకరమైన) జనవరి 30 వ తేదీన ఆయన బాటలో కొంతైనా నడుస్తున్న స్వచ్చ సైనికులు 29 మంది ఉదయం 4.04-నుండి 6.16 నిముషాల దాక బస్ ప్రాంగణం లోపలా, బైట నాగాయలంక దారిలోనూ నిర్వహించిన గ్రామ స్వచ్చోద్యమం విజయవంతమైంది.
గ్రామ సుందరీకరణ దళం ఐదవ రోజు కూడ నిన్న ప్రైమరు పూసిన ‘ జల నిలయాన్ని’ ఆకర్షణీయమైన రంగులతో అలంకరించి, దాత కోనేరు హంపి నామ ఫలకాన్ని ప్రస్ఫుటం చేసి, కొసరుగా పాత మరుగుదొడ్ల గోడ నంతటినీ కడిగి, శుభ్రం చేశారు.
నలుగురు కార్యకర్తలు బస్ స్టాండు కట్టడాన్ని పండగ దాటిన తర్వాత పై కప్పు పాదుట్ల(బూజులు) దులిపి, ఊడ్చి కొత్త కళ తెస్తే-మిగిలిన మహిళలు సైకిల్ స్టాండ్లు-దుకాణా సముదాయాల ముందు భాగాలన్నీ ఊడ్చి శుభ్రం చేశారు.
మిగిలిన డజను మంది చీపుళ్లతో అర కిలో మీటరు దాక-విశాలమైన నాగాయలంక రహదారిని-మూడవ సారి కాబోలు-శుభ్రం చేశారు.
కుంచెలతో రంగులద్దే, స్వచ్చ నినాదాలు వ్రాసే- ఈ స్వగ్రామ సౌందర్య కారులు గానీ, కత్తులతో పిచ్చి చెట్లనో కొమ్మల్నో నరికే కార్యకర్తలు గానీ, చీపుళ్లతో రహదారి శుభ్రతకు పాటుబడే చల్లపల్లి స్వచ్చ సైనికులు గానీ- చూస్తున్నప్పుడు - ‘ వేట కొడవళ్లతో కసిగా శత్రువుల్ని తరిమికొడుతున్న రాయలసీమ ఫ్యాక్షనిస్టులు’ గుర్తుకొస్తున్నారు!
కాఫీ-టీ ఆస్వాదనల-సరదా సమయం తరువాత జరిగిన గ్రామ శుభ్రతా సమీక్షలో 80 ఏళ్ల మాలెంపాటి గోపాల కృష్ణయ్య గారు ముమ్మారు ధృఢంగా పలికిన స్వచ్చ సుందర సంకల్ప నినాదాలతో నేటి మన బాధ్యతలకు తాత్కాలిక స్వస్తి! ఈ సమీక్షా సమయంలో మూడు విశేషాలు:
- రెండేళ్ల నుండీ, ‘మనకోసం మనం ట్రస్టుకు’ కునుకు లేకుండా చేస్తున్న అనుచిత ఆదాయ పన్ను భారం తొలగిపోయిన శుభవార్త.
2. R.T.C ప్రాంతీయ ఉన్నతాధికారి బస్టాండు ఆవరణలో మనం కోరిన కొంత భాగాన్ని శుభ్ర-సుందరీకరణకు సంతోషంగా అంగీకరించడం.
3. నాదెళ్ల సురేష్ ఐక్యరాజ్య సమితిలో “ స్వచ్చ సుందర చల్లపల్లి” ఉద్యమ గళం వినిపించేందుకు (ఫిబ్రవరి 14 న)సుముహూర్తం.
రేపటి మన స్వచ్చోద్యమ బాధ్యత ను పడమటి వీధిలో రైస్ మిల్ వద్ద ప్రారంభిద్దాం!
పురోగమనం నిజంగానే!
స్వచ్చ సుందర ఉద్యమంబిది- గ్రామ భవితల క్రొత్త మలుపిది
పదవులూ-కులమతాతీత స్వార్ధ రహిత శ్రమైక జీవన
సంస్కృతికి పందొమ్మిదొందల నాళ్లుగా ఇది జ్వలిస్తున్నది
నిజంగానే నిబ్బరంగా-నిశ్చింతగ పురోగమిస్తుందా!
నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,
సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,
గురువారం – 30/01/2020
చల్లపల్లి.