కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను అనివార్యంగా మానేద్దాం!
26 మంది x 106 నిముషాలు = బెజవాడ బాట సుందరీకరణ - @ 2517*
శ్రావణ శుక్రవారపు వీధి పారిశుద్ధ్య సంగతి టూకీగా అది! చల్లపల్లిలో తొలి తరం శస్త్రవైద్యుని (86*) తో సహా ముగ్గురు ప్రముఖు డాక్టర్లు, మరో ముగ్గురు విశ్రాంత ఉద్యోగ వృద్ధులు - (మొన్న శ్మశానంలో కత్తి వేటుకు కాలు తెగిన భారీ వృద్ధునితో సహా) గృహస్త - కర్షక - మహిళామతల్లులు అంకితభావంతో చిల్లలవాగు వంతెన కేంద్రంగా నిర్వహించిన కర్తవ్యమది!
‘జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యం’ అనే వాటప్ చిత్రాల్ని గనుక మీరెవరైనా అనుసరిస్తుంటే - దారి పడమర వైపున్న రెండు పెద్ద గుబురు చెట్ల దగ్గరే ఏడెనిమిది మంది గంటసేపు చెమట చిందిస్తున్న వైనం తప్పక ఆకర్షిస్తుంది. నా దృష్టిలో వాళ్ల విలువైన సమయమూ, శ్రమా చాల పవిత్రమైనవి!
మనుషులకే గాదు - చెట్లూ చేమలకూ, రోడ్లకూ, వాగూ - వంకలకూ మురుగు కాల్వలకూ, ఆఖరికి శ్మశానాలకు సైతం స్వచ్చ - శుభ్ర - సౌందర్యాలు అవసరమనీ, అవి గ్రామ ప్రజలకు అత్యవసరమనీ గ్రహించిన స్వచ్చ కార్యకర్తలు అకుంఠిత దీక్షతో సదరు అవసరాలు తీరుస్తున్నారు!
వాళ్ల చర్యల్తో అసలే అందంగా - హరితనందనంగా - సుమ సుందరంగా ఉన్న ఈ బెజవాడ దారి, చిల్లల వాగు వంతెన మూల మూలల్లోని కశ్మలాలను వదుల్చుకొని, అడపాదడపా కనిపించే ప్లాస్టిక్ తుక్కును పోగొట్టుకొని, ఏ కాస్త స్వచ్చ - సౌందర్య స్పృహా ఉన్న వ్యక్తులకైనా ఈ ఉషోదయం, సూర్యోదయం తర్వాత కళ్ళార్పక చూడ దగ్గ దృశ్యంగా లేదా?
ఈ 100 గజాల రహదారి భాగం కాని, తరిగోపుల ప్రాంగణం కాని, దాని మాటున తీర్చిదిద్దిన కట్టడాలు గాని, పుష్ప - హరిత సంపద గాని కాస్త భావుకతతో చూస్తే మరో లోకంలా అనిపించడం లేదూ?
మరి - ఐతే - ఈ ప్రత్యేకతకు - ఈ అపురూప సన్నివేశాలకు కారణాలు? కార్యకర్తల 2517 దినాల - 4 లక్షల గంటల శ్రమ, ట్రస్టు కార్మికుల అంకితభావం, ఊరి పెద్దల, దాతల సౌజన్యం.... ఇవి కాక మరే కారణాలు కావాలి?
శ్రమ వేడుక ముగిసి, కాఫీ - కబుర్ల వేడుకలో 87 ఏళ్ల వయోవృద్ధ వైద్య/ దాతృత్వ/ కార్యకర్త - దుగ్గిరాల శివప్రసాద్ మహోదయుడు ముమ్మారు నినదించిన గ్రామ శుభ్ర - సౌందర్య నినాదాలు వినిపించాయి! సదరు సీనియర్ వైద్యుని 5 లక్షల వితరణను కార్యకర్తలు గుర్తుచేసుకొన్నారు!
రెండు రకాల చిన్న స్వీట్లూ తదుపరి లడ్డు ప్రసాదం ఒక శాస్త్రి గారు, అన్నపూర్ణ గారు పంచినది నేటి విశేషం.
రేపటి శ్రమదానం కోసం కూడ మనం కలువదగిన చోటు ఈ తరిగోపుల ప్రాంగణమే!
- నల్లూరి రామారావు,
26.08.2022.