2518* వ రోజు..........           27-Aug-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దాం!

                    2518 * వ నాటి -27 గురి శ్రమదానం

శనివారం (27.08.2022) నాటి సామూహిక శ్రమదానం జరిగింది బెజవాడ రహదారి - చిల్లల వాగు ఉభయ గట్ల వద్దే! చల్లపల్లిలో ఇలాంటి సామాజిక సత్కార్యానికి లోటేముంది- దానికి కొలతలూ, ప్రమాణాలూ మాత్రం ఏముంటాయి – దాని స్ఫూర్తి ఎంత, ఎంతమంది గ్రామస్తుల మీద ఏ పాటి ముద్ర వేసింది.... అనేవి తప్ప?

          క్రొత్త ఆలోచన జోలికి పోక- యదాలాపంగా, గతాను గతికంగా బ్రతికేసే వాళ్లకు బహుశా ఈ 2518 * నాళ్ల నిరంతర కృషి ఎందుకో- ఏ కూటికీ-గుడ్డకో, మురుగు కాల్వల్లో దిగి, శ్మశానాల్లో సంచరించే పిచ్చి ఏమిటో – దానికి మందేమిటో పట్టకపోవచ్చు!  కాని – ఎంతో కొంత చైతన్యం కల చల్లపల్లిలో వందల కొద్దీ సదాలోచనా పరుల మాటేమిటి? సొంత ఊరి మెరుగుదల కోసం జరిగే ఈ బృహత్ యజ్ఞానికి ఎందుకు దూరంగా ఉంటున్నారు?

          27 వేల మంది ప్రజలకు - వెయ్యి కొకరు చొప్పున – అదీ ముగ్గురో నలుగురో డాక్టర్లు , అంతే మంది ముసలి ఘటాలు, గృహిణులు, ఉద్యోగులు కేవలం 27 మందే తమ ఊరి మెరుగుదల కోసం శ్రమించారనేది నేటి వాస్తవం!

          మనం పుట్టి పెరిగిన ఊరు స్విట్జర్లాండు, న్యూజిలాండు, ఫిన్లాండు దేశాల పల్లెటూర్లంత బాగుండక పోయినా – మురికి కొట్టుకొని, కళాకాంతీ లేక, మురుగు కంపు కొట్టకుండానైనా ఉండొద్దా?

          ఈ 27 మంది స్వచ్చ కార్యకర్తల బలహీనత ఇదే కాబోలు! – అస్థవ్యస్తమైన రోడ్లు, ఊరి వెలుపల రహదార్లూ, కంటికింపితం గాని బహిరంగ ప్రదేశాలూ చూసి సహించలేని – తమ చాతనైనంతగా ప్రయత్నించాలనే బలహీనత!

          ఇప్పటికి ఎనిమిదేళ్లు కాక- మరో 8 ఏళ్ళైనా స్వచ్చ కార్యకర్తల ఈ బలహీనత చెక్కు చెదరక నిలచి ఉండాలనీ – అది ఊరి జనానికి కూడ తగు మాత్రం అంటుకోవాల్సిందేననీ కోరుకుందాం!

          నేటి శ్రమదాన విన్యాసాల గురించి ఎంత వ్రాసినా తక్కువే! చెట్లనూ, ముళ్ల,పిచ్చి మొక్కల్నీ , వంతెన మూలల్నీ, రోడ్ల మార్జిన్లనీ, ఆటోనగర్లో ఒక వీధినీ వాళ్లకు నచ్చినట్లు తీర్చిదిద్దారు!

          కార్యక్రమం ముగింపు 10 నిముషాల్లో – ఒక పొరుగూరి కర్షక కార్యకర్త – మల్లంపాటి ప్రేమానందం నినదించిన చల్లపల్లి స్వచ్చ-శుభ్ర-సుందరీకరణ నినాదాలు కాక- కాంపౌండర్ శేషు పాడిన భక్తి పారవశ్య గీతం మరొక విశేషం!

          రేపటి మన కఠినతర శ్రమదానం హిందూ శ్మశాన వాటికలోనే!

          *ఉమ్మడి ఉద్యోగం ఇది!*

పరిహాసం కానిది – ఏ ప్రత్యామ్నాయం లేనిది

ప్రభుత్వం వల్ల కాక కాడి పారేసిన సంగతి ఇది

ధృఢ నిశ్చితి, కార్య దీక్షతో మాత్రమే సాధ్యపడే

ఒక గ్రామ పురోగతి కై ఉమ్మడి ఉద్యోగం ఇది!    

 

- నల్లూరి రామారావు,

   27.08.2022.