2520* వ రోజు....           29-Aug-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దాం!

రెస్క్యూ దళం వారి 2520*వ నాటి కృషి!

          వాళ్లు 5+1 మంది; వాళ్ల కృషి నిస్వార్థం, ప్రస్తావ నార్హం! ప్రతి సోమ, మంగళవారాల వేకువ జాముల్లో అదొక ప్రణాళికా బద్ధం! నేటి శుభోదయాన చల్లపల్లికి 2 కి.మీ. దూరాన – మహాబోధి పాఠశాల – పాగోలు గ్రామాల నడుమ ఈ ఐదారుగురి శ్రమదానం సార్థకం!

          తమ చల్లపల్లి పరిధి దాటి - పొరుగు పంచాయతీకి చెందిన ఒక రహదారిని ఊడ్చి - మొక్కలు నాటి, పెంచి, రంగురంగుల పూలు పూయించే పనిని ఇప్పడే కాదు - ఐదారేళ్ల నుండీ స్వచ్ఛ కార్యకర్తలు చేస్తూనే ఉన్నారు. అది చల్లపల్లా – పాగోలా అనే వివక్ష లేక యార్లగడ్డ శివప్రసాదు, కంఠంనేని రామబ్రహ్మం వంటి దాతలు స్వచ్చోద్యమానికి వెన్నుదన్నుగా నిలుస్తూనే ఉన్నారు.

          ఈ రెండో ఆయనైతే మరీ - తన 71 ఏళ్ల వయసును గాని, అంతంత మాత్రంగా ఉండే తన ఆరోగ్య -  ఆర్థిక స్థితులు గాని చూసుకోక – శారీరకంగా - ఆర్థికంగా చల్లపల్లి స్వచ్చోద్యమ భారాన్ని మోస్తుంటాడు! దుర్గా ప్రసాదు, శివాజి వంటి టీచర్లు సైతం అవకాశమున్నంత వరకు ఈ సామాజిక బాధ్యతలు మోస్తూనే ఉంటారు!

          ఈ నాటి రెస్క్యూ టీం ముఖ్య వ్యాపకమేమంటే – తాము నాటిన చెట్లు కాలక్రమాన కొన్ని నష్టపడితే - రేపటి బుధవారం దట్టంగా పెట్టబోయే పూల మొక్కలకు ½ కిలోమీటరు దాక, లైనింగ్ చేసి, స్థల నిర్దేశం చేయడమే! బహుశా రేపు పాదులు తీసే పనిపెట్టుకొంటారు!

          ఈ గంటన్నర పరిశ్రమ తరువాత తూములూరి లక్షణరావు ప్రవచించిన స్వచ్ఛ – శుభ్ర –సౌందర్య ప్రబోధాత్మక నినాదాలతో వారి కృషి సమాప్తి!

          గ్రామజన సహకారమేదీ?

అనారోగ్యం తరిమికొట్టే - అసౌకర్యం తొలగగొట్టే –

ఐకమత్యపు బలం నిలిపే – వీధులన్నిటి నందగించే –

మానసిక స్వస్తతను తెచ్చే – సమూహ శ్రమదానమునకీ

గ్రామజన సహకారమేదీ? సదవగాహన రీతి ఏదీ?

- నల్లూరి రామారావు,

   29.08.2022.