కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దాం!
30 మంది శ్రమతో కమ్యూనిస్టు వీధి దాక మెరుగుదల - @2542*
అది శుక్రవారం వేకువ నెరవేరిన కర్తవ్యం! 27 నుండి 31 మందికి అందులో ప్రమేయం! వాళ్లది 35 నుండి 91 ఏళ్ల ప్రాయం! ప్రాత ప్రభుత్వాసుపత్రి నుండి సామ్యవాద వీధి పర్యంతం! అదేదో జీత భత్యాల కోసమో - ప్రచారం నిమిత్తమో - ఈసురోమంటూ చేయడం కాక, కొన్ని తరాల గ్రామ భవితవ్యం కోసం జరిగే శ్రమదానం!
గ్రామస్తులెవరైనా ఇప్పుడు భోగాది ప్రకాశరావు ఇంటి ప్రక్క వీధి మార్జిన్ నో - అందుకు - తూర్పుగా 100 గజాల బైపాస్ వీధి బాగాన్నో చూడండి! నిన్న – మొన్నటికీ ఈ సూర్యోదయం వేళకీ అక్కడ జరిగిన మంచి మార్పును పసికట్టండి! మనసున్న మనుషులు గనుక తప్పక స్వచ్చ కార్యకర్తల గ్రామ సామాజికోద్దేశాన్ని గ్రహించి తీరుతారు; ఏ కాస్త తీరుబాటు చిక్కినా, రేపటి నుండి స్వచ్ఛ - సుందర చల్లపల్లికి జై కొడతారు!
“చల్లపల్లి అనేది 99 శాతం ఊళ్లకు భిన్నమనీ, అక్కడ సామాజిక చైతన్యమూర్తులు ఎక్కువగా ఉంటారనీ, అవసరమైతే సొంత పనులు కాస్త ప్రక్కన పెట్టి, ఇతరుల ప్రయోజనాల కోసం కాలాన్నీ, ధనాన్నీ శ్రమనూ వెచ్చిస్తారనీ.... ‘రాష్ట్రంలో, దేశ విదేశాల్లో ఒక సదభిప్రాయం వ్యాపించింది. మరి ఇంటికొక శ్రమదాత బయలు దేరితే? వాళ్ల చొరవ, సృజనాత్మకత వికసిస్తే?
అన్ని రోజుల్లాగే ఈ వేకువ కూడ (4.18 - 6.07 సమయాల మధ్య) ఒక స్వచ్ఛ – సుందర గ్రామ వీధి కోసం ఏం పనులు జరగాలో అవన్నీ జరిగాయి! అనగా - రోడ్ల అంచుల్ని పటిష్టపరచడం, దుమ్ము – ధూళీ ఊడ్చి, రాళ్లూ – రప్పలూ ఏరి, పిచ్చి – ముళ్ళ మొక్కల్ని నరికి, వీధి మార్టిన్ల ఎగుడు - దిగుళ్లను సరిజేసి, రెండు చోట్ల పూల మొక్కల్ని నాటి, కొందరు గడ్డిని తరిగి, సిమెంటు బాట మీద చట్టుగా మారిన ఇసుక - మట్టిని తొలిచి, వ్యర్ధాల్ని ప్రోగు చేసి, ట్రాక్టర్లో నింపి......వగైరాలన్నమాట.
6.10 కి పని ముగింపు వేళ, కాఫీల – కబుర్ల పిదప కమ్యూనిస్టు వీధి దగ్గర జరిగిన ముగింపు/ సమీక్షా సభకు కార్యకర్తలు సరే - ప్లాస్టిక్ వస్తువుల మోజు వదలని గ్రామస్తులు వస్తే బాగుండేది.
అక్కడ షణ్ముఖ ఎలక్ట్రానిక్స్ దుకాణదారుడు శ్రీనివాస్ వ్యర్ధాల నుండి తయారైన పర్యావరణ మిత్ర వివిధ వస్తువుల్ని వివరించి కొన్నిటిని చల్లపల్లి స్వచ్చోద్యమానికి బహూకరించి, ముమ్మారు తన ఊరి స్వచ్చోద్యమ సారాంశాన్ని నినదించిన సన్నివేశం చూసేవారు!
మన రేపటి వేకువ వీధి పారిశుద్ధ్య వేడుక బైపాస్ వీధిలోని కమ్యూనిస్టు బజారు నుండి మొదలు కాగలదు.
మా (గంగులవారిపాలెం) వీధి...
సామూహిక సామాజిక సదాచరణ కుదాహరణ
స్వచ్చోద్యమ తాత్త్వికతకు సముచితమగు ఒక ప్రేరణ
ఉదయపు వాహ్యాళికి అత్యుత్తమ ప్రత్యామ్నాయం
అన్ని గ్రామ వీధి ప్రజల కదొక గొప్ప సందేశం!
- నల్లూరి రామారావు,
23.09.2022.