పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!
2583* వ వేకువ శ్రమదానం సమాచారమేమంటే :
అది ఈ ఆదివారం(6-11-22) వేకువ 4.21 కి ప్రారంభమై, 6.10 దాక జరిగెను; దానితో 40 మందికి ప్రమేయముండెను; వరుసగా నాల్గవ రోజు సైతం పాగోలు మార్గమందే – NTR (మహాబోధి) పాఠశాల యొద్దనే జరిగెను; ముగ్గుర్నలుగురు తప్ప పాగోలు వారికి గాని, సదరు బాట యొక్క స్వచ్ఛ – శుభ్ర - హరిత సౌందర్యాలనాస్వాదించే వారికి గాని, స్వచ్ఛ కార్యకర్తలకు సహకరించాలనెడి దయ రాకుండెను...
ఊరి ప్రయోజనం తప్ప – ఈ నిత్య శ్రమదాన కర్మల నుండి వ్యక్తిగత ప్రతిఫల మాసింపని స్థిత ప్రజ్ఞులు కనుక - ఎవరు సహకరించారో, ఎవరు తొంగి చూడనే లేదో అనెడి ఆలోచన రాని కార్యకర్తలు మాత్రము తమ బాధ్యతను మరువక ఈ క్రింది విధముగా పాగోలు రహదారి పారిశుద్ధ్య కృషిని కొనసాగించిరి!
నేను వెళ్లునప్పటికే అక్కడ ½ కిలోమీటరు పొడవునా నాలుగైదు బృందాలుగా తమ వివిధ పనిముట్లతో – మైకు పాటల కోలాహలము నడుమ కార్యకర్తలు శ్రమించు చుండిరి! (ఆ పాటలేమాత్రము అసభ్యముగా – అశ్లీలముగా లేక - ఈ ఉదాత్త శ్రమదానమునకు తగ్గట్లే ఉండెను!)
అందులో సుందరీకరణ బృందముగా పేరొందిన కొందరు తదేక దీక్షగా - అప్పటికే అందముగాను, పొందికగానున్న కొన్ని చెట్లకు, పూల మొక్కల కొమ్మలకు మరింత అందము చేకూర్చుటకై క్షురకర్మ గావించుట గమనించితిని. మరికొందరు గృహిణీమతల్లులు, పంతులమ్మలు చీపుళ్ళతో రహదారిని ఉడ్చి, తమ ముంగిలి వోలె రూపొందించుట గాంచి, సంతసించితిని.
మొదలంట కూల్చబడిన మహావృక్షమును బలిష్టులగు ఇద్దరు ముక్కలుగా నరుకు చుండుట కూడ నాదృష్టికి వచ్చినది. రోటరీ – లయన్స్ – ధ్యాన మండలి - ఉపాధ్యాయులు – వైద్యులు – డెబ్బది ఎనుబదేళ్ల వృద్ధులు తమ శాయాశక్తులా ప్రయతిస్తున్న ఈ స్వచ్చ – సుందరోద్యమంబునందు ఎనిమిదేళ్లు – 2583 నాళ్ల పిదప కూడ చైతన్యవంతులైన గ్రామస్తులేల పాల్గొనకుందురో అనెడి ప్రశ్నలు మాత్రము నా వంటి వారిని తొలుచుచున్నది!
6.25 – 7.00 గంటల నడుమ ఎప్పటి వలెనే ఈ దైనందిన శ్రమదాన సమీక్షకు ముందు, ఒక విశ్రాంత ప్రాచార్యుడు – కోటేశ్వర మహోదయుని నినాదాలకు జయధ్వానములు పలికి, తక్కువ ఆర్ధికమూ – ఎక్కువ దాతృతాకల కంఠంనేని రామబ్రహ్మ ప్రాయోజిత అనల్పాహార పానీయములందుకొని,
మన చిరకాల స్వచ్చ వృద్ధ కార్యకర్త డాక్టర్ మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారి 4,000/- విరాళమునందుకొని,
అమెరికాలో అకాలమృతి చెందిన సజ్జా రాజేష్ భౌతికకాయమునకు నివాళులర్పించి, కార్యకర్తలీ నాటికి తమ ఊరి మెరుగుదల ప్రయత్నము విరమించిరి.
వారి నిర్ణయమును బట్టి - బుధవారము బ్రహ్మముహూర్తమున స్వచ్ఛ శ్రమదాతల పునర్దర్శనము ఈ పాగోలు మార్గము నందే!
(అయ్యా! ఇట్టి భాష మా చిన్నతనంబున ‘సరళ గ్రాంధికము’ పేరున ప్రచారములో నుండెడిది!)
“డి.ఆర్.కె” నామధేయ
స్వచ్చోద్యమ చల్లపల్లి సంచాలకుడై చెలగిన –
అనుక్షణ సమాజ హితం అభిలషించి అడుగేసిన –
పరుల కొరకు కష్ట నష్ట పధం ఎంచుకొని గెలిచిన –
“డి.ఆర్.కె” నామధేయ ‘కుటుంబ వైద్య’ ఉదాహరణ!
- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,
06.11.2022.