పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!
అదే పాగోలు రోడ్డుకే 2585* వ నాటి శ్రమ సైతం సమర్పితం.
మంగళవారం (08.11.2022) నాటి రెస్క్యూ దళ కృషి కూడ నిన్నటి తరువాయిగానే - చల్లపల్లికి 2-3 కిలోమీటర్ల దూరానే – మహాబోధి పాఠశాల సమీపానే – స్వభావరీత్యా సోమవారం వలెనే జరిగింది. ఐదుగురి టీముకు మద్దతు కూడ యదావిధిగా నలుగురు ఇతర కార్యకర్తల నుండి దక్కింది.
విద్యుత్ శాఖ వారి ఖండనంతో బాట ప్రక్కన చిందరవందరగా పడిన - ఐదు రోజులు కార్యకర్తలు తొలగించిన కొమ్మలు, దుంగలు పోను ఎండి, చలికాలం పొయ్యిలోకి పనికొచ్చే ఎండు కట్టెల గుట్టలు ఈ ఉదయం మరొక ట్రాక్టరుకు సరిపడా ఏరి, సర్ది వేరొక చోటికి చేర్చడమే నేటి పని కూడా!
అసలీ పాగోలు రహదారి దెంత అదృష్టమో గమనించండి! పాతిక – ముప్పై – నలభై మంది నిస్వార్థపరులు వారాల తరబడీ దాన్ని పునః పునః సుందరీకరించడం అదృష్టం కాక మరేమిటి? పాగోలు నుండి ఒక్కరిద్దరు ముగ్గురు తప్ప ఏ ఒక్కరూ సహకరించకపోవడమూ, రోడ్ల గుంటల్ని ఏ ప్రభుత్వ శాఖా పట్టించుకోకపోవడమూ - అది వేరే కథ!
6.25 కు ఈ ఐదారుగురు కార్యకర్తలు మాలెంపాటి అంజయ్య ప్రకటించిన గ్రామం స్వచ్చ – సుందరోద్యమ నినాదాలకు ప్రతిస్పందించి, నేటి తమ ప్రయత్నాన్ని వాయిదా వేశారు!
రేపటి పాగోలు బాటలోనే జరుగనున్న విస్తృత శ్రమదానానికి గ్రామ బాధ్యులకు స్వాగతం!
ఊరి తరపున ప్రసూనాంజలి!
అంచనాలను మించిపోయిన – హద్దులన్నీ చెరిపివేసిన
అడ్డులెన్నో దాటి వచ్చిన - స్వచ్ఛ సంస్కృతి పాదుకొల్పిన
నిత్య నీరాజనంతో మీ సొంత ఊరిని సమర్చించిన
యోధులారా! మీకిదే మా ఊరి తరపున ప్రసూనాంజలి!
- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,
08.11.2022.