2602* వ రోజు..........           25-Nov-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం దేనికి?

ఊరి ఉమ్మడి సౌకర్యార్థం – శ్రమదానోద్యమం వయస్సు – 2602* రోజులు.

          ఈ శుక్రవారం వేకువ (25.11.22) సదరు ఉద్యమ కర్తలు 31 మంది. ఆ శ్రమ పరిగ్రహీత పాగోలు గ్రామ రహదారి తూర్పు భాగం - అనగా యార్లగడ్డ శివప్రసాదు గారి గృహం – వడ్లమర ప్రాంతం! చల్లపల్లి, రామానగరం, శివరామపురం గ్రామాల నుండి కాక, పాగోలు నుండి నలుగురంటే నలుగురికే ఈ ఆదర్శ శ్రమదాన భాగస్వామ్యం!

          “కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగదు” అని ప్రజాకవి వేమన చెప్పినట్లు దుష్ట సంస్కృతులు – భ్రష్ట సంస్కృతులు - మూఢ నమ్మకాలు విజృంభించినట్లుగా ఏ కాలపు ఏ సమాజంలోనూ ఇలాంటి నిశ్శబ్ద - నిస్వార్ధ శ్రమదాన సంస్కృతి వ్యాపించదు! కాని నిరాడంబరంగా, నిరహంకారంగా, నిత్య సత్యంగా, నిబిడీకృతంగా దాని పని అది చేసుకుపోతుంది!

అలాంటి అరుదైన గ్రామాభ్యుదయకరమైన చల్లపల్లి శ్రమదాన ఆచరణలో నేటి కొన్ని ముఖ్య ఘట్టాలు :

- కుడి, ఎడమ చేతి వాటాల ఇద్దరు రైతులు రహదారి దక్షిణ భాగపు డ్రైనులో పనికిరాని చెట్లకొమ్మల్ని, గుబురుల్ని, గడ్డినీ, తీగల్ని నరుక్కొంటూ – చెక్కుకొంటూ – దంతెతో లాగి ప్రోగులు చేస్తూ - సుందరీకరిస్తూ 100 గజాల దాక ముందుకుసాగడం,

- బాటకు ఉత్తర దిక్కుగా 15 మందికి పైగా శ్రమించిన కార్యకర్తలు కాస్త సందడిగా - ఏ మొక్కను త్రుంచాలో, ఏ చెట్టును ఉంచాలో, దేనికి పాదుతీసి త్రాడు చుట్టి సంరక్షించాలో తెలిసిన మెలకువగా పనిచేసుకుపోయారు;

- ఖాళీ మద్యం సీసాల సమీకరణ గాని, ఊడ్చిన పుల్లా - పుడకా డిప్పలకు నింపే పని కాని, ప్లాస్టిక్ వస్తువుల్ని విడగొట్టి గోనె సంచులకెత్తుడు గాని, మరి కొందరి బాధ్యత;

- అది రోడ్డనుకొన్నారో, తమ ఇంటి ఆవరణనుకొన్నారో గాని – చీపుళ్ల వారు గంటన్నరపాటు శ్రద్ధగా పనిలో మునిగిపోయారు;

- ఇద్దరు సీనియర్లూ (70+ వయస్సు), మరొక గృహిణీ రోడ్డు దక్షిణాన వందల కొద్దీ ప్లాస్టిక్ సీసాల - గ్లాసుల - కప్పుల - సంచుల కశ్మలాలను పెద్ద గోనె సంచి నిండా ఏరేశారు.

          6.30 వేళ పాగోలు దుర్గా ప్రసాదు గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమ సంకల్ప సందేశ నినాదాలిచ్చాక – అక్టోబరు మాసపు ట్రస్టు జమా ఖర్చుల్ని DRK గారు ప్రకటించి, వేగేశ్న పృధ్వీరాజు (USA) గారి రేపటి ఆగమనం గురించి చెప్పారు. (ఇలాంటి పెద్దల్ని చూసేందుకు వందల మంది వస్తే స్వచ్చోద్యమ విజయం!)

          యార్లగడ్డ శివప్రసాదు గారి అల్పాహార విందును మెచ్చుకోని వారే లేరు.

          ఆదివారం తన తండ్రి – ఆత్మ పరబ్రహ్మం గారి కర్మ సందర్భానికి సహకార్యకర్తల్ని రమ్మనేందుకూ - అతని పవిత్రాత్మ స్మృతి గానూ వారి కుమారుడు బొమ్మిసెట్టి ప్రసాద్ ‘మనకోసం మనం’ ట్రస్టుకు 10,000/- విరాళం సమర్పించడం సముచితంగా ఉంది.

          ఒక సంస్కర్తా, ఒక వినమ్రుడూ, ఒక నిబద్ధుడూ ఐన “పృధ్వీరాజు” గారు, సుప్రసిద్ధ జర్నలిస్టు, మన ‘స్వచ్చ చల్లపల్లి’ ఉద్యమ అభిమాని ఐన వి.వి.సుబ్బారావు గారు పాల్గొనే రేపటి మన శ్రమదాన ప్రదేశం పాగోలు వడ్లమర పరిసరాలే!

          నవ సంస్కృతి చోదకాలు

ఊరి కొరకు వేల నాళ్లు - లక్షలాది పని గంటలు

చెమట - మట్టి - సువాసనలు, శ్రమ సంస్కృతి పరిమళాలు

నిస్వార్థ శ్రమదానపు నిలువుటెత్తు ప్రతిఫలాలు

ఎపుడే గ్రామానికైన నవ సంస్కృతి బోధకాలు!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   25.11.2022.