2603* వ రోజు...... ....           26-Nov-2022

 పర్యావరణ ధ్వంసకంగా - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం దేనికి?

2603* వ నాటిది భలే మంచి రోజు!’

          26-11-22 - శనివారం మన చల్లపల్లి స్వచ్ఛోద్యమంలో నిజంగా పసందైన రోజే!చల్లపల్లి, పాగోలు ఊళ్ల 30 - 40 మంది కాక - కాళ్లకూరులో పుట్టి, అర్ధశతాబ్దం అమెరికాలో ఎమర్జెన్సీ డాక్టరుగా సేవలందించి, భారతీయ (తెలుగు) మానవజాతి మంచి - చెడులతో ప్రయోగాలు చేసిన 83 ఏళ్ల ఒక నవయువకుడు (కేవలం 28 ఏళ్ళేనట!), తాత్త్వికుడు, హాస్య చతురుడు ఐన పృధ్వీరాజు గారు 2/3 గంటలు మన స్వచ్ఛ – సుందరోద్యమ కార్యకర్తలతో కలిసిన రోజు!

          పాగోలులో రహదారి శుభ్ర – సుందరీకరణం యధావిధిగా 4.20 నుండే జరిగింది. నిన్న చేసిన వడ్లమర దగ్గర నుండి చూస్తే – ‘ఆఁ! ఏమంత గలీజుగా లేదే - ఇందరు కార్యకర్తలకు పని చాలదే.” అనిపించింది గాని, మొదలుపెడితే గాని తత్త్వం బోధపడలేదు – డ్రైన్లలో ఎంత చెత్త - ఎండుకొమ్మలు - గంపల కొద్దీ వివిధ కశ్మలాలు నిండి ఉన్నదీ, బాట మార్జిన్లలో ఎంతెంత దుమ్ము – ప్లాస్టిక్ తుక్కులూ పడి ఉన్నదీ!

          సీనియర్ అమెరికన్ సిటిజన్ పృథ్వీరాజు గార్నే వాట్సప్ చిత్రంలో చూడండి! ఎన్ని ప్లాస్టిక్ సంచుల్ని, దుమ్మును, చెత్తనూ ప్రోగేస్తున్నారో! మురుగు నడకను అడ్డుకొంటున్న చెట్టు కొమ్మను త్రాళ్ళుకట్టి, కార్యకర్తలతోబాటు ఆయన లాగుతున్న వైనాన్నీ, వారి డ్రైవర్ గొడ్డలితో దాన్ని నరుకుతున్న దృశ్యాన్ని గమనించండి.

          ఇక్కడి వీధి పారిశుద్ధ్య శ్రమదానమంటే - భారంగా, మ్రొక్కుబడిగా జరిగేది కాదనీ, తత్త్వబల పునాదుల్తో - నిష్టతో - వేడుకగా - జరిగే ఒక సామాజిక బాధ్యతనీ నేటి గంటన్నర పనులు చూస్తే తెలియడం లేదా? ఈసురోమంటూ ఇందులో ఏ ఒక్కరైనా పనిచేస్తున్నారా? మురికి – పాచి – పెంట పనులకు వీళ్లు పోటీ పడుతున్నారా – వెనకడుగేస్తున్నారా?

          ఒక ప్రణాళిక ప్రకారం – రోజుటి వలె కాక, ఈ ఉదయం 10 నిముషాల ముందే పని నిలుపుదల చేసి, నేటి 40 మంది కార్యకర్తలూ, కన్నడ సీమ నుండి (దృశ్య శ్రవణాలుగా) వేమూరి అర్జునులవారూ, మరో నలుగురూ త్వరగా కాఫీలు ముగించి, ముగింపు సభలో నిలిచారు.’మనకోసం మనం’ ట్రస్టుకు ఆర్ధిక మౌలిక శక్తి ఐన పద్మావతి గారి గళ వినిర్గళ స్వచ్ఛ – సౌందర్య సాధక నినాదాలతో 6.20 కి మొదలైన సమావేశం DRK గారి పరిచయంతో, ప్రజా నాట్యమండలి గాయకుని పాటలతో, రాజుగారి చెణుకుల ప్రసంగంతో, 7-00 దాక సాగింది.

          నేటి శ్రమ వేడుకలో ఈనాడు సంపాదకులు V.V. సుబ్బారావు – (ఈయనే కాళ్లకూరు, చల్లపల్లి ప్రయోగాత్మక ఉద్యమాలను ఆదివారం సంచికలకెక్కించి, ఎక్కడెక్కడి చైతన్యవంతుల్ని అనుసంధానించిన వ్యక్తి) - పాల్గొని ప్రసంగించారు.

          దశాబ్దాల క్రితం చల్లపల్లిని వదలి - అమెరికాలో ఉద్యోగిస్తున్న నాదెళ్ల సురేష్ తన ఊరునూ - అక్కడి స్వచ్చోద్యమాన్ని నిరంతరం గుర్తుంచుకొని 40 - 50 కిలోమీటర్ల పరుగులు చేసి, సంపాదించిన 88,888/-  డబ్బును తల్లిదండ్రుల చేతి మీదుగా మేనేజింగ్ ట్రస్టీ గారికి అందజేశారు!

          రేపటి మన శ్రమదానం విజయవాడ రోడ్డులోని విజయా కాన్వెంట్ సమీపంలోనే ఉండునని గమనించగలరు!

       చేస్తున్నాం ప్రణామాలు  168

బ్రతుకు బరువై - మనసు ఇరుకై - మానవత్వం జాడ కరువై

స్వార్థచింతన ప్రథమ సరుకై - సమాజ భావమె మృగ్యమై

డేకుతున్న సమాజమందున దృఢంగా స్వచ్చోద్యమంలో

నిలిచి గెలిచే వాళ్లకే మా నిండు మనసులతో ప్రణామం!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   26.11.2022.