పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం దేనికి?
2605* వ వేకువ మళ్లీ రెస్క్యూ టీం వంతు.
సోమవారం (28-11-22) కాబట్టి - గతవారపు మిగులూ తగులూ స్వచ్ఛ కార్యక్రమమేదున్నా, అడుగూ బొడుగూ కర్తవ్యాలేమన్నా దొరికినా, ఏ రహదారి గుంటల - మురుగ్గుంటల - కసవు ప్రోగుల శేషబాధ్యతలున్నా అవిక ఈ ఐదారుగురు ప్రత్యేక దళం వంతనేది ఈ చల్లపల్లి స్వచ్చోద్యమంలో ఒక అప్రకటిత రాజ్యాంగం కనుక :
చల్లపల్లిలో బందరు వైపుగా 6 వ నంబరు పంటకాలువ గట్టున వడ్లమర దగ్గర కళకళలాడుతున్న ఉద్యానంలో కొన్ని పాదుల్ని సరిదిద్దుతూ, మరికొంత సుందరీకరణం నిర్వహించారు.
6.30 కి మాలెంపాటి అంజయ్య చొరవ చూపి, దైనందిన స్వచ్ఛ – సుందరోద్యమ సంబంధ నినాదాలను దంచికొట్టి, నేటి తమ పనిని అసంపూర్తిగా ముగించారు.
చేస్తున్నాం ప్రణామాలు – 169
అద్ద మిదిగో - ముఖం అదుగో - మురుగు కాల్వల పరుగులివిగో
ఊరి చరితను విప్పి చెప్పే గోడలివిగో – జాడలవిగో
‘స్వర్గపురి’ నిర్వచనమిచ్చే స్వచ్చ - శుభ్ర శ్మశాన మదిగో
స్వచ్ఛ సైన్య శ్రమను తెలిపే సాక్ష్యములకే నా ప్రణామం!
- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,
28.11.2022.