పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?
ఒక అత్యావశ్యక - స్ఫూర్తిదాయక కృషి వయస్సు 2614* రోజులు!
బుధవారం నాటి (7-12-22) వేకువ - చలిపులి గాండ్రిస్తున్న 4.20 సమయాన - తమ ఇళ్లను వీడి 2/3 కి.మీ. దూరంగా నడకుదురు బాటపైన - వీధి పారిశుద్ధ్య ప్రక్రియ కోసం పూనుకొంటున్న బాధ్యతామూర్తులు తొమ్మిది మంది! అంచెలంచెలుగా నిముషాల ఎడంతో వచ్చి కలిసినది 11 మంది! కాలుష్యం కోరల్నుండి 60 – 70 గజాల రహదారికి విముక్తి కలిగి, తెలవారే సరికి సుందరీకృతమైన వైనం!
“రెండేసి గంటల పాటు శ్రమించి, బాగుచేసింది తీరా ఈ 60 గజాల బాటనా?” అని ఎవరికైనా తోస్తే అనిపించవచ్చు గాని, చీకటి – మంచూ పెనేసుకొని బాట మీద - అప్పటికే ఎడ్ల బళ్ల రాకపోకల్తో - ద్విచక్ర, చతుశ్చక్ర వాహన వేగాల నడుమ - మురుగు కాల్వ అంచుల పైన - రకరకాల పారిశుద్ధ్య సుందరీకరణ చర్యల కష్టమెంతో, స్ఫూర్తి ఎంతో కొలువ గల వాళ్లకే తెలుస్తుంది – ఆ శ్రమదానం విలువ!
ఈ 15 - 20 మంది సామాజిక నిబద్దత కల కార్యకర్తలకు మాత్రం క్షుణ్ణంగా తెలుసు - ఇది తమ సేవ కాదు, బాధ్యతనీ - వేల మంది గ్రామస్తుల్లో ఎవరు కలిసొచ్చినా, రాకున్నా తమ శ్రమదాన ప్రస్థానం ఆగనిదనీ - ఇదేదో కొన్ని రోజుల, నెలల, సంవత్సరాలకు పరిమితం కారానిదనీ!
నేడు క్రొత్తగా పిచ్చి – ముళ్ల మొక్కలు తొలగి, మరికొన్ని చెట్ల సుందరీకరణ జరిగి, కంపుగొట్టే వంటింటి ఆహార వ్యర్ధాలు ఎత్తబడి, పర్యావరణ ప్రమాదకర ప్లాస్టిక్ తుక్కులకు మోక్షం కలిగి, మెరుగుపడిన వీధి భాగం కాక;
కొందరు కార్యకర్తలకు అంతకుముందు తాము శుభ్రపరచిన చోట కొన్ని లోపాలు కనపడడంతో వెనక్కు నడచి, చిన్న చెట్ల పాదుల్లో ఎరువు నింపి, ఒక పెద్ద తాడి బొందును కాల్వ అంచున అందంగా సర్ది, నీటి అంచున గడ్డీగాదం (అందులో కదలాడిన రక్తపింజరను చంపక వదిలేసి) తొలగించడంతో నేటి పని ముందుకు సాగలేదు!
ముగ్గురు గట్టి కార్యకర్తలకు పనికిరాని ప్రాత ‘వృక్ష రక్షక పలకల్ని’ సుత్తెలతో కొట్టి - ఇనుప తీగలు వేరు చేయడంతో గంటకాలం పట్టింది. జాగ్రత్తగానే ఉన్నా - ఒక తీగ ఒక కార్యకర్తకాలికి తగిలి రక్తమోడడం ఇంకో కొసమెరుపు!
85 ఏళ్లు నిండుతున్న చల్లపల్లి వైద్య ప్రముఖుడు - దుగ్గిరాల శివప్రసాదరాయ మహోదయుడు అంత చలిలో రావడమూ, మరొక సంవత్సరానికి సరిపడా నెలవారీ చందాలను చెక్కుల రూపంలో అందించి, స్వచ్ఛ - సుందరోద్యమాన్ని ఆశీర్వదించి, ముమ్మారు తడబాటు లేకుండ ఉద్యమ నినాదాలు చేయడమూ నేటి విశేషం!
ఈ సాయంత్రం స్వచ్ఛ కార్యకర్తల మరొక కర్తవ్యమేమంటే - BSNL గౌరిశెట్టి వారి కుమార్తె దివ్య తేజ పెండ్లి వేడుకకు హాజరై ఆశీర్వదించడం!
రేపటి వేకువ కూడ మనం తొలగించవలసిన కాలుష్యం నడకుదురు మార్గంలోనే!
‘మన కోసం’ ట్రస్టు పనులు.
అననుకూల పరిస్థితిని అనుకూలంగా మార్చుట
అనాకారి వీధులన్ని అందంగా చేసుకొనుట
మరి కొంచెం శుభ్రంగా - మరింత సౌకర్యంగా
ఊరిని రూపొందించుట – ఉన్నత స్థితికి చేర్చుట!
- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,
07.12.2022.