పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం వద్దనే వద్దు!
2617 వ వాటి శ్రమదాన విశేషాలు!
శనివారం (10-12-22) నాటి మొదటి విశేషం బాగా చలి తప్ప - వాన లేక తెరపిచ్చిన తుఫాను! ఎన్నెన్నో రకాల – కష్ట నష్టాల రైతులకు మాత్రం ఈ తుఫాను కంటగింపే! స్వచ్ఛ కార్యకర్తలదేముంది – తొమ్మిదేళ్ల నుండి అలాంటి వెన్ని చూడలేదు గనుక? గ్రామ సమాజం సౌకర్యం కోసం తమ సముచిత కాయకష్టాన్నొక ఆటగానో - వేడుకగానో జరుపుకొనే వారికి ఈ కొద్దిపాటి ఆటంకాలొక లెక్కలోవి కావు!
ఈ వేకువ కూడ 4.24 - 6.12. వేళల నడుమ 23 మంది సామూహిక ప్రయత్నంతో కమ్యూనిస్టు వీధి నుండి విజయనగర్ రెండో వరుస దాక -100 కు పైగా గజాల బందరు - బెజవాడ బాటల్ని కలిపే ఉపమార్గం మరింత నాణ్యంగా మిగిలింది! అచ్చటి నివాసితులులైన పెద్దలిద్దరు తమ రెండో లైను పొడవునా మరో 50 - 60 గజాల బారునా కార్యకర్తలకు సుందరీకరణ బాధ్యత నిచ్చి సత్కరించారు!
ఉన్న నిజం చెప్పుకోవాలంటే - అనేక ఇతర ప్రాంతాల కన్న ఇప్పుడీ రహదారి మెరుగ్గా కనిపిస్తున్నది. ఈ రోజైతే ఎందుకో రాలేదు గాని, ఇక్కడ జరిగే శ్రమదానంలో స్థానికులు పదేపదే కార్యకర్తలతో కలిసి పనిచేసేవాళ్లు.
ఈ ఉదయం ‘తక్కువ కార్యకర్తలు - ఎక్కువ పని’ అన్నట్లున్న వీధి సుందరీకరణంలో :
- ఎత్తైన చెట్టు మీద ఒతైన ఆకుల్లో ఒక “ఆకుల ప్రసాదు’ నిలబడి అరగంట పాటు సుందరీకరించడమూ - ముగ్గురతనికి సహకరించడమూ,
- ముగ్గుర్నలుగురు జంట ఆయుధాలు (కత్తి, దంతె) ధరించి డ్రైను అంచున పూల మొక్కల కొమ్మల్ని ట్రిమ్ చేసి, పనికి రాని మొక్కల్ని తునుమాడి, పాదుల్ని సరిచేయడమూ,
- రెండో వైపున కొందరు మొక్కల దగ్గరి గడ్డినీ, వ్యర్థాలనూ తొలగించడమూ,
- నలుగురు వ్యర్ధాల్ని ట్రాక్టరులో కెక్కించి, చెత్త కేంద్రానికి తరలించడమూ,
- బైపాస్ వీధిని చీపుళ్ల వారు ఊడ్చి శుభ్రతను పెంచడమూ.....
ముఖ్య వార్తలన్నమాట!
సామ్యవాద వీధి చివర ఖాళీ స్తలంలో జరిగిన సమీక్షా సభలో ముందుగా కోట పద్మావతీ ప్రకటిత స్వచ్చోద్యమ నినాదాలు, DRK గారు చేసిన శ్రమదాన విశ్లేషణా, గురవయ్య గురువుల వారి తెలుగు, సంస్కృత నీతి వాక్యాలూ కాక -
సరిగా పనిచేయని ప్రాత మైకు స్థానంలో మరొక క్రొత్త మైకును ‘షణ్మఖ’ దుకాణ దారులైన వేముల శ్రీనివాసూ, వారి అగ్రజుడు వేముల పాండురంగ బహుకరించడం ప్రశంసనీయం. సోదరులిద్దరికీ మన కృతజ్ఞతలు!
రేపటి వీధి బాధ్యతలు కూడ ఈ బైపాస్ మార్గంలోనే - నేటి తరువాయిగా జరుగగలవు!
“మనకోసం మన”మనగా:
మన గ్రామం మెరుగుదలకు ‘మన’ ట్రస్టే ఒక మూలము
ధార్మికతను వెదజల్లే స్తవ తారక మంత్రము
పచ్చదనం - పరిశుభ్రత పదిరెట్లుగా పెరుగుదలకు
ఎంతెంతో మంచి మార్పుకీ ట్రస్టే కారణము!
- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,
10.12.2022.