పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు.
గంగులవారిపాలెం బాట సౌకర్య చర్యలు - @2712*
సదరు వీధి మొదట ‘గస్తీగది’ వద్దనే - 4.30 కు ముందే రెస్క్యూ దళం ఉనికి! ఒక మరీ పెద్దాయన కాక - ఐదుగురి టీం అది! ఉదయపు నడక గాళ్లం ఇద్దరం కలిపి ఎనిమిది మంది సందడి! అక్కడి నుండి 2 గంటలు - 6.30 దాక నిర్విరామ కృషి!
20.3.23 - సోమవారం వేకువ సమయపు సంగతులవి! ఏడాకుల పెద్ద చెట్లు ఈ వీధంతా పరచుకొని, చిక్కని పచ్చదనాలు, చెట్ల నడుమ రంగురంగుల పూలమొక్కలు, నడుమ శుభ్రమైన తారు రోడ్డు - ఇంత మంచి చల్లని శుభోదయాన ఆరుగురి స్వార్ధరహిత ప్రజోపయోగ శ్రమదానం?
తొమ్మిదేళ్ల ఈ సుదీర్ఘ స్వచ్ఛ - సుందరోద్యమం కేవలం స్వయం ప్రేరితం! స్వయం సంకల్పితం! ఎవరో ప్రలోభపెడితే - ఆజ్ఞాపిస్తే జరిగే శ్రమదానం ఇంత సృజనశీలంగా - నిబద్ధంగా - ప్రయోగాత్మకంగా - ప్రయోజనకరంగా ఉండనే ఉండదు!
గ్రామ స్వచ్ఛ - సుందర - శుభ్ర వైభవంలో నా ఓటైతే వరుస క్రమంలో
1) గంగులవారి పాలెం,
2) కమ్యూనిస్టు,
3) బైపాస్ వీధులకే!
చెట్ల విలువ తెలిసిన కొందరి నడిగితే గంగులవారిపాలెం వీధికే ఎక్కువ మార్కులేస్తారు! కాని – ‘లోకొః భిన్నరుచి’ అన్నట్లు ఈ అందమైన - పొందికైన వీధి చెట్ల (సు)వాసన, పుప్పొడి కొందరికి కంటగింపుగా ఉన్నవట!
అట్టి బెంగ తీరే కృషిలోనే నేటి గ్రామ రక్షకదళం కృషి. మూడో - నాలుగో మహావృక్షాల కొమ్మల్ని చెట్టెక్కి, కత్తులతోనూ, మర రంపంతోనూ నరికి, కోసి, పడేస్తుంటే - అవి విశాఖ రుషి కొండల్లాగా మారినట్లు కొందరి కనిపిస్తున్నది! కొన్ని నెలలకెప్పుడో మళ్ళీ చిగురించి, చెట్లు గుమ్మటాల్లాగా పెరిగే దాకా అంతే సంగతి మరి!
ఏమైనా కార్యకర్తల ప్రయత్నం మాత్రం అద్భుతం - అసామాన్య సాధ్యం!
తిరిగి గస్తీ గది దగ్గరకు చేరి మాలెంపాటి అంజయ్య పలికిన గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమ నినాదాలతో నేటి శ్రమదాన పరిసమాప్తి!
సహజమైన ప్రశ్నలు ఇవి:
స్వచ్ఛ - సుందరోద్యమమున సహజమైన ప్రశ్నలు ఇవి:
అసలు ఋణగ్రస్తులెవరు? అప్పు తీర్చుచున్నదెవరు?
కార్యకర్తలకు గ్రామమ? గ్రామానికె కార్యకర్త?
క్రొత్త అప్పు చేయడమా? ప్రాత అప్పు తీర్చడమా?
- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,
20.03.2023.