2754* వ రోజు....... ... ... ....           01-May-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

రెస్క్యూ టీం పనులకు ఆటంకాలు - @2754*

            సోమవారం (1-5-23) నాటి ప్రాభాత సేవలను ఒకటీ - రెండూ కాదు మూడు మార్లు వరుణుడూ, వర్షుకాభ్రములూ అడ్డగించారు; పిడుగుల్లేవు గాని - ఉరుములూ మెరుపులూ గంగులవారిపాలెం రోడ్డును ధగధగలాడించాయి!

            అందువల్ల 7 గురు స్వచ్చ కార్యకర్తల బండ్రేవుకోడు కాల్వ గట్టు సుందరీకరణం పాక్షికంగా జరిగింది.

            ఇటు అకాల వర్షమూ - అటు గత వారపు కాల్వగట్టు శేష బాధ్యతా బహుశా నేటి తమ కృషి కార్యకర్తలకె పూర్తి సంతృప్తి నిచ్చి ఉండదు!

            ఇంత పెద్ద వానతో ఊరి రోడ్ల దుమ్ము కొట్టుకు పోయే మాట నిజమే గాని, చెట్ల ఆకులూ పూలూ మాత్రం తడి రోడ్ల మీద పరుచుకొంటాయి! ఇన్ని వేల చెట్ల కొమ్మల్లో కొన్ని ఊడి పడే ఉంటాయి కూడ!

            ఎవరి ఇళ్ళ - దుకాణాల ఎదుట ఆకులలముల్నీ పుల్లా పుడకల్నీ వారు ఊడ్చుకొంటే - స్వచ్ఛ కార్యకర్తల పని తేలికవుతుంది గాని.....

            6.00 తరువాత నేటి వీధి పారిశుద్ధ్య కర్తలు తొలి రోజుల్నాటి సీనియర్ - తూములూరి లక్ష్మణుడు ముమ్మారుచ్ఛరించిన గ్రామాభ్యుదయకర నినాదాలను పునఃకీర్తించి

            మళ్ళీ వీరిలో కొందరు 22 వ నాటి గస్తీ గది మజ్జిగ ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు ఇళ్లకేగారు.

            స్వచ్చోద్యమ ప్రయత్నం!

కాకమ్మల కథలు గాక - ఘూకమ్ముల కంపు లేక

భేకమ్ముల రొదలు లేక - చెవికింపగు గీతం వలె

శ్రావ్యంగా - మంద్రంగా - సాగే సెలయేరు లాగ

చల్లపల్లినెట్లైనా సరిజేయాలనే గదా!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   01.05.2023.