పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?
2755* వ శుభోదయాన రెస్క్యూదళం స్వచ్ఛ దిన చర్య!
మంగళవారం వేకున 4.30 - 6.10 నడుమ వాన తెరపి ఇవ్వడమే గాదు - అసలా వాతావరణమే వీధి పారిశుద్ధ్య / సుందరీకరణలకు ఎగసనగా ఉన్నది!
అసలే గ్రామ సమాజం మంచికి వేల రోజులుగా అంకితులైపోయిన ఒక ప్రత్యేక జాతి వ్యక్తులు! మురుగులో నడుం లోతున దిగేందుకూ, ఒంటికీ - బట్టలకూ బురదలంటినా సిద్ధపడిన రెస్క్యూదళం! మరి ఇంత ప్రాకృతిక సానుకూల వాతావరణంలో ఎంత ఇష్టంగా - రెచ్చిపోయి శ్రమిస్తారో ఊహించుకోండి!
ఫొటోల్లో 10 - 12 మంది దాక కనిపిస్తున్నా నేటి నికర శ్రామికులు 7 గురే! కత్తులతో – కత్తెర్లతో – దంతెలతో - 100 నిముషాలకు మించి పాటుబడింది గంగులవారిపాలెం వీధి తొలి మలుపు డ్రైను దగ్గరే! వాళ్ల ధాటికి తొలగిన కశ్మలాలూ, సుందరీకృత వృక్షాలూ సుమారు ఇరవయ్యే!
గద్దగోరు పూల మొక్కల ముళ్లు చీకట్లో వాళ్ల ఒంటికి గీసుకుపోతేనో
- పుల్లలు చేతులకు గుచ్చుకొంటేనో - క్రింద బురదలో అడుగులు బెసికి జారితేనో - అది వేరే విషయం! ఇలాంటి రిస్కులు వాళ్లకేమన్నా క్రొత్తా?
ఈ చల్లపల్లి గ్రామస్తుల్లో చాల మంది సహృదయులు వివిధ సందర్భాల్లో స్వచ్ఛ కార్యకర్తల దినచర్యల్ని మనసారా మెచ్చుకొంటారు; ఇంకొందరు ఆర్థిక – నోటి మాటల సహకారమందిస్తారు; ఉండబట్టలేని మరి కొద్దిమంది అప్పుడప్పుడూ వచ్చి, కలిసి శ్రమిస్తారు; ఎక్కడో ఒకరిద్దరు ముగ్గురు మాత్రం ఈ ఉద్యమంలో ‘తప్పులెన్నుతుంటారు’!
స్వచ్ఛ కార్యకర్తలు మాత్రం వీటికతీతంగా - దూషణ భూషణ తిరస్కారాల్లో పనికొచ్చేవి ఉంటే స్వీకరించి, అవసరమైతే సరిదిద్దుకొంటూ సాగిపోతుంటారు!
6.35 కు ఆస్పత్రి ముంగిట నేటి శ్రమదాతలు మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారి నినాదాల్ని పునరుద్ఘాటించి, శంకర శాస్త్రి - వేంకటరమణల ప్రాయోజిత క్యాడ్ బరీ/ కుక్కుటాండాలను స్వీకరించి నేటి పనులు ముగించారు.
రేపటి వేకువ మనం కలువదగిన చోటు HDFC బ్యాంక్ ఆవరణే!
చల్లపల్లి సౌభాగ్యం
ఇప్పటి స్థితి కన్నా ఇంకొంచెం మెరుగు పరచి,
భావితరం ఆరోగ్యం మరొక్కింత భద్రపరచి,
చెట్లు పెంచి, రోడ్లూడిచి, ప్రాణవాయువుల నమర్చి -
చల్లపల్లి సౌభాగ్యం సాధించాలనే గదా!
- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త – N. రామారావు,
02.05.2023.