ఆడు స్వచ్ఛ కార్యకర్తరా బుజ్జీ!
‘శుభలేఖపై హరిత వేడుకకు ఆహ్వానం అని రాయించాడు. పెద్ద పెద్దోళ్లకే సాధ్యం కాలేదు. ఇతను ఇంత నిబద్ధతతో ఒక్క ప్లాస్టిక్ వస్తువూ లేకుండా కార్యక్రమాన్ని పూర్తి చేశాడేమిటీ?’
“ఆడు స్వచ్ఛ కార్యకర్తరా బుజ్జీ!”
వెలువోలులో ఒక వేడుకకు హాజరై భోజనం చేసి వెళ్తున్న ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ ఇది.
* * *
పెళ్లిళ్లు , పంచెలు, ఓణీలు వంటి వేడుకల శుభలేఖలు ఇవ్వడానికి నా దగ్గరికి వచ్చినప్పుడు “Single use Plastic వస్తువులేవీ వాడకుండా ఆ వేడుకను ‘హరిత వేడుక’ గా జరపండి” అని అభ్యర్ధిస్తుంటాను.
- ‘ఫ్లెక్సీలు పెట్టవద్దు’.
అది కొన్ని వందల సంవత్సరాలకు కూడా భూమిలో కరగదు.
- ‘ప్లాస్టిక్ విస్తరాకులలో భోజనం వడ్డించవద్దు’.
అరటి ఆకులు గాని, ఆకులతో కుట్టిన విస్తర్లు గాని వాడండి. ప్లాస్టిక్ కోటెడ్ విస్తర్లు
వాడకండి. అవి మన ఆరోగ్యానికి ప్రమాదం. భూమిలో కలిసిపోక పర్యావరణానికీ ప్రమాదం
అని చెబుతాను.
- ‘మంచి నీళ్లు స్టీలు గ్లాసులలో ఇవ్వండి. కనీసం పేపర్ గ్లాసులలోనన్నా ఇవ్వండి’.
ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ నీళ్ళ సీసాలు వద్దు. అది రీసైకిల్ కు వెళ్లేవి తక్కువ. రోడ్డు ప్రక్కన,
డంపింగ్ యార్డులలోనూ పడవేస్తారు. భూమిలో ఉన్నా, కాలిపోయినా పర్యావరణానికి
ప్రమాదమే!
పేపర్ గ్లాసులలో కూడా లోపలి వరుస ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుందని గమనించండి.
- స్వీట్లు, ఐస్క్రీమ్ లు పేపర్ కప్పులలో ఇచ్చి అవి తినడానికి చెక్క స్పూన్లను ఇవ్వండి.
- భోజనాలు చేసే పరిసరాలు శుభ్రంగా ఉంచండి.
- గిఫ్ట్ లు ఇవ్వడం అనవసరం. ఇచ్చినా ప్లాస్టిక్ కవర్లలో ఇవ్వవద్దు.
శుభలేఖలిచ్చే వారికి ఇంత సోది చెబితే విసుగ్గా ఉండదూ! నాకు శుభలేఖ ఇవ్వడం అంటే అదొక శిక్ష.
కొంతమంది ఇవన్నీ కుదరదన్నట్లుగా మొహం పెడతారు. కొంతమంది సిన్సియర్ గా ఇవన్నీ చేయాలి గదా అనుకుని వెళ్తారు! 90 % ఆచరించి చూపుతామని ఎక్కువ మంది చెబుతారు.
కానీ వేడుకకు వెళ్ళి చూస్తే ఎన్నెన్నో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు కనిపించి నన్ను దిగిలుపరుస్తాయి. పెద్ద ఫ్లెక్సీ మనల్ని ఆహ్వానిస్తుంటుంది. ప్లాస్టిక్ గ్లాసులు గాని, ప్లాస్టిక్ మంచి నీళ్ళ సీసాలు గాని యధేచ్చగా వాడబడుతూ ఉంటాయి. ఎర్రటి ఐస్క్రీమ్ స్పూన్లు, స్వీట్లు తినడానికి వాడే ప్లాస్టిక్ కప్పులు, స్పూన్లు కంటిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
ఇది అజ్ఞానమో, అమాయకత్వమో, డబ్బు ఉంది కదా అనే అహంకారమో అర్ధం కాదు.
దిగులుగా తిరిగి రావడమే! అందుకే వేడుకలకి వెళ్ళాలంటే విరక్తి పుడుతోంది. ఇటీవల 300 కి.మీ ప్రయాణించి ఒక్క పెళ్లి వేడుకకు వెళ్ళాము. ప్లాస్టిక్ విస్తరాకులలో భోజనాలు పెడుతుంటే తినకుండానే తిరిగి వచ్చేశాము.
* * *
ఈ నేపధ్యంలో
మా స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్త ‘రామకృష్ణ, అతని భార్య నాగలక్ష్మి’ వాళ్ళ అబ్బాయి ‘సాధ్వి’ పంచల వేడుకకు శుభలేఖ ఇచ్చారు. కార్డు మీద ‘నూతన వస్త్ర హరిత వేడుక ఆహ్వానము’ అని ప్రింట్ చేయించారు.
ఫ్లెక్సీ పెట్టలేదు.
అరటి ఆకులలో భోజనం పెట్టారు. మంచి నీళ్లు పేపర్ గ్లాసులలోనే ఇచ్చారు.
ఐస్క్రీమ్ పేపర్ కప్పులలో ఇచ్చి తినడానికి చెక్క స్పూన్లనే ఇచ్చారు.
హాయిగా భోం చేసి సంతోషంగా తిరిగి వచ్చాము.
‘హరిత వేడుక’ అని దమ్ముగా కార్డు పైనే ప్రింట్ చేయించి ఆచరించి చూపిన
రామకృష్ణ – నాగలక్ష్మి దంపతులు అభినందనీయులు.
మా స్వచ్ఛ కార్యకర్తలు తమ ఇంట జరిపే వేడుకను ‘హరిత వేడుకగా’ జరిపినందుకు గర్వంగానూ ఉంది.
“ఆచరణ మాత్రమే గదా ప్రభావశీలంగా ఉండేది”.
అందుకే ఆ పెద్ద మనిషి ఈ మాట అన్నాడు.
“ఆడు స్వచ్ఛ కార్యకర్తరా బుజ్జీ” అని...
- డి.ఆర్.కె.
11.05.2025.