పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా?
2859* కి పెరిగిన పనిదినాల లెక్క!
తేది : 21.8.23, సోమవారం, కార్యరంగం మరొక తూరి గంగులవారిపాలెం రోడ్డులో మురుగు కాల్వ వంతెన ప్రాంతం, కార్యకర్తలు త్రిమూర్తులు, (పని చోటుకు దాపుగా వెళ్ళి, కూడ - వానదేవుడి అరాచకం వల్ల వెనుదిరిగి వచ్చిన నేను కాక -), నేడురా వీలుపడని (మోకాలి) ఊండెడ్ సోల్డియర్ ఇంకొకాయన!
ఇవాల్టి రెస్క్యూ టీము వారి సదుద్దేశమేమంటే - ఎలాగైనాసరే అందమైన ఆ 200 గజాల కాల్వ ఉత్తరం గట్టు బాట సుందరీకరణం ముగించాలని! అనగా - ఠీవిగా - ఎత్తుగా - ఒత్తుగా - పెరిగిన వృక్షాల మీదికి రంగురంగుల పూల తీగల్ని ప్రాకించాలనే!
రోడ్ల వార చెట్లు పెంచడం అశోకుని కాలం నుండి అక్కడక్కడా జరిగే విషయమేగాని - సదరు పచ్చని చెట్ల మీదికి పూల తీగల మర్చే పని మాత్రం చల్లపల్లి కార్యకర్తల ప్రత్యేకత!
అందుగ్గానూ ట్రాక్టరూ, దాన్లో నిచ్చెన, కత్తీ కటార్ల తోటి 4.30 కాకుండానే వాళ్ల సంసిద్ధత! నిచ్చెనలెక్కి చేసిన సుందరీకరణ విన్యాసాలు వాట్సప్ చిత్రాల్లో గమనించండి.
రెండు మార్లు చిన్నపాటివీ, ఆఖర్న భారీ వర్షమూ పడి, ఎట్టకేలకు తడిసిన బట్టల్తోనే తిరిగొచ్చి, కస్తూరి శ్రీను ఉద్యమ నినాదాలందుకొని... నేటి శ్రమ దానం ముగిసింది!
కాలుష్యంపై సుదీర్ఘ కదనానికి రారమ్మని
పచ్చదనం - పరిశుభ్రత - ప్రాణవాయువుల నడుమన
బ్రతుకుదారి పట్టండని స్వచ్ఛ సేన పదే పదే ఇచ్చిన -
ఇస్తున్న పిలుపు కేదీ సరియగు స్పందన?
- నల్లూరి రామారావు
(ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త)
21.08.2023.