2860* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా!

                              2860* వనాటి శ్రమదాన సందేశం!

          22.8.23 - మంగళవారం వేకువ 4.30 - 6.00 నడుమ గ్రామ సమాజానికి ఆ సందేశమిచ్చింది ‘రెస్క్యూ టీమ్’ అనే మారు పేరుగల స్వచ్ఛ కార్యకర్తలు కాగా -

          జై స్వచ్ఛ సుందర చల్లపల్లి - జైజై స్వచ్ఛ సుందర చల్లపల్లి

          స్వచ్ఛ సుందర చల్లపల్లిని సాధిస్తాం, సాధిస్తాం

 అనే ప్రామాణిక నినాదాలను మూడేసిమార్లు తమ టీమ్ తరపున ప్రకటించినది తూములూరి లక్షణరావు కాగా -

సదరు నినాదస్థలమూ, నేటి కార్యక్షేత్రమూ గంగులవారిపాలెం దగ్గరి వంతెన ప్రాంతం కాగా -

1) తాము నాటి పెంచిన చెట్లు విచ్చలవిడి గా కాక ఒక క్రమశిక్షణ తోనే పెరగాలనీ

2) చెట్ల మొదళ్లు మాత్రం బోసిగా ఎందుకుండాలనీ, రంగు రంగుల పూల తీగలు వాటిమీదకు ప్రాకిస్తే మరింత ఆహ్లాదకరమౌతుందనీ –

3) చెట్లు, పూల మొక్కల మొదళ్లూ కుదుళ్లూ శుభ్రంగా ఉండాలనీ –

4) ఊరంతటికీ మేటిగా నిలుస్తున్న ఈ రహదారి సొగసులేమాత్రం తగ్గేదేలేదనీ-

సుమారొక నెలరోజులుగా ప్రయత్నిస్తున్న స్వచ్ఛ కార్యకర్తల మనోరథం నేటితో పూర్తయింది.

           ఇందుగాను వాళ్లెన్ని మార్లు ఎండలకెండి, వానల్లో తడిసి, ఎన్ని శ్రమల కోర్చి, చెమటలు కార్చి ఉంటారో!

          ఊరంతటి మురికి- బురద పనుల శ్రమ సందేశం ఎప్పటికి గ్రామ సమాజం పూర్తిగా అందుకొంటుందో!

          పరిమిత రెస్క్యూ దళంకాక - అపరిమిత స్వచ్ఛ కార్యకర్తల బుధవారం శుభోదయ సమావేశం వేకువ 4.30 కు మరల - గంగులవారిపాలెం వంతెన దగ్గరే!

        పూజ చేయలేరు నిజం!

బ్రతుకు బండి లాగుటకే చాలీచాలని సమయం

నిలకడగా యోజించే నిముషమైన లేని జనం

సామాజిక బాధ్యతతో గ్రామాభ్యుదయం కోసం

రోజుకొక్క గంటైనా పూజ చేయలేరు నిజం!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   22.08.2023.