ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!
స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం –1940* వ నాటి పోరాటాలు.
స్వచ్చోద్యమ చల్లపల్లి కథ మామూలే- నాలుగైదు పాత్రలు మారడం తప్ప!
నేటి ప్రధాన గ్రామసేవా ప్రాంతం-నిన్నటి నిర్ణీత పెదకళ్లేపల్లి దారి మీది బండ్రేవు కోడు వంతెన, నూనె మిల్లు పరిసరం. వేకువ 4.08-6.15 ల నడిమి కాలంలో-ఉడతా భక్తిగా స్వచ్చంద శ్రమదాతలు 33 మంది. శ్రమదాన ఉప ప్రాంతాలు మరో రెండు- సామ్యవాద వీధి, విజయ నగర్ రెండవ వీధి.
నేను కాస్త ఆలస్యంగా వెళ్లేప్పటికే మురుగు కాల్వ దక్షిణపు గట్టు మీద పలుగులతో సాయుధులైన 16 మంది స్వచ్చ సైనికులు అస్తవ్యస్తంగా పడి ఉన్న పెద్ద బండ రాతిని పల్లంలోకి నేట్టేందుకు యుద్ధం చేస్తున్నారు. తరువాత ట్రాక్టర్ సాయం తీసుకొని, కొంత కదిలించారు. వంతెనకు ఉభయ దిశల దారి మొత్తం శుభ్ర-సుందరమైపోయింది. ఇంకా ట్రాక్టరు కెత్తలేదుగాని, బండెడు ప్లాస్టిక్ చెత్త అక్కడ పోగులు చేశారు.
గ్రామ రక్షక దళం ముందుగానే మాలెంపాటి పశువుల డాక్టరుగారి ఇంటి వద్ద వ్యర్ధాలను ట్రాక్టర్ లో నింపుకొని, నారాయణ రావు నగర్ లోని ఒక దారి దగ్గర సర్ది వచ్చారు.
సుందరీకరణ లో మునిగిన ఆరేడుగురు లబ్ద ప్రతిష్ట కార్యకర్తలు రెండు గంటలు శ్రమించి, కమ్యూనిస్టు వీధి నడుమ నున్న ‘ఎర్ర కార్యాలయ’ భవన ప్రహరీ గోడ ను ఆకర్షణీయ స్వచ్చ నినాదాలతో, ఆహ్లాదకర చిత్రాలతో అలంకరించారు.
చల్లపల్లి స్వచ్చోద్యమ అధ్యయన కారులెవరైనా ఉంటే-తప్పక గమనించదగిన అంశమేమంటే- గత ఆరేళ్ల ఈ గ్రామ స్వచ్చోద్యమం
- నిస్వార్ధ శ్రమ దాతలను వెలికి తీసింది.
- స్వార్ధ రహిత కవి గాయక చిత్ర లేఖకుల్ని తయారు చేసింది.
- వంటింటికో, చిన్న, పెద్ద వృత్తుల కో పరిమితమైన మహిళామ తల్లులను గ్రామ సేవల కోసం బజారెక్కించింది.
- అవసరార్ధం స్వచ్చ సైన్యం నుండే డ్రైవర్లను, పెయింటర్లను రూపొందించింది.
- 70, 80 ఏళ్ల వృద్ధ పింఛను దారులను పూర్తికాల(హోల్ టైమర్లు) గ్రామ సేవకులు గా మార్చింది.
6.40 కి చంద్ర హాస్పటల్ ముంగిట జరిగిన స్వచ్చ శ్రమదాన సమీక్షా సమావేశం కూడ ఉత్సాహభరితంగా సాగింది:
- యార్లగడ్డకు 80 మంది పాదయాత్రికుల ‘ స్వచ్చ నడక’, 200 మందితో అక్కడి పాఠశాలలో విజయవంతమైన సమావేశం ప్రస్తావనకు వచ్చింది.
- చిన్నాజీ గారి సుపుత్రుని రేపటి వివాహ ప్రయాణం గుర్తు చేయబడింది.
- దామినేని ధర్మారావు గారి ఇంటి భోజన-భాజనాల ఆతిధ్యం ప్రశంసించబడింది.
- స్వచ్చ-సుందర చల్లపల్లి సాధనా సంకల్ప నినాదాలను ధర్మారావు గారే ముమ్మారు ప్రకటించి, 6.50 నిముషాలకు నేటి బాధ్యతలను ముగించారు.
రేపటి మన స్వచ్చంద శ్రమదాన విన్యాస వేడుకను కూడ ఇదే చోట-బండ్రేవు కోడు కాలువ వంతెన మీద ఆగి, మొదలు పెడదాం!
ఇదే ఘనతా? ఇదే ధన్యత?
ఇచట పుట్టక- ఎక్కడెక్కడ నుండొ వచ్చిన త్యాగ మూర్తులు
ప్రతి ఫలాపేక్షలే తెలియని స్వచ్చ సుందర కార్యకర్తలు
గ్రామ మేలుకు కష్టపడినా- కలిసి నడవని అన్నదమ్ములు!
ఎంత ధన్యతొ- ఎంత ఘనతో- ఈ మహత్తర చల్లపల్లిది!
నల్లూరి రామారావు
స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,
సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,
బుధవారం – 04/03/2020
చల్లపల్లి.