ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!
స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం –1941* వ నాటి శ్రమదాన విశేషాలు.
ఈ నాటి బ్రహ్మ ముహూర్తంలో కూడ అలుపెరుగని 28 మంది శ్రమదాతలు నిన్ననే ఎంపిక చేసుకొన్న రెండు చోట్లలో 4.00 నుండి 6.15 వరకు గ్రామ సమాజ ప్రయోజనకర చర్యల తో ఆనందించారు-
1) పెదకళ్లేపల్లి మార్గం మొదట
2) సామ్యవాద(కమ్యూనిస్టు )వీధి నడుమ.
నాలుగైదు రోజులుగా-అసలే శుభ్ర-సుందరంగా కనిపించే కమ్యూనిస్టు బజారులోని CPI కార్యాలయ భవన ప్రహరీ గోడను, మరింత సుందరీకరించిన కార్యకర్తలు అదే వరుసలో ప్రక్కనే ఉన్న పూల తోట ప్రహరీకి యాజమానుల అంగీకారంతో ఈనాడు ప్రైమర్లు, రంగులు పూసే పని మొదలు పెట్టారు.
కార్యకర్తల నేటి ప్రధాన శ్రమదాన కేంద్రం బస్ ప్రాంగణం ఉత్తర దిశగా ఉన్న శివరామపురం మార్గమే. 20 మందికి పైగా స్వచ్చ సైనికులు 30-40 పని గంటల పాటు శ్రమించిన తరువాత వాసవీ కళ్యాణ మండపం వరకూ గల ఈ రద్దీ మార్గం ఇప్పుడు చూడ ముచ్చట గా ఉన్నది. ఇక్కడ నేడు ఈ ఫలాపేక్ష రహిత కర్మిష్టులు చీపుళ్లతో దారి మీది దుమ్మును ఇసుకను ఊడ్చారు; బడ్డీ దుకాణాల మాటున, క్రింద దాగిన అన్ని రకాల కాలుష్య కారక వ్యర్ధాలను పంజాలతో లాగి, పోగులు పెట్టారు. మెకానిక్ షెడ్డుల దగ్గర దరిద్రంగా పడి ఉన్న ప్లాస్టిక్ సంచుల్ని ఏరి, ట్రాక్టర్ లోకి ఎక్కించి, చెత్త కేంద్రానికి తరలించారు. దారికి ఇరువైపుల ఖాళీ స్తలాల ముందు పెరిగిన గడ్డిని, పనికిరాని-ఏపుగా పెరిగిన కంపను, పిచ్చి మొక్కల్ని నరికి, దారిని విశాల తరం చేశారు.
స్వచ్చ సైన్యంలో ఒక సృజనాత్మక చిత్రలేఖన కళాకారిణి - దేసు మాధురి ముమ్మారు ప్రకటించిన స్వగ్రామ శుభ్ర-సుందర సంకల్ప నినాదాలతోను, కర్ణాటక రాష్ట్రం నుండి 80 ఏళ్ల మన కార్యకర్త అర్జున రావు గారి స్వచ్చ శుభాకాంక్షల తోను 6.40 కు మన నేటి కర్తవ్య ఘట్టం ముగిసింది.
రేపటి మన ఆశావాహ స్వచ్చ-శుభ్ర-సుందరీకరణ కోసం RTC బస్ ప్రాంగణం ఎదుట కలుసుకొందాం!
చల్లపల్లి స్వచ్చతత్వం
ఊరి కళ తెలిపేవి గోడలు- గ్రామ కథ చెప్పేవి వీధులు
రోడ్ల అంచుల రంగు రాళ్లూ రుద్రభూముల సోయగాలూ
హరిత వృక్షపు స్వచ్చ దృశ్యం- అక్కడక్కడ పూల తోటలు
చాటి చెప్పెను చల్లపల్లి స్వచ్చతత్వం అన్ని దిశలకు!
నల్లూరి రామారావు
స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,
సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,
గురువారం – 05/03/2020
చల్లపల్లి.