1942* వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం! 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం1942* వ నాటి అప్రమత్తతలు.

నేటి వేకువ 4.00 నుండి 6.10 నిముషాల వరకు 22 మందికి మించకుండా సాఫీగా, సజావుగా జరిగిన వీధి శుభ్రతా కృషి విజయవంతమైంది. స్వచ్చ-శుభ్ర-సుందరీకృత ప్రాంతం ప్రభుత్వ రవాణా సంస్థ ప్రాంగణం మొదలు నాగాయలంక దారి మలుపు దాక.

(వివాహ వేడుకల వత్తిడి కారణంగా)స్వచ్చోద్యమ సంచాలకులు లేని-స్వయం చాలితులైన పరిమిత సంఖ్యాక కార్యకర్తల గ్రామ బాధ్యతా నిర్వహణం ప్రస్తావనార్హంగా నడిచింది:

.... “ చిత్త శుద్ధి లేని శివ పూజ లేలరా? అని ఒకప్పుడు వేమన పిడుగు వంటి ప్రశ్న సంధించాడు! ఈ రోజు చల్లపల్లి స్వచ్చ కార్యకర్తలు పూర్తి చిత్త శుద్ధితో-(అదీ తమ కోసం కాదు-గ్రామం కోసం) నిర్వహించిన కర్తవ్య పరాయణత్వంతో-బస్ ప్రాంగణం నుండి విశాలమైన- రద్దీ ప్రదేశమైన పడమటి ప్రధాన వీధి మూల మలుపు - పోతురాజు గుడిదాక దర్శనీయమైపోయింది.

సైకిల్ షాపుల, కట్టెల అడితీల, మోటారు, మెకానిక్ షెడ్డుల, మూడు దేవాలయాల, RTC ప్రయాణీకుల, కూర అంగళ్ల సమస్త వ్యర్ధాలను, ఈ కార్యకర్తలు చీపుళ్లతో (ఒకరిద్దరు రెండేసి చీపుళ్లు కూడ వాడి!) ఊడ్చారు. రోజువారీగా ఊడ్చి, ఇళ్ల వారు పోగులు చేయగా పేరుకుపోయి, గట్టి పడిన దుమ్ము-ఇసుక మిశ్రమం 6 అంగుళాల గుట్టల్ని పారలతో చెక్కి, డిప్పలతో ట్రాక్టర్ లోని కెక్కించారు.....

జరిగిన పని చిన్నది, వర్ణన పెద్దది.... అని ఎవరికైనా అనిపిస్తే వాళ్లకి నమస్కారం. టీ కొట్ల దగ్గర సరదా కబుర్ల పడమటి వీధి వారు ఎందుకు తమ ప్రాంత బాధ్యతలు పంచుకోరో అందరం ఆలోచిద్దాం!

స్వచ్చ కార్యకర్తలు ఈ సాయంత్రం 5.40 నిముషాలకే ఖచ్చితంగా పద్మావతి ఆస్పత్రి దగ్గర బస్ దగ్గర వేచి ఉండగలరు. 7.00 కు విజయవాడ దారిలోని తాడి గడప-కామినేని ఆస్పత్రి-100 అడుగుల రోడ్డు-అన్నే కళ్యాణ మండపం దగ్గర-చిన్నాజీ మాధవి దంపతులిచ్చే స్వీకార/పరిచయ విందు వేడుకలకు హాజరు కావలసి ఉంది.

ఒకటి రెండు నీతి వాక్యాలతో సహా శివబాబు గారు ముమ్మారు ప్రకటించిన గ్రామ స్వచ్చ-సుందర సంకల్ప నినాదాలతో 6.30 కి నేటి మన బాధ్యతలకు స్వస్తి!

రేపటి మన కర్తవ్యం కోసం ఉదయం 5.00 కు కీర్తి ఆస్పత్రి దగ్గర కలుద్దాం.

అదే స్వచ్చోద్యమ విలాసం

చెప్పే గొప్పలు చేసి చూపుట శ్రేష్ఠ మన్నది నిర్వివాదం

చేయు పనులకు ఫలితముంటే చెప్పరానంత మోదం

అట్టి కృషి నిస్వార్ధమైతే-అదొక స్వచ్చోద్యమ విలాసం

సదరు లక్ష్యాలన్నిటిని ఈ స్వచ్చ సైన్యం చేరుకొంటుందా!

నల్లూరి రామారావు

స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

శుక్రవారం – 06/03/2020

చల్లపల్లి.