1943*వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం! 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం1943 వ నాటి మార్పులు. 

చిరకాల పని వేళలకు భిన్నంగా-శుక్రవారం రాత్రి విజయవాడ లోని వివాహానంతర స్వీకార-పరిచయ వేడుకకు హాజరై 12 గంటలు తరువాత ఇళ్లు చేరిన కారణంగా నేటి వేకువ 5.00 నుండి 6.12 నిముషాల దాక స్వచ్చంద శ్రమదాన వేడుకను నిర్వహించిన బాధ్యులు 25 మంది. (ఎక్కడ-ఎప్పుడు-ఏ కార్యక్రమాలకు వెళ్లినా- ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఈ 1943 రోజుల సుదీర్ఘ స్వచ్చోద్యమాన్ని కార్యకర్తలు ఏ ఒక్కరోజూ ఆపలేదు!) నేటి స్వచ్చ-శుభ్ర-సుందరీకృత ప్రాంతం-బందరు జాతీయ రహదారిలో 6 వ నంబరు పంట కాలువ నుండి తూర్పు రామాలయం దాక.

ముగ్గురు ట్రస్టు కార్మికులు కూడ సహకరించిన ఈ ఉదయం కార్యకర్తలు ప్రధానంగా చీపుళ్లనే వాడుతూ, స్టేట్ బ్యాంక్ జమీందారు కళాశాల, రిజిస్ట్రారు కార్యాలయం, చిన్న జమీందారు భవనాల మీదుగా సుమారు ½ కిలో మీటరు పర్యంతం-దుమ్ము ధూళి పైకి లేస్తుండగా ఊడ్చి పోగులు చేసి, ట్రాక్టరు లో నింపుకొని, చెత్త కేంద్రానికి తరలించారు. ఒక బిర్యాని, ఫ్రైడ్ రైస్ బండి/హోటల్ క్రింద, ప్రక్కల పడి ఉన్న వ్యర్ధాల తొలగింపు కోసం ఆ హోటల్ నే ప్రక్కకు తొలగించవలసి వచ్చింది. అందమైన పూలతోట ముందు- ఇంకా అందమైన రంగు రాళ్ల మీద హోటల్ పెట్టడమే తప్పు- పంచాయితీ వారి అనుమతి ఉన్నదేమో తెలియదు. స్వచ్చ కార్యకర్తలు శ్రమించి సృష్టిసున్న అందాలను భంగపరచడం మరొక తప్పు!

6.25 నిముషాల కు స్వచ్చంద శ్రమదాన సమీక్షా సమావేశంలో

- నిన్నటి విజయవాడ నగరంలో వైభవోపేతంగా జరిగి ఆదర్శ హరిత సుందర వేడుకలో అన్నీ సక్రమంగా-వంద శాతం ప్లాస్టిక్ రహితంగా జరిపిన నిర్వాహక బాధ్యులను ప్రశంసించారు.

- స్వచ్చోద్యమ చల్లపల్లి లో ఆల్ రౌండర్ గా గుర్తింపబడుతున్న గంధం బృందావన్ ముమ్మారు దృఢంగా ప్రకటించిన గ్రామ సర్వతోముఖ స్వచ్చ-శుభ్ర-సుందర సంకల్ప నినాదాలను అంతా పునరుద్ఘాటించారు.

ఆసమయంలో ప్రకటించిన రేపటి శ్రమదాన ప్రాంతం లో ఒక గమనిక:

(బందరు దారిలో బదులు శివరామపురం మార్గంలో – మేకల డొంక- పంట కాల్వల మధ్య రేపు వేకువ కలుసుకొందాం).

            ఈ విధంగా పరిఢవిల్లిన..

స్వచ్చ-సంస్కృతి-సహన శీలన-సర్వ గ్రామ హితైక భావన

ఇంటి లోపల – ఇంటి చుట్టూ హరిత సంపద పెంచు యోచన

కన్న బిడ్డల కన్న మిన్నగ గ్రామమున ప్రతి వృక్ష రక్షణ....

స్వచ్చ ఉద్యమ మింత కన్నా పాదుకొనునా! పరిఢవిల్లున?

నల్లూరి రామారావు

స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

శనివారం – 07/03/2020

చల్లపల్లి.    

 

కీర్తి హాస్పటల్ వద్ద