పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణం మానేద్దాం!
2948* వ నాటి 40 మంది వీధి సేవలు!
అంటే – బుధవారం (22-11-23) నాటి 60-70 పని గంటల పారిశుద్ధ్య ప్రయత్నమన్నమాట! గంగులవారిపాలెం బాటలో - అటు బండ్రేవు కోడు కాలువ ఒడ్డునా, ఇటు భవఘ్ని నగర్ దగ్గరా, ఖాళీ దొరక బుచ్చుకొని 18 పొగడ మొక్కలు నాటడమూ విచ్చలవిడిగా పెరిగిపోతున్న పూల చెట్ల కొమ్మల్ని అదుపు చేయడమూ వంటి పనుల సందడి!
పని జరిగే 300 గజాల బారునా నేను తిరిగి చూశాను – విసుక్కొంటూ - గొణుక్కొంటూ పనిచేస్తున్న ముఖాలు కనపడతాయేమోనని! మురుగు కాల్వ ఒడ్డున లోతైన గోతులు త్రవ్వే వాళ్ళ ముఖ కవళికల్నీ గమనించాను - అలసట కన్పిస్తుందేమోనని! రోడ్డు ఊడుస్తున్న వాళ్ళు గాని, వ్యర్ధాల్నీ – త్రెగిన ముళ్ల కొమ్మల్నీ బండ్రేవు కోడు కాల్వ అంచుకు చేర్చి సర్దే వాళ్లు గాని ఉత్సాహంతో తప్ప - ఉసూరుమని కనపడలేదు!
అసలు - ఈ వేకువ ఎవరే పని ఎంతగా చేశారనే దానికంటే :
- ఇంత చలిలో 4.00 కన్న ముందే లేచి, కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించి, (కొందరి దృష్టిలో -) ఈ దిక్కుమాలిన పనులకు రావడమే గొప్ప!
- మొత్తం 40 మంది - అందులో 11 మంది స్త్రీ మూర్తులు – మళ్ళీ వారిలో 6 గురు భవఘ్ని నగర్ మహిళలు బిలబిలమని వచ్చిందే గొప్ప! నామర్దా పడక తమ వీధిని బాగు చేసిందే విశేషం!
నా ఎఱుకలో అసలిలాంటి ఊరి మరామత్తు పనులెక్కడా జరగడం లేదు!
కాలునుజ్జైన ఒకామె, 3 కిలోమీటర్ల దూరం ఊరి నుండి వచ్చే రైతూ, 84 - 75 ఏళ్ల 3 గ్గురు పెద్దలూ ఈమాత్రం సామాజిక బాధ్యతలు తీర్చుకోవడం చల్లపల్లికే చెల్లింది!
ఈ వేకువ కార్యకర్తలు నాటినవి మొక్కలు కాదు - బాగా ఎదిగిన 18 పొగడ చెట్లు - ఇవి కూడా పుష్పించినపుడు – అక్కడి పారిజాతాల్లాగా లేలేత నును సువాసనలు చిమ్మగలవు!
నేటి ఉత్సాహ పూరిత - ఆనందదాయక శ్రమదానం చూశాక “అరె! అన్ని వీధుల వాళ్ళూ తమ పరిసరాల పరిశుభ్రత పట్ల - ఆరోగ్యాల పట్ల ఈ వీధి నివాసుల్లా ఉంటే బాగుండు - మన ఊళ్లో అన్ని బజార్లూ ఇలా పూదోటల్తో, క్రిక్కిరిసిన పచ్చదనంతో కళకళలాడితే ఎంచక్కా ఉంటుందే" అనిపించింది!
ఏమైనా సరే! “ఈ పూట అందరికీ రుచికరమైన - బలవర్ధకమైన రాగి జావ త్రాగించాలి” అనే ఒక గృహిణి కోరిక తీరింది! ఆమె పేరు “అన్నపూర్ణ” మరి!
జాస్తి జ్ఞాన ప్రసాదుని స్వచ్ఛ - శుభ్ర – సంకల్ప నినాదాలూ, DRK గారి అవ్యాక్తానందాలూ, అడపా వారి సూక్తులూ నేటి విశేషాలు!
రేపటి వేకువ శ్రమదానం ప్రారంభమయేది ఇదే గంగులవారిపాలెం వీధిలోని సన్ ఫ్లవర్ కాలనీ రోడ్డు నుండే!
అభివందన చందనాలు!
స్వచ్ఛ సమర సింహాలై సాగుచున్న ధీరులెవరొ
ఊరుమ్మడి సౌఖ్యంకై ఉద్యమించు వీరులెవరొ
చెప్పిన దాన్నా చరించు గొప్ప గుణం ఎవ్వరిదో -
అట్టి స్వచ్ఛ సైనికులకు అభివందన చందనాలు!
- నల్లూరి రామారావు
సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,
22.11.2023.