పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణం మానేద్దాం!
మళ్ళీ బెజవాడ రోడ్డుకు మారిన శ్రమదానం- @2952*
26-11-23-ఆదివారం 2 కారణాల వల్ల శ్రమదాన స్థలం మార్పు.
మొదటిది - 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న GBR ఫౌండేషన్- జన విజ్ఞాన వేదికల ఆధ్వర్యంలోని వైద్య శిబిరం. రెండో కారణం బెజవాడ రోడ్డూ, కస్తూర్చాయి ఆస్పత్రి వీధుల్లో విద్యుత్ శాఖ వారిచే నరికి వేయబడిన చెట్ల కొమ్మలూ ఆకులూ బాగుచేయవలసిన అవసరం.
అందుగ్గానూ 23 మంది కార్యకర్తల 4.19 నుండి 6.09 దాక జరిగిన వీధి పారిశుద్ధ్య ప్రయత్నం; ఎన్నేళ్ళయినా విసుగు చెందని, పట్టు వదలని – జీత భత్యాలక్కరలేని, చల్లపల్లిలో మాత్రమే జరిగే వేకువ సమయపు సన్నివేశం!
పాఠకులొక్కసారి" జై స్వచ్చ చల్లపల్లి సైన్యం" వాట్సప్ దృశ్యాలను చూడండి, నేను వ్రాస్తున్నవి పూర్తి యదార్థాలని ధృవ పరచుకోండి.
- అదుగో- ప్రభుత్వాస్పత్రి గేటు వద్ద నేలమీద కూర్చొని, గడ్డి పీకుతూ, ప్లాస్టిక్ వ్యర్ధాలేరుతూ, శ్రమిస్తున్న వియ్యపురాళ్ళెవరను కొన్నారు? ఊళ్లోఒక లీడింగ్ హోటల్ యజమానురాలు, మాజీ వార్డు సభ్యురాలూ!
– చీకట్లోనే మురుగ్గుంటలో కాలు పెట్టి, కొమ్మ రెమ్మల్ని లాగుతున్నది 3 గ్గురు విశ్రాంత ఉద్యోగులు!
- రోడ్లూడుస్తున్నది సాక్షాత్తూ గ్రామ ప్రథమ మహిళా, ఎరువుల – పురుగు మందుల కొట్టు యజమానురాలూ!
- ట్రాక్టరెక్కి, నానాకంగాళీల్ని సర్దుతూ, ఒంటికి పుల్లలు గీసుకుపోతున్న వ్యక్తి ట్రస్టు కార్మిక పర్యవేక్షకుడూ, అతనికి ఊపిరాడకుండా క్రింద నుండి డిప్పల్తో- చేతుల్తో వ్యర్థాలనందిస్తున్న పెద్దలిద్దరూ, రైతు కార్యకర్తలిద్దరూ!
ఇలా ఆ గంటన్నర కాలం ఏ ఒక్కరు ఖాళీగాఉన్నారు గనుక! మళ్ళీ ఇందులో కొందరు ఆ దగ్గర్లో జరిగే వైద్య శిబిరంలో ఊడ్చి, బల్లలు సర్దే పనులూ చేసి వెళ్లారు. తెల్లారినా ఇంకా మంచాలకతుక్కోక - చాతనైనంతగా సొంతూరి బాగుదల కోసం కష్టిస్తున్నందుకు ప్రతి వేకువా వాళ్లకదొక తృప్తి !
వాళ్లనడిగి చూడండి.. "ఈ ఊరికి మేం చేసేది సేవేంటి- మా బాధ్యతలో భాగం" అనేస్తారు! నందేటి శ్రీనివాసుని ఉద్యమ నినాదాలతో వారి ఈనాటి బాధ్యత తీరింది. బుధవారం మళ్ళీ గంగులవారిపాలెం బాటలో దాని కొనసాగింపు..
జనం బ్రతుకుల నిండు తృప్తులు!
వింత మనుషుల వింతసేవలు-సొంతఊరికి కొంత ఊరట
ఇతర గ్రామస్తులు కలిస్తే ఉద్యమానికి క్రొత్త బాసట
అన్ని గ్రామాలనుసరిస్తే దేశమంతట కలుగు దీప్తులు
స్వచ్చ శుభ్రతలనుభవించే జనం బ్రతుకుల నిండు తృప్తులు!
- నల్లూరి రామారావు
సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,
26.11.2023.