1947* వ రోజు....

 

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం! 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1947* వ నాటి స్వచ్చతా కృషి.

 

ఈ బుధవార దివస వేకువ 4.02-6.15 సమయాల నడుమ వర్ధిల్లిన గ్రామ స్వచ్చ-సుందరీకరణ సందడిలో పాల్గొన్న 30 మంది కార్యకర్తలు అభివందనీయులు! మువ్విధములుగా సంభవించిన ఈ గ్రామ బాధ్యతా నిర్వహణ వివరాలిలా ఉన్నవి.

1. శివరామపురం మార్గంలోని మేకల డొంక వంతెనకు కొంత దూరంలో తమ పనిముట్ల వాహనాలను నిలిపి, 20 మంది కార్యకర్తలు కొడవళ్లు- చీపుళ్లు- గొర్రుల వంటి తమ ఆయుధాలతో ఒక వంక పొలం గట్టు మీది, మరొక వంక డ్రైనులోని సమస్త దుర్భర వ్యర్ధాలనూ నరికి-పీకి- ఊడ్చి, పోగులు చేసి, ట్రాక్టర్ లో నింపుకొని, చెత్త కేంద్రానికి చేర్చారు. (రెండు డిప్పల నిండా-100 ఖాళీ మాదక సీసాలు మన మద్య సంస్కృతి వైభవానికి గుర్తు!)

2. రహదార్ల రక్షక బాధ్యులు వేంకటాపురం దగ్గరి తారు పెచ్చుల్ని ట్రాక్టర్ నిండా సేకరించి, ట్రాక్టర్ ట్రక్కులో నిల్వ జేశారు. ఎక్కడెక్కడ రోడ్ల గుంటలున్న వో వెతికే పనిలో ఉన్నారు- ఈ పని రేపు పూర్తి చేస్తారు. 

3. కమ్యూనిస్టు వీధిలో ఐదుగురు కొనసాగిస్తున్న ప్రహరీల సుందరీకరణ యజ్ఞంలో ముగ్గురు కార్యకర్తల బట్టలకు, వొంటికి రంగులులంటడం చూశాను.  ఈ రోజు వీరిలో ఇద్దరు కొత్తగా మరొక ఇంటి గోడకు తలంటి పోశారు. (వీరిలో ఒక కళాకారిణి చిత్రిస్తున్న ”అత్యాధునిక యువతి” పూర్తి సోయగాన్ని రేపు మనం తిలకించగలమనుకొంటా!)

ఇవికాక యధావిధిగా ట్రస్టు కార్మికులు కొన్ని వీధుల మొక్కలకు నీరందించడం కూడ సమాంతరంగా జరిగిపోతూనే ఉన్నది.

స్వచ్చ సైన్యంలో ఇద్దరు ముఖ్య గాయనీ గాయకులు త్వరలో తాము పాడబోయే క్రొత్త స్వచ్చోద్యమ గీతాల సన్నాహాన్ని కూడ గమనించాను.

ఇంకొక దృశ్యం: చల్లపల్లి స్వచ్చోద్యమ సంచాలకుడు దాసరి రామ కృష్ణ గారు-తెల తెలవారే సమయంలో కార్యకర్తల కష్టంతో సుందరీకృత రహదార్లను పదేపదే తిరిగి చూస్తూ, పరవశిస్తూ ఛాయా చిత్రీకరణ చేస్తుండటం!

నేటి స్వచ్చ-సుందరీకరణ కృషి సమీక్షా సమావేశంలో:

- వచ్చే ఆదివారం నాటి వేకువ బాధ్యతలలో గుంటూరు నుండి ఇద్దరు ప్రముఖలు పాల్గొననుండటం.

- వాకా మౌనిక వివాహ వేడుకకు 9.00-12.30 ప్రాంతంలో మనమంతా పాల్గొనడాన్ని గుర్తుచేయడం.

- 6.35 కు ప్రశాంత మణి గారు ముమ్మారు స్వచ్చోద్యమ నినాదాలను ప్రకటించడం.

రేపటి మన ఆత్మ సంతృప్తి దాయకమగు గ్రామ కృషి శివరామపురం మార్గంలోనే!

         కాలుష్యం తలతునుము యోధులు.

నిరాయుధులనరాదు వీరిని అహింసా పరులనుటకూడదు

కత్తి- చీపురు-కలం పట్టుచు కాలుష్యం తలనరుకు వీరులు

దుమ్ము ధూళి-కలుపు-ముళ్లను తునుము యోధులు- స్వచ్చ ధీరులు

నిజంగానే చల్లపల్లిని నిశ్చయంగా మార్చివేస్తారా!

నల్లూరి రామారావు

స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

బుధవారం – 11/03/2020

చల్లపల్లి.