2988 వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

ఔనిది గ్రామ బాధ్యుల 2988* వ వేకువ సేవ!

            ఈ బుధవారం (3-1-24) కూడ నిన్నటి వలెనే 4:15 కే 12 మంది తొందర! 15 మందిది సకాలంలో చేరిక! తదాదిగా RTC బస్ ప్రాంగణంలో 6:10 దాక - ప్రధానంగా తూర్పు ఆవరణలో సందర్భాన్ని బట్టి సుందరీకరణ/ పరిశుభ్రతా చర్యలు! ఫలితంగా బాటకటూ ఇటూగా 2 ఉద్యానాల మెరుగుదల!

            స్వచ్ఛ కార్యకర్తల పట్ల తగు మాత్రం సానుకూల సదభిప్రాయం గల గ్రామస్తులు కొందరు అయ్యో! ఎండనకా మంచనకా వాన ముసురనకా వీళ్లెంత కాలం తమ ఊరి కోసం శ్రమిస్తారు? ఇంతకన్నా ఇంకా ఏం సాధిస్తారు....?” అని సంశయాత్మకంగా జాలిపడి ప్రయోజనం లేదు. కార్యకర్తలు స్పష్టతతోనే ఉన్నారు – “గ్రామ పౌరులంతా పరిసరాల స్వచ్ఛ - శుభ్ర స్పృహ ప్రదర్శించే దాక మా పట్టు వీడముఅని!

ఇంతకాలంగా ప్రతి దిన బాధ్యతానంతరం వాళ్లు ఎలుగెత్తి

జై స్వచ్ఛ సుందర చల్లపల్లి! జై జై స్వచ్ఛ - సుందర చల్లపల్లి!

స్వచ్ఛ సుందర చల్లపల్లిని - సాధిస్తాం! సాధిస్తాం!!అని నినదించడంలో ఉద్దేశ్యమదే! కనుక

            ఓ అసంపూర్ణ స్వచ్ఛ సుందరోద్యమ గ్రామమా! త్వరపడు! ఇప్పటికే రాష్ట్ర - దేశ - అంతర్దేశ వ్యాప్తంగా నీకున్న గుర్తింపును నిలుపుకో! నీ పౌరులందరికీ పరిసరాల పరిశుభ్రతనీ, తద్ద్వారా తమ ఆరోగ్య సంరక్షణనీ, పర్యావరణ శ్రేష్టతనీ గుర్తు చేసి, ముందుకు నడిపించు.

బుధవారం నాటి కార్యకర్తల కృషి కూడ 3 చోట్ల జరిగింది.

A) కోనేరు హంపి ప్రాయోజిత నీళ్ల ట్యాంకున్న పచ్చని తోట,

B) ముగ్గురు నిన్న సుందరరీకరించినా, తనివి తీరక మరొక మారు మొక్కలనలంకరించి, ఒకటికి రెండు మార్లు ఊడ్చిన మూత్రశాలల పరిసరాలు,

C) పెదకళ్ళేపల్లి రోడ్డు వైపున్న చిన్నపాటి ఉద్యానమూ

            ఇక ఆవరణను మరొకమారు ఊడ్చి శుభ్రం చేయడం షరామామూలే!

            కన్యాశుల్కం నాటకం - సారా కొట్టు సీనులో చెప్పిన్నట్లు – “ఇంత అందమైన ఆవరణలో పూదోటల ప్రక్కన బహిరంగ మూత్రవిసర్జన చేసే మహనీయులు కూడ ఇంకా చల్లపల్లిలో ఉంటారు!ఐతే ఆ ఘాటు కంపు చోటే బాగుచేసే బాధ్యతా మూర్తులూ ఉంటారు!

    ‘సుందరీకరణ ఛాంపియన్అనదగ్గ ఆకుల దుర్గాప్రసాదు గబగబా మూడు మార్లు పూర్తి చేసిన స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలతో నేటి సమీక్షా సభ ముగిసింది!

            రేపూ, ఎల్లి+ఉండీ కూడ RTC సంస్థ ప్రాంగణంలోనే మన వేకువ కలయిక" అనే నిర్ణమయూ వచ్చింది!

          ఆ మహాత్ముల కంజలిస్తాం

ఊరి వెతలకు సకాలంలో ఉద్యమించిన బాధ్యులెవ్వరొ

పాయిఖానా బజార్లను పూదోటలుగ మార్చినది ఎవ్వరొ

క్రమం తప్పక హరిత సంపద పెంచిపోషిస్తున్నదెవ్వరొ -

ఆ మహాత్ముల కంజలిస్తాం గ్రామ భవితను స్వాగతిస్తాం!

- ఒక స్వచ్ఛ సుందర కార్యకర్త

  03.01.2024