ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!
ఈ ఆదివారం వేకువ 4.08 కి వివిధ ప్రాంతాలలో, వివిధ రీతులలో మొదలైన స్వచ్చంద శ్రమదానం 3 గంటలకు పైగా కొనసాగి ఉదయం 7 గంటల తర్వాత ముగిసింది. కమ్యూనిస్టు వీధిలోనూ, పెదకళ్లేపల్లి దారిలోనూ 55 మంది పాల్గొని(ఒక దశలో ఈ సంఖ్య 70 దాటింది!) స్వచ్చోద్యమ చల్లపల్లి ప్రత్యేకతను నిరూపించారు.
“ 1951 రోజులుగా అసలేమిటి ఈ ఉద్యమం? ఏది దీని స్వభావం...” అనే తర్కానికి దిగితే:
1) ఏమి దీని తత్వం?: “ వేన వేల వత్సరాల సమాజ పరిణామ-వికాసాల వెనుక ఎందరెందరి బలి దానాలు, ఆవిష్కరణలు, సమర్పణలో ఉన్నాయి. కడివెడు పాలమీద ఒక్కింత మీగడ లాగా ఆ తరతరాల త్యాగం - కృషి ఫలితాలను ఇప్పుడు మనం ఆనందిస్తున్నాం. మరి వర్తమాన భావి సమాజాలకు మనం సమకూర్చే మేలు ఏమిటి?... అనే చింతనా క్రమమే చల్లపల్లి స్వచ్చోద్యమ పునాది!
2) ఈ గ్రామ సమాజంలోని అందరి ఆరోగ్యం, ఆనందాలే వ్యక్తుల, పౌర సమాజాల వికాసాలే లక్ష్యంగా అధికారుల, ప్రజల, రాజకీయుల, అన్ని వర్గాల సహకారంతో- భాగస్వామ్యం తో విజయవంతమౌతున్న స్వచ్చ-శుభ్ర- సుందర ప్రస్థానం ఇది!
శివరామపురం దగ్గరి పంట కాల్వ సమీపంలో రహదారి కిరుప్రక్కల 15 రోజులుగా జరుగుతున్న స్వచ్చ-సుందరీకరణమే ఈ రోజు గూడ కొనసాగింది. 40 మంది కార్యకర్తలు వివిధ పరికరాలతో వేకువనే- డ్రైను లోని అన్ని రకాల వ్యర్ధాలను, రెండవ ప్రక్క తాడి చెట్ల మొలకలను పట్టి పట్టి పెళ్లగించడంతో తెల్లవారాక చల్లపల్లి నుండి 1 ½ కిలో మీటర్ల బారునా ఈ మార్గం ఎంత కన్నుల పండుగగా ఉన్నదో ప్రతి గ్రామస్తుడూ గుర్తించాలి!
కమ్యూనిస్టు బజారులో నివశిస్తున్న చిట్టిబొమ్మ నరసింహా రావు గారు “మనకోసం మనం” ట్రస్టుకు స్వచ్చోద్యమం కోసం 1000/- , తగిరిశ సాంబశివరావు గారు 1000/- విరాళానికి స్వచ్చోద్యమ చల్లపల్లి ధన్యవాదాలు.
కమ్యూనిస్టు బజారులో రెండు వారాలకు పైగా సాగుతున్న సుందరీకరణ యజ్ఞం మరొక 4 రోజులు జరగవచ్చు! ఈ వీధిలోనే 6.50 నిముషాలకు జరిగిన దైనందిన కృషి సమీక్షా సమావేశంలో :
- కాంపౌండర్ శేషు, నందేటి శ్రీనివాస్ ల స్వచ్చ గీతాలాపనలు ఉత్తేజ కరంగా ఉన్నవి.
- తాతినేని (మొక్కల-నర్సరీల) రమణ ముమ్మారు శక్తి వంచన లేకుండ ప్రకటించిన గ్రామ శుభ్ర-సుందర సంకల్ప నినాదాలకు అదే రీతిలో మిగిలిన కార్యకర్తలు స్పందించారు.
- శుభ్ర- సుందర స్వర్గపురి నిర్మాణాలకు స్ఫూర్తి నిచ్చే గుంటూరు( గుజ్జనగుళ్ల) మహా ప్రస్థాన నిర్వాహకులు చల్లపల్లి కోట సందర్శనకై వచ్చి, స్వచ్చ-సుందర చల్లపల్లి ని చాలా వరకు తిరిగి చూసి ఏప్రియల్ మాసంలో జరిగే తమ ట్రస్టు వార్షికోత్సవంలో మన స్వచ్చ కార్యకర్తలను సమ్మానించి, లక్ష రూపాయలు బహూకరించే సమాచారం.
- సూర్యదేవర ప్రాయోజిత అనల్పాహార విందు.
రేపటి మన స్వచ్చోద్యమ సంకల్పం కోసం గ్రామ 3 రోడ్ల ప్రధాన కూడలి దగ్గర కలుద్దాం!
జనానంద సాధనకై....
ఆనందం సాధనకై అనంత మార్గాలు వెదకి
అభ్యుదయ సమీకరణకు అసంఖ్యాక దార్లు చూసి
ఒక సుదీర్ఘ ప్రణాళికతొ- ఉత్తమ కార్యాచరణగ
స్వచ్చోద్యమ చల్లపల్లి సాగుతోంది మును ముందుగ!
నల్లూరి రామారావు
స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,
సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,
ఆదివారం – 15/03/2020
చల్లపల్లి.