1952*వ రోజు....

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం! 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1952* వ నాటి గ్రామ మెరుగుదల కృషి.

సోమవార వీధి శుభ్రతా సంప్రదాయానుగుణంగా నేటి వేకువ 29 మంది స్వచ్చ కార్యకర్తల రెండు గంటల(4.01-6.12) సమయ శ్రమదానాలు చల్లపల్లి కి లభించాయి. నిన్నటి నిర్ణయానుసారం విజయవాడ- బందరు- అవనిగడ్డ ల మూడు రోడ్ల కూడలి వద్దే ప్రారంభమైన ఈ ప్రయత్నం 3 దిశలకూ-ఎక్కడ అవసరమైతే ఆ చోటుకు విస్తరించింది.

- దాదాపు అందరూ చీపుళ్ల కే పని కల్పించి, బస్ స్టాండు దిశగా పెట్రోలు బంకు, తూర్పు దిశగా షాబుల్ వీధి దాక అన్ని రకాల వ్యర్ధాలను తొలగించుకొంటూ- డిప్పలతో ట్రాక్టర్ లో నింపు కొంటూ కృతకృత్యులయ్యారు.

- సోమవార సంత దృష్ట్యా సంత వీధిని కూడ శుభ్రం చేశారు. విజయవాడ దారిలోని కస్తూరి రహదారి వనం దగ్గరకూ నేటి స్వచ్చంద శ్రమదానం విస్తరించింది. గ్రామ రెస్క్యూ టీం, సుందరీకరణ బృందం కూడ ప్రధాన వీధుల పరిశుభ్రత కే ప్రయత్నించారు.

1952 రోజులుగా ఈ కర్మిష్టులకు చేతి నిండా గ్రామ మెరుగుదల పని దొరుకుతూనే ఉందంటే- చల్లపల్లి పౌర సమాజం ఎంతగా నిర్దాక్షిణ్యంగా ఉన్నదో తెలియడం లేదా?

వేసవి తాపం మొదలైనందున నీళ్ల టాంకర్ తో ట్రస్టు ఉద్యోగులు రోజుటి వలెనే ఈ నాటి వేకువ నుండి మొక్కలకు నీరు సరఫరా చేస్తున్నారు.

6.25 సమయంలో జరిగిన రోజువారీ ఊరి మెరుగుదల కృషి సమీక్షా సమావేశంలో 82 సంవత్సరాల డాక్టర్ దుగ్గిరాల శివ ప్రసాద్ గారు ముమ్మారు తీక్షణంగా ప్రకటించిన గ్రామ స్వచ్చోద్యమ సంకల్ప నినాదాలతోనూ, ఆయన వివరణ తోనూ నేటి మన స్వయం నిర్ణేత నిరంతర గ్రామ బాధ్యత రేపటికి వాయిదా పడింది.

రేపటి స్వచ్చంద శ్రమార్పణం కోసం బందరు మార్గంలోని 6 వ నంబరు కాలువ వంతెన దగ్గర(కీర్తి హాస్పటల్ వద్ద) కలుద్దాం!

 

        స్వచ్చ సుందర పురోగమనం.

వేడుకలలో – వినోదాల్లో స్వచ్చ సుందర సు సంకల్పం

సమయదానం శ్రమ విరాళం చాలనప్పుడు అర్థ దానం

సుమారొక పందొమ్మిదొందల రోజులుగా ఈ స్వచ్చ యజ్ఞం

స్వచ్చ సైన్యం స్ఫూర్తితో ఇక చల్లపల్లి పురోగమిస్తుందా!

నల్లూరి రామారావు

స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

సోమవారం – 16/03/2020

చల్లపల్లి.    

4.01 కు సెంటర్లో
కార్యకర్తల శ్రమతో పరిశుభ్రంగా ఉన్న ప్రధాన రహదారి