3117* వ రోజు...........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

                       వీధి పారిశుద్ధ్య వ్యసనం-@ 3117 *

            వ్యసనం శనివారం వేకువ 4.17- 6.06 నడిమి సమయానిది; వ్యసనపరులు ముప్పదిన్నొక్కరు;  స్థలం - గత 5-6 రోజుల్లాగే బెజవాడ దారి యందలి విజయా కాన్వెంట్ ప్రాంతం; బాగుపడినవి 2 వీధులు!

            "ఇందరు విద్యావంతులూ, గ్రామ ప్రముఖులూ, కొందరు స్థితిమంతులూ ఎందుకు వేకువనే మన వీధికి వచ్చి, చీపుళ్లతో బజార్లనూ- కత్తుల్తో రోడ్డు వార పనికిరాని మొక్కల్ని, దంతెల్తో  డ్రైన్లలోని తుక్కునూ- నిచ్చెన్లెక్కి చెట్ల సుందరీకరణనూ చేస్తున్నారు?"  అనే జిజ్ఞాసే లేని కొందరు వాహన చోదకులూ, పరిసర గృహస్థులూ !

        పన్లూ, అలవాట్లూ ఎవరికుండవు? బారెడు ప్రొద్దెక్కినా మందకొడితనమూ,  మంచం దిగినా సొంత పనులు గుర్తొచ్చి, సామాజిక బాధ్యత గుర్తురాని ఉపేక్షా, చాల మందిని పట్టి పీడిస్తాయి గాని, స్వఛ్ఛ కార్యకర్తలకేనాటి నుండో అవి దూరమైన సంగతులు!

“ అటు చూస్తే బాదం హల్వా- ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ !

ఎంచుకొనే సమస్య కలిగిందొక ఉద్యోగికి...”

అని శ్రీ శ్రీ ఒక సాయంసంధ్యా సమస్యను ప్రస్తావించినట్లే-

నాకు కూడ ఈ ఉదయ సంధ్యలో

       "అటు చూస్తే వీధి ఊడ్పులూ – ఇటూ చూస్తే డ్రైన్ల శుభ్రతా

        ఆ ప్రక్కన రోడ్లు మరామతు – ఈ ప్రక్కన సుందరీకరణ”

 దేన్ని ముందుగా చూడాలో, మెచ్చాలో, వ్రాయాలో అనే సమస్య వచ్చింది !

 "ఎంత తెగింపు లేకపోతే- ఈ గృహిణులు, ఉద్యోగినులు నూటికి 98 మంది హీనంగా భావించే వీధి డ్రైన్ల పారిశుద్ధ్యానికి పాల్పడతారు?” అనే సందేహమూ కలిగింది!

      కొందరు ముళ్ల చెట్లనూ, కట్టు తప్పి పెరుగుతున్న చెట్ల కొమ్మల్నూ శిక్షించాక- వికాస కేంద్రం ఎదుటి గడ్డిని ఐదారుగురు కోసి శుభ్రపరిచాక- ప్లాస్టిక్ తుక్కులేరాక-   

      6. 20 సమయంలో గోళ్ల కృష్ణ తడబడి చెప్పిన స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలతో, DRK గారి సమీక్షా వచనాలతో నేటి కార్యక్రమం ముగిసింది.

     రేపటి వేకువ మన పరస్పర పునర్దర్శనం కూడ ఈ విజయవాటిక బాటలోని విజయా కాన్వెంట్ వద్దననీ నిర్ణయింపబడింది!

  

   అంకితులు మన చల్లపల్లికి 89

వయస్ససలు పాటించక - దంతెలతో, చీపురుతో

పెనవేసీ- బిగుసుకొనీ - ప్రయాణాల ప-ద-ని-సలో

 స్వచ్ఛోద్యమకారులతో అతుక్కొన్న బంధం

ఘంటా లీలా కృష్ణుని గాఢమైన అనుబంధం!

 

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త          

   11.05.2024