పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!
అది ఆదివారం - 12-5-24 వ వీధి పారిశుద్ధ్యం!
4.16 నుండి కాబోలు - అది 6.07 నిముషాల వరకూ జరుగుచునే ఉండెను! 35 మందిలోనూ 13 గ్గురు కాబోలు – అది వ్యసనమో, శ్రుతి మించిన సమయ పాలనో, మిగిలిన వాళ్ళ కన్న వెనక పడరాదనే అతి జాగ్రత్తో గాని - 4.30 కు బదులు 4.16 కే నేటి కర్మ క్షేత్రమైన విజయవాడ రోడ్డులోని విజయా కాన్వెంటు వద్ద ప్రత్యక్షమయ్యారు!
ఈ తొలి బ్యాచ్ వెను వెంటనే కార్యరంగమైన -150 గజాల దూరంలోని నారాయణరావునగర్ దగ్గరి నీళ్లు లేని మురుగు కాల్వలో దిగారు. "ఏమైనా సరే- కాన్వెంట్ వ్యర్థ జలం చేరిన రెండో ప్రక్క డ్రైనునూ, ఆస్పత్రి ప్రహరీ చివరదాకా వీధి భాగాన్ని ఈ ఉదయం పని పూర్తి చేయాల్సిందే" అనుకొన్నారుగాని, ఒక ప్రక్క డ్రైను 10 గజాల భాగం మిగిలే పోయింది!
ఈ సందర్భంగానే నాకెదురైన ఒక సంఘటన- వీలైనంత పొదుపుగా శ్రమించే నన్ను ఒక ఆనందమోహనుడు "ఒడ్డున ప్లాస్టిక్ తుక్కులే మేరతారు గాని దక్షిణపు డ్రైన్లో దిగండి – వందల కొద్దీ సీసాలున్నాయి ! ... " అని టెంప్ట్ (ప్రలోభ) పెట్టగా – తీరా దిగి వెతికితే అందులో సగం మాత్రం దొరికాయి!
ఆస్పత్రి గేటు వద్ద లోతు డ్రైన్లో పడున్న రాతి ముక్కల్ని నలుగురు సుందరీకర్త లేంచేశారో చూశారా? ఉభయ తారకంగా రోడ్డు బారునా మార్జిన్ క్రుంగకుండానూ, డ్రైన్ మర్యాదగా పారేట్లు గానూ కష్టించారు!
స్కూలు ప్రక్క డ్రైన్లో పని చేసిన ఐదారుగురు ఎంత శ్రమించిందీ ఆ చెమట - దుమ్ము- బూడిద ముఖాలు చూస్తేనే తెలిసిపోతుంది !
ఇంతకేమాత్రం తీసిపోని వీధి పారిశుద్ధ్య నైపుణ్యం చండ్ర వికాస కేంద్రం డ్రైను గట్టున 10 మందిది! వాళ్లెంత గడ్డి తొలగించారో – ఎన్ని చెట్ల పాదుల్ని పునః క్రమబద్ధీకరించారో ఫొటోల్లో నైనా చూడండి!
1) రేపటి ఓట్ల సందడికి ముందుగానే శేషు పాడిన హెచ్చరికగేయమూ ,
2) ఒక జాగ్రత్త పరుడైన అజ్ఞాతదాత 500/- విరాళమూ,
3) BSNL నరసింహ ప్రకటిత స్వచ్చోద్యమ నినాదమూ,
4) బుధవారం వేకువ మనం కలియుచోటు వికాస కేంద్రం ఎదుట అనే నిర్ణయమూ
నేటి తుది సమావేశముఖ్యాంశాలు!
అంకితులు మన చల్లపల్లికి – 90
ఘనత వహించిన గాయక కాంపౌండర్ శేషుడు
ఉరుము లేని మెరుపు వలే వచ్చు నప్పుడప్పుడు
శ్రమదానంతోబాటుగ చాల మంచి వరుసలతో
అతని గానమాకర్షణ ఆదివారమప్పుడు!
- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
12.05.2024